Begin typing your search above and press return to search.

బక్కోడు కాదు బకాసురుడు.. కేసీఆర్ పై రేవంత్ అదిరే కౌంటర్

కేసీఆర్ తనను తాను బక్కోడ్ని అని చెప్పుకుంటారని కానీ ఆయన అసలుసిసలు బకాసురుడుగా అభివర్ణించారు.

By:  Tupaki Desk   |   23 Nov 2023 5:20 AM GMT
బక్కోడు కాదు బకాసురుడు.. కేసీఆర్ పై రేవంత్ అదిరే కౌంటర్
X

తనను తాను బక్కోడిగా అభివర్ణించుకుంటూ ఉంటారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ఇన్నేళ్లుగా ఆయన నోటి నుంచి ఆ మాటకు ఎవరూ మాట అన్నది లేదు. ఆ మాటకు వస్తే.. ఆ ధైర్యం చేసినోళ్లు లేరు. అందుకు భిన్నంగా తాజాగా దిమ్మతిరిగే షాకింగ్ కౌంటర్ టీపీసీసీ రథసారధి రేవంత్ నోటి నుంచి వచ్చింది. కేసీఆర్ తనను తాను బక్కోడ్ని అని చెప్పుకుంటారని కానీ ఆయన అసలుసిసలు బకాసురుడుగా అభివర్ణించారు. అంతేకాదు.. తన మాటకు జస్టిఫికేషన్ గా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

‘ఏ మీటింగ్‌కు పోయినా నేను బక్కోడిని నేను బక్కోడిని అని కేసీఆర్‌ చెప్పుకొంటూ ఉంటారు. ఈ బక్కోడి మీద పది మంది పడుతున్నరని చెబుతుంటారు. కానీ, ఆయన బక్కోడు కాదు. బకాసురుడు. లక్ష కోట్ల తెలంగాణ సంపద మింగాడు. హైదరాబాద్‌ చుట్టూ పది వేల ఎకరాల భూమిని దిగమింగాడు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. తాను ఎన్నికల్లో ఓడితే తాను ఫాంహౌస్ కు పరిమితమవుతానని.. నష్టపోయేది తెలంగాణ అంటూ చేసే వ్యాఖ్యలపైనా రేవంత్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘ఓడిపోతే ఫాంహౌస్‌కు పోయి పడుకుంటానని కేసీఆర్‌ అంటున్నారు. కానీ గజ్వేల్‌ యువత ఊరుకోరు. పొలిమేరలు దాటే వరకు తరిమికొడతారు. గజ్వేల్‌లో తనపై వ్యతిరేకతను గ్రహించే కేసీఆర్‌ కామారెడ్డికి పారిపోయాడు. కానీ అక్కడ అసలైన వేటగాడు ఉన్నాడు’ అని రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

కేసీఆర్ మాటకు మాట చెప్పటం అంత తేలికైన విషయం కాదు. ఈ విషయంలో ఆయనకు సరైన రీతిలో సమాధానం చెప్పే సత్తా ఉన్న నేతగా పేరున్న రేవంత్.. తాజాగా తన మాటలకు మరింత పదును పెట్టారు. కీలకమైన ఎన్నికల ప్రచారంలో ఆయన కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు చూస్తే.. ఇప్పటివరకు ఆయనపై ఇంత ఘాటుగా వ్యాఖ్యలు చేసినోళ్లు కనిపించరు. ‘‘ఓడిపోతే ఫాంహౌస్‌కు పోయి పడుకుంటానని కేసీఆర్‌ అంటున్నారు. కానీ గజ్వేల్‌ నుంచి కామారెడ్డికి పోయినా, శంకరగిరి మాన్యాలకు వెళ్లినా గజ్వేల్‌ యువత ఊరుకోరు. ఫాంహౌస్‌లో పంటానంటే ఊరుకోబోం. పొలిమేరలు దాటే వరకు తరిమికొడతాం. అక్రమంగా సంపాదించిన లక్ష కోట్లు కక్కిస్తాం’’ అంటూ విరుచుకుపడ్డారు.

గజ్వేల్‌ పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన రేవంత్.. ‘నేను గజ్వేల్‌కు వస్తున్నానని తెలిసి కేసీఆర్‌.. నేను పోటీ చేస్తున్న కొడంగల్‌ నియోజకవర్గానికి వెళ్లి అడ్డం పొడుగు మాట్లాడాడు. నేను అబద్ధాలు చెబుతానని ఆరోపించాడు. అదే నిజమైతే డ్రంకన్‌ డ్రైవ్‌ టెస్టుల మాదిరిగా అబద్ధాల టెస్ట్‌కు నేను సిద్ధం. నేను సుక్క ముట్ట.. కానీ, కేసీఆర్‌ సుక్క లేనిదే కాలు బయట పెట్టడు. కేసీఆర్‌కు నాకూ పోలిక ఏమిటి?’ అంటూ ఫైర్ అయ్యారు.

గజ్వేల్‌లో ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను గ్రహించే కేసీఆర్‌ కామారెడ్డికి పారిపోయాడని, అక్కడ అసలైన వేటగాడు ఉన్నాడని పేర్కొన్న రేవంత్.. తాను కామారెడ్డిలో పోటీ చేయటం గురించి ప్రస్తావించారు. కామారెడ్డి రైతులు కేసీఆర్‌కు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ‘‘గజ్వేల్‌లో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కేసీఆర్‌ సంపాదన ఎంత?ఇప్పుడు ఎంత? కొండపోచమ్మ సాగర్‌ ప్రాజెక్టులో తన చుట్టం కావేరీ భాస్కర్‌రావు భూములు పోకుండా కేసీఆర్‌ అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. కానీ, ప్రజల భూముల్ని, రైతుల భూముల్ని మాత్రం ముంచాడు. ఆ కృతజ్ఞతతోనే కేసీఆర్‌ ఫాంహౌ్‌సలో పండించిన ధాన్యాన్ని కావేరి కంపెనీ వాళ్లు రూ.4,250కి క్వింటాలు చొప్పున కొనుగోలు చేస్తున్నారు. సాధారణ రైతుల ధాన్యానికి మాత్రం రూ.1500, రూ.1600 ఇస్తూ.. తాలు, తట్టూ, పొల్లు, తరుగు పేరుతో క్వింటాలుకు పది కిలోలు కట్‌ చేస్తున్నారు’’ అంటూ కొత్త విషయాన్ని తెర మీదకు తీసుకొచ్చారు.