Begin typing your search above and press return to search.

కామారెడ్డి కాంగ్రెస్ జాతకాన్ని తిరగరాస్తున్న రేవంత్ ...?

కామారెడ్డిలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ అనూహ్యం అయినది. నిజానికి కేసీయార్ మీద పోటీకి తాను రెడీ అని రేవంత్ రెడ్డి అంతకు ముందు కూడా ప్రకటించి ఉన్నారు.

By:  Tupaki Desk   |   12 Nov 2023 3:02 PM GMT
కామారెడ్డి కాంగ్రెస్ జాతకాన్ని తిరగరాస్తున్న రేవంత్  ...?
X

కామారెడ్డిలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ అనూహ్యం అయినది. నిజానికి కేసీయార్ మీద పోటీకి తాను రెడీ అని రేవంత్ రెడ్డి అంతకు ముందు కూడా ప్రకటించి ఉన్నారు. అయితే అది గజ్వేల్ సీటు కోసం. అయితే బీయారెస్ అభ్యర్ధుల ప్రకటన తరువాత కేసీయార్ రెండు సీట్ల నుంచి పోటీకి దిగుతున్నారు అని తెలిసిపోయింది.

అపుడు కూడా రేవంత్ రెడ్డి పోటీకి సై అన్నారు కానీ ఎక్కడ నుంచి అన్నది తెలియలేదు. ఆయన కూడా గజ్వేల్ కి వెళ్తారని, కామారెడ్డిలో సీనియర్ నేత షబ్బీర్ అలీ పోటీ చేస్తారని కూడా ప్రచారం సాగింది. నిజానికి షబ్బీర్ అలీ ఈ మధ్య దాకా తానే అభ్యర్ధిని అని ప్రచారం కూడా చేస్తూ జనాలలో కనిపించారు.

కానీ కాంగ్రెస్ హై కమాండ్ సడెన్ గా కాదు కానీ ఒక ప్లాన్ ప్రకారమే రేవంత్ రెడ్డిని కామారెడ్డికి పంపించింది. దీని వల్ల రెండు రాజకీయ లాభాలను ఆ పార్టీ కోరుకుంది. మొదటిది ఏంటి అంటే కేసీయార్ ని ఓడించడం. ఒక వేళ అది సాధ్యపడకపోయినా ఆయనకు గెలుపు అంత ఈజీ కాకుండా చేయడం. రెండవది అక్కడ రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్ వెనక్కిపోయి పట్టు జారిపోయి ఉంది.

దాన్ని ముందుకు తెచ్చి కాంగ్రెస్ గ్రాఫ్ ని ఒక్కసారిగా పెంచడం. అందుకే దూకుడుకు మారు పేరు అయిన రేవంత్ రెడ్డిని అక్కడ నుంచి పోటీకి పెడుతోంది. ఇక కామారెడ్డిలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి అన్నది చూస్తే టీడీపీ పుట్టనంతవరకూ పోటీ పెట్టనంతవరకూ కామారెడ్డి కాంగ్రెస్ కి కంచుకోటగానే ఉంది. కానీ టీడీపీ పుట్టాక 1983 నుంచి 2018 దాకా జరిగిన తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది కేవలం రెండు సార్లు మాత్రమే.

అది కూడా వరసగా కూడా కాదు, కాంగ్రెస్ కి బాగా వేవ్ వచ్చిన సందర్భాలలోనే. 1989లో కాంగ్రెస్ కి వేవ్ వచ్చింది. అప్పటికి ఏడేళ్ళుగా పాలిస్తున్న ఎన్టీయార్ మీద వ్యతిరేకత రావడంతో వచ్చిన గాలిలో కాంగ్రెస్ గెలిచింది. షబ్బీర్ అలీ అలా బోణీ కొట్టారు. ఇక మళ్ళీ 1994, 1999లలో కాంగ్రెస్ ఓడింది. 2004లో మళ్లీ వైఎస్సార్ నాయకత్వంలో కాంగ్రెస్ కి ప్రభజనం కనిపించింది. మరోసారి షబ్బీర్ అలీ కాంగ్రెస్ తరఫున కామారెడ్డిలో గెలిచారు. అలా రెండు సార్లు గెలిచిన చరిత్రను గడచిన నాలుగు దశాబ్దాల కాలంలో కాంగ్రెస్ మూటకట్టుకుంది.

ఇక ఇపుడు చూస్తే కాంగ్రెస్ ఓడి రెండు దశాబ్దాలు అవుతోంది. కామారెడ్డిలో టీడీపీ బలంగా ఉంది. ఆ తరువాత ఆ ఓట్లు అన్నీ బీయారెస్ కి షిఫ్ట్ అయ్యాయి. ఆ ధైర్యంతోనే కేసీయార్ కామారెడ్డిని పోటీకి ఎంచుకున్నారు. మరి రేవంత్ రెడ్డి పోటీకి దిగారు అంటే ఆయన లెక్క ఏంటి అన్నది చర్చగా ఉంది. ఇక ఇపుడు చూస్తే కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగింది. గాలి కొంత అనుకూలంగా ఉంది.

మళ్ళీ ఇన్నేళ్ళ తరువాత కాంగ్రెస్ కి గెలిచేందుకు కామారెడ్డిలో చాన్స్ అయితే ఉంది. కానీ అక్కడ బీయారెస్ నుంచి ఎవరో అభ్యర్ధిగా ఉంటే వీలు అయ్యేది. కానీ సీఎం గా ఉన్న కేసీయార్ ప్రత్యర్ధి అయితే కాంగ్రెస్ గెలుపు ఎలా సాధ్యం అన్న ప్రశ్న ఉండనే ఉంది. అందుకే జవాబుగా రేవంత్ రెడ్డి పోటీకి దిగుతున్నారు అని అంటున్నారు. కాంగ్రెస్ ఊపు ఒక వైపు రేవంత్ రెడ్డి దూకుడు మరో వైపు. పైగా సీఎం క్యాండిడేట్ అన్న బ్రాండ్ కూడా ఉంది.

ఇవన్నీ కలిస్తే కేసీయార్ కి సమఉజ్జీగా రేవంత్ రెడ్డినే పోటీలో కాంగ్రెస్ దింపింది. మరి ఆయన కాంగ్రెస్ జాతకాన్ని మారుస్తారా. కేసీయార్ మీద గెలిచి సీఎం రేసులో కూడా ముందుకు జరుగుతారా అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా గజ్వేల్ కంటే కూడా కామారెడ్డి పోటీనే ఇంటరెస్టింగ్ గా ఉంది అని చెప్పాలి.