Begin typing your search above and press return to search.

ప్రగతిభవన్ కంచె తొలగింపులో రేవంత్ బుక్ అయ్యారా?

రాజకీయాలు మారిపోతున్నాయి. గతానికి భిన్నంగా ఉంటున్న రాజకీయాలు కొత్త రూపును సంతరించుకుంటున్నాయి.

By:  Tupaki Desk   |   9 Dec 2023 4:10 AM GMT
ప్రగతిభవన్ కంచె తొలగింపులో రేవంత్ బుక్ అయ్యారా?
X

రాజకీయాలు మారిపోతున్నాయి. గతానికి భిన్నంగా ఉంటున్న రాజకీయాలు కొత్త రూపును సంతరించుకుంటున్నాయి. తాము మద్దతు ఇచ్చే వారు ఏ పని చేసినా అందులో తప్పులు వెతకటం.. దానికో కథను అల్లటం ఒక అలవాటుగా మారింది. తాము వినిపించే వాదనలో లాజిక్ మిస్ అయ్యిందన్న విషయాన్ని పట్టించుకోకుండా.. తమ ధోరణిలో తాము చెప్పుకుంటూ పోవటమే పని అన్నట్లుగా మారింది.

తెలంగాణ రాష్ట్రంలో అధికార బదిలీ జరగటం.. రేవంత్ రాష్ట్ర ముఖ్యమంత్రి కావటం జరిగింది. తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేయటానికి ముందే.. ప్రగతి భవన్ (ఇప్పుడు ప్రజాభవన్) ముందున్న భారీ కంచెను బద్దలు కొట్టించేయటం తెలిసిందే. ఈ అంశం తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రగతి భవన్ ముందు భారీ కంచెను ఏర్పాటు చేయటం..అక్కడ నిలుచున్నాసరే.. పోలీసుల అదలింపు.. ప్రగతిభవన్ లోకి సామాన్యులను ఎవరినీ రానివ్వకపోవటం లాంటి విషయాలు తెలిసిందే.

ఇలాంటి నేపథ్యంలో తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయటానికి గంట ముందు నుంచే ప్రగతిభవన్ ముందున్న భారీ ఇనుప కంచెల్ని తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో అసలు ఈ ఇనుప కంచెల్ని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేశారని.. ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలగిస్తున్నారని.. అలాంటప్పుడు ఇనుప కంచెల్నితొలగించటాన్ని మహా గొప్ప పనిగా ఎలా ప్రచారం చేసుకుంటారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

ఈ తరహా వాదనల్నిపలువురు తప్పు పడుతున్నారు. రాజకీయంగా వైరం ఉండొచ్చు. అంత మాత్రానికే ప్రతి పనిలోనూ ఏదో ఒక లాజిక్ చూపించి.. తొండి వాదనను వినిపించటంలో అర్థం లేదంటున్నారు. తాజా ఎపిసోడ్ విషయానికి వస్తే.. ఇప్పటి ప్రజా భవన్.. కేసీఆర్ హయాంలో ప్రగతిభవన్ కు ముందు ఉమ్మడి రాష్ట్రంలోని వైఎస్ హయాంలో నిర్మించారు. తర్వాతి కాలంలో ముఖ్యమంత్రి అయిన కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో కంచెను ఏర్పాటు చేయటం నిజం. అయితే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి.. సొంత రాష్ట్రంలో సొంత ప్రజల్ని పాలించే ప్రభుత్వం కంచెను ఎందుకు తొలగించలేదన్నది ప్రశ్న. ఇందుకు వారికి పదేళ్ల సమయం వారి చేతుల్లో ఉంది. అలాంటప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చేయలేని పనిని.. అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కారు చేస్తే.. దాన్ని పొగడకపోయినా ఫర్లేదు.. తిట్టుడు కార్యక్రమాన్ని చేపట్టటం సరికాదన్న మాట బలంగా వినిపిస్తోంది.