Begin typing your search above and press return to search.

అది నిరూపిస్తే పోటీకి దూరం.. సీఎం కేసీఆర్ కు రేవంత్ సంచలన సవాలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు సంచలన సవాలు విసిరారు ఫైర్ బ్రాండ్ కమ్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.

By:  Tupaki Desk   |   13 Nov 2023 4:41 AM GMT
అది నిరూపిస్తే పోటీకి దూరం..  సీఎం కేసీఆర్ కు రేవంత్ సంచలన సవాలు
X

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు సంచలన సవాలు విసిరారు ఫైర్ బ్రాండ్ కమ్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం చివరకు వచ్చేసి.. అసలు ఆట మొదలైన వేళ.. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల వేళ.. రేవంత్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వానికి.. ముఖ్యమంత్రికి భారీ సంచలన సవాలు విసిరారు. కేసీఆర్ సర్కారు గొప్పగా చెప్పుకుంటున్నట్లుగా 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపిస్తే తాను దాఖలు చేసిన నామినేషన్లను ఉపసంహరించుకుంటానని సంచలన సవాలు విసిరారు.

తాజాగా తన ఇంట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన రేవంత్..కేసీఆర్ సర్కారుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 24 గంటల విద్యుత్ ఉచితంగా ఇస్తున్నట్లు నిరూపిస్తానంటే తాను ఎక్కడికైనా వస్తానని వ్యాఖ్యానించారు. "గజ్వేల్.. సిరిసిల్లా.. సిద్దిపేట ఎక్కడికి రమ్మన్నా వస్తా. 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వటం లేదని నిరూపించలేకపోతే మాత్రం అమరవీరుల స్థూపం వద్ద కేసీఆర్ కుటుంబం క్షమాపణలు చెబుతారా?" అని ప్రశ్నించారు.

ఎన్నికల వేళ భావోద్వేగాన్ని రెచ్చగొట్టేలా కొన్ని ఉదంతాల్ని క్రియేట్ చేస్తారని.. ప్రశాంత్ కిశోర్ ఇలాంటి ట్రిక్కులు ఎన్నో చేస్తారన్న రేవంత్.. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై మాట్లాడిన రేవంత్ రెడ్డి తీవ్రంగా రియాక్టు అయ్యారు. మేడిగడ్డ కుంగిపోయినప్పుడు కూడా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కుట్ర అని వ్యాఖ్యానించారన్నారు. అయితే.. నిపుణులు మాత్రం డిజైన్ లోపం వల్లే కుంగినట్లుగా పేర్కొన్నారు. ఇలా తప్పుడు ప్రచారాలతోలబ్థి పొందాలన్న రేవంత్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

ఎన్నికల్లో ఉచిత విద్యుత్ అంశం ప్రముఖంగా తీసుకెళుతున్న అధికార పార్టీకి.. తాజాగా రేవంత్ నోటి నుంచి వచ్చిన సవాలు పెద్దఎత్తున ప్రభావాన్ని చూపుతుందని చెబుతున్నారు. రేవంత్ సవాలు మీద ప్రభుత్వం స్పందిస్తే మాత్రం అదో సంచలనంగా మారుతుంది. ఒకవేళ.. నో చెప్పినా అదో పాయింట్ అవుతుంది. ఏమైనా.. ముఖ్యమంత్రి కే సవాలు విసిరిన రేవంత్ మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. మరి.. ఈ సవాలుపై తెలంగాణ అధికారపక్షం నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందన్నదిప్పుడు ఉత్కంటగా మారింది.