Begin typing your search above and press return to search.

టచ్ చేసి చూడు అన్న కేసీఆర్ కు ఇలాంటి షాకేంటి బాస్

అంతేకాదు.. తెలంగాణ ప్రయోజనాల కోసం ఏం చేయాలో తనకు బాగా తెలుసని.. నదీ జలాల విషయంలో రాష్ట్రం హక్కులను కాపాడేందుకు ఎంతవరకైనా పోరాడతామని స్పష్టం చేశారు.

By:  Tupaki Desk   |   7 Feb 2024 4:06 AM GMT
టచ్ చేసి చూడు అన్న కేసీఆర్ కు ఇలాంటి షాకేంటి బాస్
X

ప్రారంభం ఏదైనా ముగింపు కూడా ఉంటుంది. గొప్ప గొప్ప విజయాలు సాధించినోళ్లు ఎవరైనా తర్వాతి కాలంలో అందుకు భిన్నమైన పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది నిజం. ఈ వాస్తవాన్ని గుర్తించకపోతే లేని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితిని గులాబీ పార్టీ బాస్ కేసీఆర్ ఎదుర్కొంటున్నారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఈ మధ్యన జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఓటమిపాలు కావటం.. కాంగ్రెస్ పార్టీ చేతికి అధికారం రావటం.. రేవంత్ ముఖ్యమంత్రి కావటం లాంటి వరుస పరిణామాలు చోటు చేసుకోవటం తెలిసిందే.

ఎన్నికల్లో ఓటమి అనంతరం ఫాంహౌస్ బాత్రూంలో జారిపడిన కేసీఆర్.. కొద్దికాలంగా అన్నింటికి దూరంగా ఉండటం తెలిసిందే. ఈ మధ్యనే ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన ఆయన.. మంగళవారం ఆయన పార్టీ ప్రధాన కార్యాలయానికి రావటం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని పదేళ్లు పదిలంగా కాపాడుకున్నామని.. దాన్ని పరాయి వాళ్ల పాలు చేస్తున్నట్లుగా మండిపడ్డారు.

అంతేకాదు.. తెలంగాణ ప్రయోజనాల కోసం ఏం చేయాలో తనకు బాగా తెలుసని.. నదీ జలాల విషయంలో రాష్ట్రం హక్కులను కాపాడేందుకు ఎంతవరకైనా పోరాడతామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ''కొత్త సీఎం బీఆర్ఎస్ పార్టీని.. వ్యక్తిగతంగా నన్ను ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు. నన్ను.. నా పార్టీని టచ్ చేయటం నీతో కాదు. నీ కంటే హేమాహేమీలనే ఎదుర్కొన్న చరిత్ర మాకుంది'' అని వ్యాఖ్యానించారు.

కేసీఆర్ మాటల్ని ఇక్కడితో కట్ చేస్తే.. ఆయనీ మాటలు మాట్లాడే సమయానికి బీఆర్ఎస్ పార్టీకి చెందిన పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత కాంగ్రెస్ కండువాను ఢిల్లీలో కప్పుకోవటం గమనార్హం. వచ్చే ఎన్నికల్లో టికెట్ హామీ కూడా ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఓవైపు తమ వాళ్లను..తమ పార్టీని టచ్ చేయటం రేవంత్ తరం కూడా కాదన్న కేసీఆర్ మాటలకు భిన్నంగా పరిణామాలు చోటు చేసుకోవటం రాజకీయ కలకలాన్ని రేపుతున్నాయి.

అంతేకాదు.. త్వరలో నల్గొండలో జరిగే బహిరంగ సభలోపే బీఆర్ఎస్ కు చెందిన పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదంతా చూస్తే అనిపించేది ఒక్కటే.. ఎన్ని అద్భుత విజయాలు సాధించినప్పటికీ ఒక రోజుకు అవన్నీ గతంగా మారి.. వర్తమానం మరోలా ఉంటుందన్న విషయాన్ని కేసీఆర్ త్వరగా గమనించి.. అందుకు తగ్గ చర్యలు తీసుకోవటం మంచిదన్న మాట వినిపిస్తోంది. మరి.. కేసీఆర్ ఏం చేస్తారో చూడాలి.