Begin typing your search above and press return to search.

ఎప్పుడైనా.. ఎక్కడైనా చూశామా రేవంత్ లాంటి సీఎంను!

తాజాగా జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లోనూ విపక్ష నేతగా వ్యవహరిస్తున్న కేసీఆర్ సభకు హాజరైంది లేదు.

By:  Tupaki Desk   |   14 Feb 2024 8:15 AM GMT
ఎప్పుడైనా.. ఎక్కడైనా చూశామా రేవంత్ లాంటి సీఎంను!
X

రోటీన్ ముఖ్యమంత్రులకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి. గతాన్ని పక్కన పెడితే సమకాలీనరాజకీయాల్లో.. మరి ముఖ్యంగా దూకుడురాజకీయాలు మొదలైన తర్వాత అధికారంలో ఉన్న వారు విపక్ష నేతను అసెంబ్లీ సాక్షిగా అవమానించటం.. వారిపై పరుష వ్యాఖ్యలు చేయటం.. వారి వ్యక్తిగత అంశాల్ని ప్రస్తావిస్తూ అవమానానికి గురి చేయటం కనిపిస్తుంది. వారు సభలో ఉండి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా చర్చలు జరిపే వేళలో.. వారిని సభ నుంచి ఏదోలా బయటకు పంపేయటమే లక్ష్యంగా ఎత్తులు వేయటం చూస్తున్నాం.

అందుకు భిన్నంగా విపక్ష నేత సభకు రావాలని.. ఆయన్ను గౌరవంగా.. మర్యాదగా చూస్తామని.. ఆయనకు ఎలాంటి లోటు లేకుండా చూస్తామని చెప్పే ముఖ్యమంత్రి దేశంలో మరే రాష్ట్రంలో కనిపించరు. ఆ విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రోటీన్ కు భిన్నంగా కనిపిస్తారు. ఎన్నికల్లో ఓటమిపాలై.. విపక్షంలో ఉన్న కేసీఆర్ ఇప్పటివరకు అసెంబ్లీకి వచ్చింది లేదు. ఆయన్నుసభకు రావాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ మొదట్నించి కోరుతూనే ఉన్నారు. కానీ.. ఆయన వస్తున్నది లేదు.

తాజాగా జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లోనూ విపక్ష నేతగా వ్యవహరిస్తున్న కేసీఆర్ సభకు హాజరైంది లేదు. ఇలాంటివేళ.. క్రిష్ణా ప్రాజెక్టులకు సంబంధించి నల్గొండ జిల్లాలో భారీ సభను పెట్టుకున్న కేసీఆర్.. తెలంగాణ ప్రజల కోసం.. వారి ప్రయోజనాల కోసం పోరాడుతున్నట్లుగా పేర్కొన్నారు. ఆ మాటలే నిజమని అనుకుందాం. బహిరంగ సభ పెట్టి.. వేలాది మందికి చెప్పే విషయాల్ని.. ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని అసెంబ్లీ సమావేశాలకు హాజరై.. అక్కడ ముఖ్యమంత్రిని ముఖం మీదనే నాలుగు మాటలు అనేసి దులిపేయాలి కదా? అప్పుడు అధికారిక రికార్డుల్లోకి ఎక్కటమే కాదు.. భవిష్యత్ తరాలకు కూడా కేసీఆర్ వాదన రికార్డుల్లో ఉండిపోతుంది కదా?

మరి.. అలాంటి పని విపక్ష నేత కేసీఆర్ ఎందుకు చేయరు? ఆయన చేయని పనిని.. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి పదే పదే చేయటం కనిపిస్తుంది. తాజాగా మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శన నేపథ్యంలో మాట్లాడిన సీఎం రేవంత్.. ‘‘మీరు అసెంబ్లీకి రావాలని కోరుతున్నా. మీ గౌరవాన్ని ఏ మాత్రం తగ్గించం. ఏసూచనలు ఇచ్చినా వినేందుకు ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి సాగునీటిపై సభలో శ్వేతపత్రం ప్రవేశ పెడతారు. ఈ చర్చలో పాల్గొనండి. క్రిష్ణా జలాల్ని కాపాడుకునేందుకు కేంద్రంతో ఎలా కోట్లాడాలో మీ అనుభవంతో సూచనలు చేయాలి’’ అంటూ వ్యాఖ్యానించారు రేవంత్. అయితే.. సభకు వచ్చేందుకు విపక్ష నేత కేసీఆర్ సిద్ధంగా లేరని చెబుతున్నారు. ఏది ఏమైనా.. ఒక రాష్ట్ర సీఎం పదే పదే రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేతను పదే పదే సభకు రావాలని కోరటం ముఖ్యమంత్రి రేవంత్ కే చెల్లింది. అలా అడిగించుకోవటం విపక్ష నేత కేసీఆర్ కు మాత్రమే సాధ్యమని చెప్పక తప్పదు.