రేవంత్ .. (కొత్త సీఎం) కాన్వాయ్ నంబర్లన్నీ 9999
ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో కాబోయే ముఖ్యమంత్రిగా భావిస్తున్న రేవంత్ రెడ్డి లక్కీ నంబరు ‘‘9‘‘.
By: Tupaki Desk | 5 Dec 2023 2:00 PMతెలంగాణలో మొన్నటివరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లక్కీ నంబరు ‘‘6’’. ఆయన ఏ పని చేసినా 6తో ముడిపడి ఉండేది. ఆఖరికి జిల్లాల ఏర్పాటులోనూ (33) దీన్ని వదల్లేదు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో కాబోయే ముఖ్యమంత్రిగా భావిస్తున్న రేవంత్ రెడ్డి లక్కీ నంబరు ‘‘9‘‘. వాస్తవానికి కేసీఆర్ సెంటిమెంట్లు, హిందూ సంప్రదాయాలను బాగా ఫాలో అవుతారు. రేవంత్ పెద్దగా పట్టించుకోకున్నా.. పూజలు, పద్ధతులను విస్మరించరు.
కాన్వాయ్ మారుతోంది..
తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్ ను ఖరారు చేసింది కాంగ్రెస్ అధిష్ఠానం. దీంతోనే అని కాకుండా.. ఎన్నికల ఫలితాల అనంతరం ముఖ్యమంత్రి కాన్వాయ్ ను సాధారణ పరిపాలన విభాగం సిద్ధం చేసింది. ప్రాథమికంగా తెలుపు రంగు కాన్వాయ్ నే ఉంచారు. ఈ మేరకు దిల్ కుషా గెస్ట్ హౌస్ కు ఆరు ఇన్నోవా కార్లు చేరుకున్నాయి. రెండు కొత్త కార్లు కాగా 4 ఇప్పటికే నెంబర్ ప్లేట్ అలాట్ అయినవి. ప్రమాణస్వీకారం తర్వాత కొత్త కాన్వాయ్‌లో సీఎం ఇంటికి వెళ్లేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే, కొత్త సీఎం.. తన అభీష్టం మేరకు కాన్వాయ్ ను మార్చుకునే అవకాశం ఉంది.
రంగు మారడం లేదు..
మొన్నటివరకు తెలంగాణ సీఎంగా ఉన్న కేసీఆర్ తెల్ల రంగు కాన్వాయ్ నే వాడారు. ఇప్పుడదే రంగు కాన్వాయ్ రేవంత్ వాడనున్నారు. మరోవైపు ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్న సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి నలుపు రంగు స్కార్పియోలను వాడారు. ఆయన అకాల మరణం తర్వాత రోశయ్య సైతం నలుపు రంగు స్కార్పియో వాహనాలనే వినియోగించినట్లు సమాచారం. అయితే, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మాత్రం కాన్వాయ్ వాహనాలను మార్చివేశారు. స్కార్పియో బదులు ఫార్చ్యూనర్ లు వచ్చాయి. అయితే , ఇప్పుడు రేవంత్ సీఎం అవుతున్న నేపథ్యంలో అవే తరహా వాహనాలను ఉంచనున్నట్లు తెలుస్తోంది.
6 కాదు.. 9
కేసీఆర్ కు ఇష్టమైన సంఖ్య 6 అనే సంగతి తెలిసిందే.. అందుకే ఆయన కాన్వాయ్ కార్ల నంబర్లన్నీ ‘‘6’’తోనే ఉండేవి. కానీ, రేవంత్ కు ఇష్టమైన సంఖ్య ‘‘9’’. దీంతో కొత్త కాన్వాయ్ లో 9 సిరీస్ తో నంబర్లు ఉండనున్నట్లు తెలుస్తోంది. కాగా, రేవంత్ ముందుముందు ఏమైనా వాహనాలను మారుస్తారా? లేదా? అనేది చూడాలి.