Begin typing your search above and press return to search.

సీఎం రేవంత్ 'క్రూయిజ్' బ్రేకింగ్ తో సారుకు డ్యామేజ్ ఎంత?

ప్రత్యర్థి కావొచ్చు.. రాజకీయ శత్రువును కానీ తక్కువగా అంచనా వేయటానికి మించిన పెద్ద తప్పు మరొకటి ఉండదు.

By:  Tupaki Desk   |   30 Dec 2023 5:59 AM GMT
సీఎం రేవంత్ క్రూయిజ్ బ్రేకింగ్ తో సారుకు డ్యామేజ్ ఎంత?
X

ప్రత్యర్థి కావొచ్చు.. రాజకీయ శత్రువును కానీ తక్కువగా అంచనా వేయటానికి మించిన పెద్ద తప్పు మరొకటి ఉండదు. అలాంటి తప్పులకు చెల్లించాల్సిన మూల్యం భారీగా ఉంటుంది. తెలంగాణ ఉద్యమంలో కానీ.. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కానీ కేసీఆర్ బలాన్ని తక్కువగా అంచనా వేసిన వారికి దిమ్మ తిరిగిపోయే షాకులు తగిలాయి. పదేళ్లు నాన్ స్టాప్ అధికారం చేతిలో ఉన్న వేళ.. వాస్తవాల్ని గ్రహించే విషయంలో గులాబీ పార్టీ తన తలుపుల్ని తానే మూసేసుకుంది. ఎవరైనా సలహా కానీ సూచన చేయబోతే.. తమకే పాఠాలు చెప్పేంత మగాడివి అయ్యావా? అంటూ ఎటకారాలు చేసే పరిస్థితి. తాము ఏం అనుకుంటే అది చేసే సత్తానే కాదు.. తెలంగాణ ప్రజల్ని తాము కోరుకున్నట్లుగా మలుచుకుంటామన్న ధీమా ఎంతలా కొంపముంచిందన్న విషయం ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికలు స్పష్టం చేశాయి.

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం లాంటివి వరుసగా జరిగిపోయాయి. ఇంత జరిగిన తర్వాత కూడా ముఖ్యమంత్రి రేవంత్ ను తక్కువగా అంచనా వేసే భారీ తప్పును గులాబీ ముఖ్యనేతతో సహా.. ఆయన తర్వాతి నేతలు కూడా తప్పు చేశారంటున్నారు. ఇందుకు వారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అదికారం చేజారిన తర్వాత కూడా రేవంత్ సామర్థ్యంపై అంచనాలు లేకపోవటం.. తమ శక్తియుక్తుల మీద విపరీతమైన నమ్మకం గులాబీ పార్టీకి గుదిబండలా మారిందన్న మాట వినిపిస్తోంది.

రెండు.. మూడు రోజుల క్రితం మీడియా సమావేశాన్నినిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ముచ్చటగా మూడోసారి ఎన్నికల్లో గెలుస్తామన్న ఉద్దేశంతో.. రూ.3కోట్ల ఖర్చుతో ఒక్కో కారు చొప్పున 22 కార్లు కొనుగోలు చేశారని.. వాటిని రహస్యంగా విజయవాడలో ఉంచారంటూ పేల్చిన బ్రేకింగ్ చేసిన డ్యామేజ్ అంతా ఇంతా కాదంటున్నారు. ఎన్నికలకు ముందే ఇంత భారీ ఖర్చు అవసరం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది. ఇప్పటికే వాహనాలు లేవంటే.. ఫర్లేదనుకోవచ్చని.. అలా కాకుండా ఆడంబరం కోసం పెట్టిన ఖర్చును చూసిన తెలంగాణ సమాజం అవాక్కు అయ్యే పరిస్థతి.

సాధారణంగా వార్తా ఛానళ్లు.. పత్రికలు బ్రేకింగ్ లు పేల్చటం చూస్తుంటాం. అందుకు భిన్నంగా మీడియా భేటీలో ముఖ్యమంత్రి రేవంతే బ్రేకింగ్ వేసిన వైనం గులాబీ పార్టీకి దిమ్మ తిరిగే షాకిచ్చినట్లుగా చెబుతున్నారు. దీనికి తగ్గట్లే.. ముఖ్యమంత్రి రేవంత్ నోటి నుంచి వచ్చిన ల్యాండ్ క్రూయిజ్ వ్యవహారం మీద పార్టీ అధినేత కేసీఆర్ కానీ.. ఆయన తర్వాత సెకండ్ బాస్ అయిన కేటీఆర్ కానీ.. మేనల్లుడు హరీశ్ కానీ.. కుమార్తె కవితతో సహా ఎవరూ మాట్లాడలేని పరిస్థితి.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఫాంహౌస్ బాత్రూంలో జారి పడి తుంటి ఎముక విరిగిన నేపథ్యంలో ఆసుపత్రిలో చేరిన కేసీఆర్ మీద సానుభూతి వెల్లువలా వచ్చింది. 22 ల్యాండ్ క్రూయిజ్ లను రహస్యంగా కొనుగోలు చేసిన ఎపిసోడ్ తో జరిగిన డ్యామేజ్ భారీగా ఉందంటున్నారు. ఆసుపత్రి వేళ కేసీఆర్ మీద వచ్చిన సానుభూతి మొత్తం క్రూయిజ్ ల దెబ్బకు మొత్తం తుడిచి పెట్టుకుపోయినట్లుగా చెబుతున్నారు. ఇదంతా చూస్తే.. ముఖ్యమంత్రి రేవంత్ ను తక్కువగా అంచనా వేసే ధోరణికి ఇప్పటికైనా తెర దించితే మంచిందంటున్నారు. లేదంటే.. ఇలాంటి షాకులు రానున్న రోజుల్లోమరిన్ని ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.