Begin typing your search above and press return to search.

గంజాయిని ఏరేసే ప‌నిలో ఉన్నా: రేవంత్ కీల‌క వ్యాఖ్య‌లు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో గంజాయి మొక్క‌ల‌ను ఏరేసే ప‌నిలో ఉన్నాన‌ని వ్యాఖ్యానించారు.

By:  Tupaki Desk   |   17 March 2024 10:00 PM IST
గంజాయిని ఏరేసే ప‌నిలో ఉన్నా:  రేవంత్ కీల‌క వ్యాఖ్య‌లు
X

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో గంజాయి మొక్క‌ల‌ను ఏరేసే ప‌నిలో ఉన్నాన‌ని వ్యాఖ్యానించారు. ఎన్నికల షెడ్యూల్ వ‌చ్చిన నేప‌థ్యంలో ఇకపై ఎన్నికలు పూర్తయ్యే వరకు తాను పూర్తి రాజకీయ పార్టీ నాయకుడిగా పని చేస్తానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అద్భుత ఫలితాలు సాధించడానికి పని చేస్తానని అన్నారు. హైదరాబాద్ బషీర్ బాగ్‌లో మీట్ ది మీడియా కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు.

‘‘కేసీఆర్ ఆనవాళ్లు ఇంకా ఉన్నాయి. తులసి వనంలో కొన్ని కేసీఆర్ గంజాయి మొక్కలు ఇంకా వాసన వెదజల్లుతున్నాయి. విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ నిన్న మాకు నోటీసులు ఇచ్చింది. ముందు డబ్బులు కట్టాకే జీరో విద్యుత్ బిల్లు ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది. వారు ముందు సబ్సిడీ చెల్లించాకే జీరో బిల్లు ఇవ్వాలని చెబుతున్నారు. ఆ మేధావికి నేను ఒకటే చెప్తా.. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చినప్పుడు ఈ ఆదేశం ఎందుకు ఇవ్వలేదు? నీ ఇంటిపేరు తన్నీరు ఉన్నంత మాత్రాన నువ్వు పన్నీరు కాలేవు. ఈ తెలివి తేటలు మానాలి. అందుకే ఈ గంజాయి మొక్కలను పీకే పనిలో ఉన్నా. ఇప్పటికే కొన్ని గంజాయి మొక్కలను పీకేశా. రోజుకు 18 గంటలు పని చేసి గంజాయి మొక్కలు లేకుండా పీకేస్తా. తన్నీరు గారూ.. గుర్తు పెట్టుకోండి.. నువ్వు కూడా ఆ కుర్చీలో ఎక్కువ సేపు ఉండవు`` అని రేవంత్ వ్యాఖ్యానించారు.

త‌మ‌ పోటీ ఏపీ, కర్ణాటకతో కాదని, త‌మ‌(తెలంగాణ‌) పోటీ ప్రపంచంతోనే ఉంటుంద‌ని రేవంత్ రెడ్డి తెలిపారు. పెట్టుబడిదారులకు తాము సమాన అవకాశాలు కల్పిస్తామ‌న్నారు. రాష్ట్రం వచ్చిన మొదట్లో ఏడాదికి రాష్ట్రం చెల్లించాల్సిన అప్పులు రూ.6 వేల కోట్లు ఉండేవ‌న్నారు. ఇప్పుడు రాష్ట్రం ఏడాదికి చెల్లించాల్సిన అప్పులు ఏడాదికి రూ.64 వేల కోట్లకు చేరిందని తెలిపారు. ఆ విషయంలో మేం పారదర్శకంగా ముందుకు వెళ్తామ‌న్నారు.

‘‘నిజాం విధానాల నకలును కేసీఆర్ అమలు చేశారు. అందుకే ప్రజలు కేసీఆర్ విధానాలను వ్యతిరేకిం చి.. ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. వంద రోజుల ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు స్వేచ్ఛను అందిం చాం. గ్యారంటీలను అమలు చేస్తూ ముందుకెళుతున్నాం. కేంద్ర ప్రభుత్వంతో, గవర్నర్ తో సామరస్య పూర్వక విధానాలతో ఉంటున్నాం. అందరి సహకారంతో ఒక మంచి పరిపాలన అందిస్తాం. వైబ్రాంట్ తెలంగాణనే మా లక్ష్యం`` అని రేవంత్ చెప్పారు.