పదేళ్లలో రూ.13.72లక్షల కోట్ల ఖర్చు.. కేసీఆర్ పాలనపై రేవంత్ ఫైర్!
తాజాగా హరీశ్ చేసిన ప్రసంగంపై ముఖ్యమంత్రి రేవంత్ నిప్పులు చెరిగారు.
By: Tupaki Desk | 21 Dec 2023 9:16 AM ISTతెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బుధవారం హాట్ హాట్ సన్నివేశాలు సభలో రాజకీయ వేడిని రగిలించాయి. విపక్షాలకు మాట్లాడే సమయం ఇస్తున్న రేవంత్ రెడ్డి సర్కారులో.. బీఆర్ఎస్ నేతలు అధికార కాంగ్రెస్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటివేళ.. వారి వ్యాఖ్యలకు సీఎం రేవంత్ ఘాటైన రీతిలో రియాక్టు అవుతున్నారు. తాజాగా హరీశ్ చేసిన ప్రసంగంపై ముఖ్యమంత్రి రేవంత్ నిప్పులు చెరిగారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చ సందర్భంగా.. అధికార.. ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చ జరగ్గా.. హరీశ్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రియాక్టు అవుతూ.. ఇప్పటికి హరీశ్ మంత్రి అనుకుంటున్నారు. మంత్రిలా వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారంటూ విమర్శించారు.
కాళేశ్వరం మీద వివరాల్ని చెప్పాల్సిన బాధ్యత తమ మీద ఉందన్న ఆయన రూ.1.34 లక్షల కోట్లకు టెండర్లు పిలిచారని.. రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టినా లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదన్నారు. సత్యహరిచంద్రుడి మాదిరి హరీశ్ మాట్లాడుతున్నారని.. తప్పు ఒప్పుకొని క్షమించాలని పేర్కొంటే హుందాగా ఉండేదంటూ సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో రూ.13.77లక్షల కోట్లను ఖర్చు చేశారన్న రేవంత్.. ఆయన పాలనలో సాగిన తప్పుల్ని ఏకరువు పెట్టారు.
పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లను ఇవ్వలేదన్న సీఎం రేవంత్.. ‘‘దళితులకు మూడు ఎకరాలు ఇవ్వలేదు. రాజీవ్ ఆరోగ్య శ్రీకి నిధులు ఇవ్వలేదు. హాస్టల్ లో వంట చేసే వాళ్లకు కూడా జీతభత్యాలు ఇవ్వలేదు. ఉద్యోగులకు మొదటి రోజున జీతాలు ఇవ్వలేదు. పెన్షన్ ఇచ్చి పెద్ద కొడుకుని కేసీఆర్ అన్నారు. వాళ్లకు కూడా నెల నెల పెన్షన్ ఇవ్వలేదు. ఓఆర్ఆర్ ను కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో క్రియేట్ చేస్తే.. కేసీఆర్ సర్కారు అమ్ముకుంది. వైన్ షాప్ టెండర్ కూడా నాలుగునెలల ముందే పిలిచేశారు. వచ్చేటోడు.. నిలబడే పరిస్థితి కూడా లేకుండా చేశారు. చెప్తే సిగ్గు పోతుందంటున్నారు.. ఊరుకుంటే ప్రాణాలు పోతాయి. వెట్టి చాకిరిని నిషేధించాం. బీఆర్ఎస్ వాళ్లకు కూడా స్వేచ్ఛ ఇస్తున్నాం’’ అంటూ వరుస విమర్శలతో విరుచుకుపడ్డారు.
