Begin typing your search above and press return to search.

మల్లారెడ్డికి రేవంత్‌ మార్క్‌ షాక్‌!

గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీలో హెచ్‌ఎండీఏ లే అవుట్‌ లో మల్లారెడ్డి వేసిన రోడ్డును అధికారులు తొలగించారు.

By:  Tupaki Desk   |   2 March 2024 8:32 AM GMT
మల్లారెడ్డికి రేవంత్‌ మార్క్‌ షాక్‌!
X

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డికి రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీలో హెచ్‌ఎండీఏ లే అవుట్‌ లో మల్లారెడ్డి వేసిన రోడ్డును అధికారులు తొలగించారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో మల్లారెడ్డి కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ సమయంలో గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీలో హెచ్‌ఎండీఏ లే అవుట్‌లో 2,500 గజాల భూమిని మల్లారెడ్డి ఆక్రమించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆక్రమించిన స్థలంలో తన కాలేజీకి ఆయన రోడ్డు నిర్మాణం చేశారని విమర్శలు ఉన్నాయి.

నాడు మల్కాజిగిరి ఎంపీగా ఉన్న రేవంత్‌ రెడ్డి ఈ వ్యవహారంపై అధికారులకు సైతం ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి కాలేజీ కోసం మల్లారెడ్డి రోడ్డును వేసుకున్నారన్నారు. అయితే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో మల్లారెడ్డిపై ఎలాంటి చర్యలు చేపట్టలేదు.

అయితే ఇప్పుడు తాజాగా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మల్లారెడ్డి ఆక్రమించిన భూమి అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దీంతో మేడ్చల్‌ కలెక్టర్‌ ఆదేశాలతో హెచ్‌ఎండీఏ లే అవుట్‌లో మల్లారెడ్డి వేసిన రోడ్డును అధికారులు తొలగించారు.

కాగా రోడ్డు తొలగింపుపై మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను కావాలనే కొంతమంది టార్గెట్‌ చేశారని ఆరోపించారు. ప్రభుత్వం తనపై రాజకీయంగా కక్ష సాధిస్తోందని మండిపడ్డారు. అధికారం వాళ్ల చేతుల్లో ఉంది కాబట్టి ఏమైనా చేస్తారని విమర్శించారు. హెచ్‌ఎండీఏ అధికారుల అనుమతి తీసుకునే అప్పట్లో కాలేజీకి రోడ్డు నిర్మించామని మల్లారెడ్డి తెలిపారు.

ఇందుకు ప్రత్యామ్నాయంగా 2,500 గజాల స్థలానికి ప్రత్యామ్నాయంగా మరో స్థలాన్ని మున్సిపాలిటీకి ఇచ్చామని మల్లారెడ్డి తెలిపారు. కాలేజ్‌ కి పోయే రోడ్డు తొలగించడంతో 25 వేల మంది విద్యార్థులు, అధ్యాపకులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పై మా కాలేజ్‌ వద్ద ట్రాఫిక్‌ సమస్య విపరీతంగా పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

గత ప్రభుత్వంలో అక్రమాలకు, అవినీతికి పాల్పడ్డవారిని ప్రభుత్వం వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే గొర్రెల పంపిణీ పథకంలో అవినీతిపై కేసులు నమోదు చేశారు. ఇటీవల హెచ్‌ఎండీఏ అధికారి బాలకృష్ణను కూడా అరెస్టు చేశారు.

కాగా 2019 ఎన్నికల్లో మల్లారెడ్డి మేడ్చల్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీ గెలిచాక రేవంత్‌ కు అనుకూలంగా, కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరతానన్నట్టుగా వ్యాఖ్యానించారు. అయితే ఆయనను చేర్చుకోవడానికి కాంగ్రెస్‌ పార్టీ మొగ్గుచూపకపోవడంతో బీఆర్‌ఎస్‌ లోనే కొనసాగుతున్నారు.