Begin typing your search above and press return to search.

కేసీఆర్ సభకు రాకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్

మనకు బాగా తెలిసిన మనిషితో కలిగే ప్రయోజనం ఏమంటే.. మన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఏ టైంలో ఎలా ఉంటామన్న విషయం వారికి ఇట్టే అర్థమవుతుంది.

By:  Tupaki Desk   |   15 Feb 2024 3:56 AM GMT
కేసీఆర్ సభకు రాకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్
X

మనకు బాగా తెలిసిన మనిషితో కలిగే ప్రయోజనం ఏమంటే.. మన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఏ టైంలో ఎలా ఉంటామన్న విషయం వారికి ఇట్టే అర్థమవుతుంది. స్నేహితుడైతే ఫర్లేదు. కానీ.. అలాంటిదే ప్రత్యర్థి విషయంలో అయితే? అన్న ప్రశ్నకు చూస్తే.. బాగా తెలిసిన ప్రత్యర్థిని ఎక్కడ.. ఎప్పుడు దెబ్బ తీయాలో ఇట్టే అర్థమవుతుంది. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే వ్యూహాన్ని అమలు చేస్తున్నారా? అంటే అవునన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు గులాబీ బాస్ కేసీఆర్ ను సభకు రాకుండా అడ్డుకోవటంలో రేవంత్ సక్సెస్ అయ్యారా? అంటే అవునంటున్నారు. కేసీఆర్ మనస్తత్వాన్ని బాగా చదివిన అతి కొద్దిమంది రాజకీయ నేతల్లో రేవంత్ ఒకరని చెబుతారు. ఎప్పుడు.. ఎలా స్పందిస్తారు? ఏ మాటకు ఎలా రియాక్టు అవుతారు? ఆయన్ను ఏ మాటలతో ఎలా కంట్రోల్ చేయొచ్చన్న విషయం సీఎం రేవంత్ కు బాగా తెలుసంటారు. ఎందుకుంటే.. గత కొన్నేళ్లుగా గులాబీ బాస్ కేసీఆర్ లోని ప్రతి అంశాన్ని లోతుగా విశ్లేషించటమే కాదు.. ఆయన్ను మరెవరూ అర్థం చేసుకోలేనంతగా.. ఆయన మైండ్ ను బాగా చదివేశారన్న మాట వినిపిస్తుంటుంది.

అందుకు తగ్గట్లే తాజా పరిణామాలు ఉన్నాయి. బడ్జెట్ సమావేశాల్లో భాగంగాఅసెంబ్లీకి గులాబీ బాస్ కేసీఆర్ హాజరవుతారని అందరూ బావించారు. కానీ.. రేవంత్ కు మాత్రం ఆయన రారన్న విషయం బాగా తెలుసని ఆయన సన్నిహితులు చెబుతారు. అంతేకాదు.. ఆయన్ను సభకు రాకుండా చేసే కిటుకు రేవంత్ వద్ద ఉందని చెబుతారు. ఈ వాదనకు తగ్గట్లే.. గడిచిన కొద్దిరోజులుగా విపక్ష నేత సభకు రావాలంటూ రోజుకు నాలుగైదు సార్లు.. ఏదో ఒక సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ నోటి నుంచి రావటం తెలిసిందే.

ఇక్కడ పాయింట్ ఏమంటే.. కేసీఆర్ ను సభకు రావాలని కోరితే.. ఆ పని ఆయన కచ్ఛితంగా చేయరని చెబుతారు. ఎందుకంటే.. ఎవరో చెబితే తాను వెళ్లేదేమిటి? అన్నది కేసీఆర్ పంతంగా చెబుతారు. అందులోకి సీఎం రేవంత్ పిలిస్తే అస్సలు వెళ్లరన్న విషయం ఆయనకు తెలుసు. అందుకేనేమో.. ఆయన్ను ప్రతి రోజూ విపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి రావాలని.. వచ్చి తమకు సలహాలు ఇవ్వాలని కోరటం తెలిసిందే. ఇలాంటి మాటలు సీఎం రేవంత్ నోటి నుంచి వచ్చినంతకాలం ఆయన అసెంబ్లీలోకి అడుగు పెట్టే అవకాశం లేదంటున్నారు. ఎవరో రాసిన స్క్రిప్టుకు తాను పాత్రధారిని కావటం ఏమిటన్నది కేసీఆర్ ఫీలింగ్ గా చెబుతారు. ఆ ఫీలింగ్ ను ఎప్పటికప్పుడు తట్టి లేపుతూ రేవంత్ తాను అనుకున్నది అమలు చేస్తున్నారని చెబుతున్నారు. తన ‘చిప్’ను రేవంత్ బాగా చదివేశారన్న విషయాన్ని పలువురు చెబుతుంటారు. అందుకు తగ్గట్లే పరిణామాలు ఉండటం విశేషం.