Begin typing your search above and press return to search.

లండన్ లో కేటీఆర్ కు ఇచ్చి పడేసిన సీఎం రేవంత్

ఇప్పుడు అలాంటి సీన్ తెలంగాణ రాజకీయాల్లో కనిపిస్తోంది. తమను అదే పనిగా విమర్శిస్తున్న మాజీ మంత్రి కేటీఆర్ ను.. పదేళ్ల కేసీఆర్ పాలనపైనా లండన్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడారు.

By:  Tupaki Desk   |   21 Jan 2024 8:22 AM GMT
లండన్ లో కేటీఆర్ కు ఇచ్చి పడేసిన సీఎం రేవంత్
X

రాజకీయాల్లో విమర్శలు.. ఆరోపణలు సర్వసాధారణం. ఇవేమీ లేకుండా రాజకీయం చేయటం తేలికైన విషయం కాదు. అలా అని.. అదే పనిగా విమర్శలు చేయటం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. అవసరానికి తగ్గట్లు స్పందిస్తూ.. సమయానికి తగ్గట్లుగా చురకలు వేయటం ద్వారా ప్రభుత్వాలు చేసే తప్పుల్ని ప్రజలకు అర్థమయ్యేలా చేయాలి. అందుకు భిన్నంగా చేతిలో అధికారం లేదన్న కారణంగానే.. విమర్శలు చేస్తున్నారన్న భావన కలిగేలా చేయటం మంచిది కాదు. అయితే.. తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో కానీ మాజీ మంత్రి కేటీఆర్ అవసరానికి మించిన విమర్శలు చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ సర్కారు కొలువు తీరి యాభై రోజలు కూడా కాలేదు. కానీ.. విమర్శల విషయంలో మాత్రం ఆయన డైలీ బేసిస్ లో చేస్తున్నారు. సాధారణంగా కొత్తగా కొలువు తీరిన ప్రభుత్వానిక కనీసం ఆర్నెల్లు సమయాన్ని ఇవ్వటం తప్పనిసరి. వారి పాలనను పరిశీలించి.. వారికి ప్రజలు ఇచ్చిన గడువులో కనీసం ఆర్నెల్ల తర్వాత నుంచి వారు తీసుకునే నిర్ణయాల్ని తప్పు పట్టటం బాగుంటుంది. అందుకు భిన్నంగా అదే పనిగా విమర్శలు చేస్తే.. అధికారంలో ఉన్న వారు చూస్తూ ఉండిపోరు కదా?

ఇప్పుడు అలాంటి సీన్ తెలంగాణ రాజకీయాల్లో కనిపిస్తోంది. తమను అదే పనిగా విమర్శిస్తున్న మాజీ మంత్రి కేటీఆర్ ను.. పదేళ్ల కేసీఆర్ పాలనపైనా లండన్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడారు. ఈ సందర్భంగా తనపైనా.. తన ప్రభుత్వం పైనా చేస్తున్న విమర్శలపై తీవ్రంగా రియాక్టు అయ్యారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఓఎస్ ను చిత్తుగా ఓడించి.. వారి నిశానీయే లేకుండా వంద మీటర్ల గొయ్యి తీసి పాతి పెడతానంటూ ఫైర్ అయ్యారు సీఎం రేవంత్.

జనవరి 26న ఇంద్రవెల్లిలో మొదలు పెట్టి.. రాష్ట్రం నలుమూలలా సుడిగాలి పర్యటనలు చేయనున్నట్లు చెప్పిన రేవంత్.. "రాష్ట్రానికి మీ నాయకత్వమా? మా నాయకత్వమా? అన్నది వచ్చే ఎన్నికల్లో తేల్చుకుందాం. సుపరిపాలన వైపురాష్టరాన్ని నడిపించాలన్న ఆలోచనతో అందరిని సమన్వయం చేసుకుంటూ తాను ముందుకు వెళుతుంటే.. బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారు. అసెంబ్లీ సమావేశాలు మొదలు పెట్టిన రోజే.. ఆరు గ్యారెంటీలు అమలు చేస్తరా? అంటూ బిల్ల రంగాలు మాట్లాడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతల్ని బొక్క బోర్లా పడేసి బొక్కలు ఇరగ్గొట్టినా వారికి బుద్ధి రాలేదు" అంటూ మండిపడ్డారు.

ఇటీవల తమ పార్టీ అధినేత కేసీఆర్ ను పులిగా అభివర్ణిస్తూ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు.. త్వరలో తమ పులి రంగంలోకి దిగనుందంటూ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ అన్నట్లుగా సీఎం రేవంత్ కాస్తంత తీవ్రంగానే రియాక్టు అయ్యారు. "పులి అంట. ఇంట్ల పండుకున్నదంట. లేచి వస్తుందంట. నేను కూడా దాని కోసమే చూస్తున్న. బిడ్డా.. మా దగ్గర బోను.. వల ఉన్నయి. రమ్మను చెట్టుకు వేలాడగడతరు. ఆ బాధ్యత మా కార్యకర్తలు తీసుకుంటరు" అని మండిపడ్డారు.

అక్కడితో ఆగని రేవంత్.. మరింత ఘాటుగా రియాక్టు అయ్యారు. 'ఆ మాటలేంది? ఆ అహంకారమేందీ? ఆ బలుపేంది? అధికార మదం ఇంకా దిగినట్లు లేదు. వచ్చే ఎన్నికల్లో ఆ బలుపును దించే పని కాంగ్రెస్ కార్యకర్తలు తీసుకుంటరు' అంటూ నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ పై పదునైన పంచ్ లు విసిరారు. తానేమీ ఆషామాషీగా ముఖ్యమంత్రిని కాలేదని.. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి.. కార్యకర్తగా మొదలు పెట్టి 20 ఏళ్లు రాజకీయాల్లో ఉన్న తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాకు చేరుకున్న విషయాన్ని గుర్తు చేశారు.

"కేటీఆర్ మాదిరి తండ్రి పేరు చెప్పుకొని.. మంత్రి అయి.. విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకు రాలేదన్న రేవంత్.. "రాష్ట్రాభివృద్ధినే మనసులో పెట్టుకుని పని చేస్తున్నాం. మా పోటీ ఏపీ.. తమిళనాడు.. కర్ణాటక లాంటి పక్క రాష్ట్రాలతో కాదు. నా పోటీ ప్రపంచంలోనే. ప్రపంచంతోనే పోటీ పడే హైదరాబాద్ నగరం.. ఐటీ హబ్.. ప్రపంచానికి వ్యాక్సిన్లు ఎగుమతి చేసే జినోమ్ వ్యాలీ.. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు.. ఓఆర్ఆర్.. ఐటీ పార్కు.. ఇంత సంపద పెట్టుకొని ప్రపంచంతో పోటీ పడటం తప్పేమవుతుంది?" అని ప్రశ్నించారు.

తమ పక్క రాష్ట్రాలు అభివృద్ధి పథంలో నడుస్తుంటే అభినందించడంలో తాను ముందు ఉంటానని చెప్పిన సీఎం రేవంత్.. దశాబ్ద కాలపు పీడకలగా మారిన కేసీఆర్ పాలనను బంగాళాఖాతంలో విసిరేశామన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినంతనే పరిపాలన మీదన ఫోకస్ పెట్టానని చెప్పిన రేవంత్.. రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురావాలన్న లక్ష్యంతో అధికారుల టీంతో దావోస్ కు వచ్చినట్లుగా చెప్పారు. 48 గంటల్లో 40వేల కోట్ల రూపాయిల పెట్టుబడులు సాధించామని చెప్పారు. అంతర్జాతీయ సంస్థలకు.. పెట్టుబడిదారులకు కలిగిన విశ్వాసానికి నిదర్శనం తాము సాధించిన పెట్టుబడులుగా పేర్కొన్నారు. మొత్తంగా తన పదునైన మాటలతో తనపై విమర్శలు చేస్తున్న గులాబీ బ్యాచ్ కు భారీనే ముఖ్యమంత్రి రేవంత్ పంచ్ లు వేశారని చెప్పాలి.