Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ కు ఘన నివాళులకు ఆ సీఎం దూరం

తెలంగాణకు సీఎం అయ్యాక తొలిసారి విదేశీ పర్యటన చేపట్టిన రేవంత్ ప్రస్తుతం దావోస్ లో ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొంటున్నారు.

By:  Tupaki Desk   |   18 Jan 2024 9:08 AM GMT
ఎన్టీఆర్ కు ఘన నివాళులకు ఆ సీఎం దూరం
X

తెలుగు జాతి గర్వించదగ్గ నటుడు రాజకీయ నాయకుడు నందమూరి తారక రామారావు. క్రమశిక్షణ, పట్టుదల, ప్రజలకు సేవ చేయాలన్న తపన.. ఎన్టీఆర్ ను అత్యున్నత వ్యక్తిగా నిలిపాయి. సినీ రంగంలో నంబర్ వన్ గా ఉండగానే, రాజకీయ పార్టీని స్థాపించి.. దశాబ్దాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని 9 నెలల్లోనే అధికారం నుంచి పడదోసిన రికార్డు ఆయన సొంతం. అంతేకాదు.. ఆయన స్థాపించిన తెలుగు దేశం పార్టీ (టీడీపీ) తెలుగు రాజకీయాలను సామాజికంగా గొప్ప మలుపుతిప్పింది. మరీ ముఖ్యంగా తెలంగాణలో అంతకుముందు నిరాదరణకు గురైన వర్గాలకు గళంగా నిలిచింది. ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా 40 ఏళ్లుగా టీడీపీ తెలంగాణలో ఉనికి చాటుతూనే ఉంది. అంతేకాదు.. తెలంగాణకు సీఎంలు అయిన ఇద్దరు కేసీఆర్, రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించినవారే.


టీడీపీ కార్యకర్తల కారణంగానే..

తెలంగాణలో గత నెలలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి 2008లో టీడీపీలో చేరారు. అంతకుముందు జడ్పీటీసీ సభ్యుడిగా, స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా స్వతంత్ర అభ్యర్థిగానే గెలిచారు. 2009 ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీకి దిగి సంచలన విజయం సాధించారు. కాగా, 2014లోనూ గెలుపు అందుకున్న ఆయన 2018లో మాత్రం పరాజయం చవిచూశారు. అప్పటికి తెలంగాణలో టీడీపీ మరింత బలహీనపడింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి ఎంపీగా నెగ్గారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగిందో అందరూ చూసిందే. ఈ మొత్తం ప్రస్థానంలో తనకు టీడీపీ ఇచ్చిన ప్రోత్సాహాన్ని రేవంత్ ఎప్పుడూ గుర్తు చేస్తుంటారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కారణంగానే తాను ఈ స్థాయిలో ఉన్నట్లుగా చెబుతారు. టీడీపీతో వ్యక్తిగతంగానే కాక కుటుంబ పరంగానూ తనకు బంధం ఉందంటారు. టీడీపీలో ఉన్న సమయంలో రేవంత్ ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ను ఘనంగా స్మరించుకునేవారు. ఎన్టీఆర్ తీసుకొచ్చిన సామాజిక మార్పును ప్రశంసించేవారు. ఇక మొన్నటి ఎన్నికల్లో రేవంత్ నాయకత్వాన్ని సీమాంధ్ర ఓటర్లు బలపరిచారు. ఆయన సీఎం అయ్యేందుకు దోహదపడ్డారు.

దావోస్ తో దూరం..

తెలంగాణకు సీఎం అయ్యాక తొలిసారి విదేశీ పర్యటన చేపట్టిన రేవంత్ ప్రస్తుతం దావోస్ లో ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొంటున్నారు. మూడు రోజులుగా అక్కడే ఉంటున్న ఆయన రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడుల ఆకర్షణకు ప్రయత్నాలు చేస్తున్నారు. గౌతమ్ ఆదానీ, టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ వంటి పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ అయ్యారు. మరోవైపు దావోస్ సదస్సు గురువారం కూడా కొనసాగనుంది. దీంతో రేవంత్ అక్కడే ఉండిపోనున్నారు. ఈ కారణంగా.. ఎన్టీఆర్ కు వర్థంతిలో రేవంత్ పాల్గొన లేకపోతున్నారు.

సీఎం అయ్యాక తొలిసారి

రేవంత్ సీఎం అయ్యాక జరుగుతున్న ఎన్టీఆర్ తొలి వర్థంతి ఇది. హోదా ప్రకారం చూస్తే ఇప్పుడు ఆయన నివాళులర్పిస్తే అది పెద్ద కార్యక్రమంగా మిగిలేది. అయితే, దావోస్ సదస్సులో పాల్గొంటున్నందున రేవంత్ హాజరుకాలేకపోతున్నారు. అలా ఒకప్పటి తన పార్టీ వ్యవస్థాపకుడికి సీఎం హోదాలో తొలిసారి నివాళులు అర్పించలేకపోయారు. అయితే, దావోస్ నుంచి తిరిగొచ్చాక అయినా ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లి నివాళులర్పిస్తారేమో చూడాలి..?