Begin typing your search above and press return to search.

ప్రజాదర్బార్ కు వచ్చే వారికి బ్రేక్ ఫాస్ట.. రేవంత్ నిర్ణయం?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి వాయు వేగంతో నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంచనాలకు మించి ఒకటి తర్వాత ఒకటి చొప్పున ఆయన నిర్ణయాలు ఉంటున్నాయి.

By:  Tupaki Desk   |   11 Dec 2023 4:55 AM GMT
ప్రజాదర్బార్ కు వచ్చే వారికి బ్రేక్ ఫాస్ట.. రేవంత్ నిర్ణయం?
X

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి వాయు వేగంతో నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంచనాలకు మించి ఒకటి తర్వాత ఒకటి చొప్పున ఆయన నిర్ణయాలు ఉంటున్నాయి. చేయాలనుకున్న పనిని స్పష్టంగా.. పూర్తి క్లారిటీతో చేసుకుంటూ పోతున్నారు. ఇందుకోసం ఆస్సలు ఆలస్యం చేయకపోవటం గమనార్హం. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాతి రోజే.. ప్రజాభవన్ లో ప్రజాదర్బార్ ను నిర్వహిస్తామని చెప్పటమే కాదు.. గంటల వ్యవధిలో దాని కోసం పెద్ద వ్యవస్థనే సిద్ధం చేశారు.

వందకు పైగా అధికారుల్ని నియమించటం.. మూడు దశల్లో ఫిర్యాదుదారుల ఫిర్యాదుల్ని డిజిటలైజ్ చేయటం.. వాటిని ఆయా జిల్లాలకు పంపటం.. సచివాలయంలో ఒక విభాగంలో వీటిని మానిటర్ చేయటం లాంటివి చేశారు. అంతేకాదు.. ఫిర్యాదులు ఇవ్వటానికి వచ్చిన వారికి ఆ ఒక్క రోజు పంపిణీ చేసిన వాటర్ బాటిళ్లు అక్షరాల 15వేలుగా చెబుతున్నారు. ఉదయం పదిగంటల వేళలో మొదలైన ప్రజాదర్బార్.. సాయంత్రం నాలుగు గంటల వరకు సాగింది. కాకుంటే.. ముఖ్యమంత్రి రేవంత్ మాత్రం దగ్గర దగ్గర గంట వరకు ఉన్నారు. ఆ తర్వాత మంత్రి సీతక్క స్వయంగా ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించారు.

విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రజాదర్బార్ లో తమ సమస్యల్ని ముఖ్యమంత్రికి విన్నవించుకోవటానికి పెద్ద ఎత్తున ప్రజలు రావటం.. వారిలో ఎక్కువ మంది వివిధ జిల్లాల నుంచి వచ్చిన విషయాన్ని గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఉదయం 10 గంటల తర్వాతే ప్రజాదర్బార్ ప్రారంభం అవుతుందని చెప్పినా.. కొంతమంది ఉదయాన్నే వచ్చేశారు. దీంతో.. వారు ఆకలితో ఇబ్బందికి గురైనట్లుగా తెలుస్తోంది.

ఈ అంశం ముఖ్యమంత్రి రేవంత్ వరకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. దీంతో.. ప్రజాదర్బార్ ను మరింత పకడ్బందీగా నిర్వహించాలన్న యోచనలో ఉన్న ముఖ్యమంత్రి.. త్వరలోనే ప్రజాదర్బార్ రోజున ఉదయాన్నే అల్పాహారాన్ని ఏర్పాటు చేసేలా చూడాలన్న ఆలోచనను అధికారులతో పంచుకున్నట్లుగా తెలుస్తోంది. జిల్లాల నుంచి వచ్చే వారు.. ప్రజాభవన్ చుట్టుపక్కల టిఫెన్ల కోసం వెతుక్కొని.. తినటం కష్టమవుతుందని.. అలాంటి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా టిఫెన్లు పెడితే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

టిఫిన్లను రెండు వెరైటీలు పెడితే బాగుంటుందన్న మాటను చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో.. కీలక అధికారులు ఈ అంశంపై ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే ఉంటుందని తెలుస్తోంది. ప్రజాదర్బార్ ను ఒక ఫార్సు దర్బారుగా కాకుండా.. రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి అందుబాటులో ఉండటమే కాదు.. వారి బాధలు చెప్పుకునేందుకు వచ్చే వారికి కనీసం ఆకలిబాధ లేకుండా చేయాలన్నది ఆలోచనగా తెలుస్తోంది.