Begin typing your search above and press return to search.

డీకేలాగే రేవంత్ మిగిలిపోతారా?

తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడానికి కష్డపడుతున్న రేవంత్ రెడ్డి చివరకు డీకే శివకుమార్ లాగే మిగిలిపోతారా? రేవంత్ కు సీఎం పదవి దక్కదా?

By:  Tupaki Desk   |   19 Oct 2023 2:30 AM GMT
డీకేలాగే రేవంత్ మిగిలిపోతారా?
X

తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడానికి కష్డపడుతున్న రేవంత్ రెడ్డి చివరకు డీకే శివకుమార్ లాగే మిగిలిపోతారా? రేవంత్ కు సీఎం పదవి దక్కదా? అనే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణలో అధికార బీఆర్ఎస్కు చెక్ పెట్టి కాంగ్రెస్ ను గద్దె ఎక్కించడం కోసం రేవంత్ కష్టపడుతున్నారు. పార్టీలో అంతర్గత సమస్యలున్నా, విభేధాలు ఎదురవుతున్నా, టికెట్ల కోసం రూ.కోట్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నా రేవంత్ రెడ్డి ముందుకే సాగుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కు ఏర్పడుతున్న సానుకూల పవనాలను ఓట్ల రూపంలో మార్చడమే లక్ష్యంగా రేవంత్ సాగుతున్నారు.

అయితే వచ్చే ఎన్నికల్లో ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే అప్పుడు తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారా? అన్నది మాత్రం సమాధానం లేని ప్రశ్నగానే మిగిలి పోతుందనే చెప్పాలి. డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తోందని రేవంత్ చెబుతున్నారు. కానీ సీఎంగా తానే ప్రమాణ స్వీకారం చేస్తానని నేరుగా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ నాయకులు ఎంతో మంది ఉన్నారు. అంతే కాకుండా సీఎం పదవిపై కన్నేసిన వాళ్ల జాబితా కూడా పెద్దదే. ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకటరెడ్డి, భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ, చివరకు వీహెచ్ కూడా.. ఇలా చాలా మందికి సీఎం కుర్చీపై ఆశ ఉందనే టాక్ ఉంది.

ఇప్పటికే కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సీనియర్లు ఉన్నారనే సంగతి తెలిసిందే. పైగా వేరే పార్టీ నుంచి వచ్చిన రేవంత్ ను సీఎంగా చేస్తామంటే ఈ సీనియర్లు ఒప్పుకుంటారా? ఒకవేళ కాంగ్రెస్ అధిష్ఠానం అందుకు ముందుకు వచ్చినా సీనియర్ల నుంచి తలనొప్పి తప్పదు. అందుకే కర్ణాటకలో డీకే శివకుమార్ మాదిరే తెలంగాణలో రేవంత్ మిగిలిపోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడం కోసం డీకే ఎంతో కష్టపడ్డారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన్ని కాదని సీనియర్ నాయకుడు సిద్ధరామయ్యను కాంగ్రెస్ అధిష్ఠానం ముఖ్యమంత్రిని చేసింది. ఇప్పుడు తెలంగాణలోనూ కాంగ్రెస్ హైకమాండ్ ఇలాంటి నిర్ణయమే తీసుకునే ఆస్కారముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.