Begin typing your search above and press return to search.

మెగాస్టార్‌ ఇంట్లో సీఎం రేవంత్‌.. బీజేపీకి చెక్‌ పెట్టినట్టేనా?

తాజాగా రాజకీయ, సినీ ప్రముఖులకు ఏర్పాటు చేసిన పార్టీలో తెలంగాణ ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి పాల్గొనడం సర్వత్రా ప్రాధాన్యత సంతరించుకుంది.

By:  Tupaki Desk   |   4 Feb 2024 3:54 AM GMT
మెగాస్టార్‌ ఇంట్లో సీఎం రేవంత్‌.. బీజేపీకి చెక్‌ పెట్టినట్టేనా?
X

పార్లమెంటు ఎన్నికల ముంగిట తెలంగాణలో రాజకీయాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ప్రముఖ సినీ నటుడు చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్‌ పురస్కారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పురస్కారానికి ఆయన నూటికి నూరు శాతం అర్హుడే అనే విషయంలో ఎవరికీ మరో అభిప్రాయం లేదు.

అయితే.. మరో రెండు నెలల్లో పార్లమెంటు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో చిరంజీవికి పద్మవిభూషణ్‌ పురస్కారం ప్రకటించడం హాట్‌ టాపిక్‌ గా మారింది. ఈ క్రమంలో ఆయన కోడలు ఉపాసన.. తాజాగా రాజకీయ, సినీ ప్రముఖులకు ఏర్పాటు చేసిన పార్టీలో తెలంగాణ ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి పాల్గొనడం సర్వత్రా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పార్టీ రాజకీయ, సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.

నరేంద్ర మోదీ ప్రభుత్వం చిరంజీవిని కళాకారుల కోటాలో రాజ్యసభకు నామినేట్‌ చేయొచ్చనే ప్రచారం కూడా జరుగుతుండటం విశేషం. వాస్తవానికి 2008లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసినప్పుడే బీజేపీ జాతీయ నేతలు ఆయనను కలిసి బీజేపీలోకి రావాలని ఆహ్వానించారు. అప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విడిపోలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడిగా పగ్గాలతోపాటు అధికారంలోకి వస్తే సీఎం పదవిని కూడా ఆయనకు ఆఫర్‌ ఇచ్చారు. స్వయంగా అప్పటి బీజేపీ జాతీయ నేతలు స్వయంగా చిరంజీవి ఇంటికి వెళ్లి మరీ ఆహ్వానించారు. అయితే ఈ ప్రతిపాదనను చిరంజీవి తిరస్కరించారు.

అయితే చిరంజీవిపైన ఆశలు చంపుకోని బీజేపీ ఆ తర్వాత ఆయన సోదరుడు పవన్‌ కళ్యాణ్‌ పైన దృష్టి సారించింది. ఆయన జనసేన పార్టీని ఏర్పాటు చేయకముందు బీజేపీలోకి ఆహ్వానించినట్టు వార్తలు వచ్చాయి. కర్ణాటకలో లింగాయత్‌ సామాజికవర్గాన్ని చేరదీసి.. ఆ సామాజికవర్గానికి చెందిన యడ్యూరప్పను సీఎం అభ్యర్థిగా ప్రకటించి బీజేపీ పలుమార్లు అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.

ఇక్కడ (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌)లో కూడా భారీ ఎత్తున ఉన్న కాపు (కాపు, బలిజ, తెలగ, తూర్పు కాపు, ఒంటరి, మున్నూరు కాపు) సామాజికవర్గాన్ని తమ వైపునకు తిప్పుకోవాలని బీజేపీ ఎప్పటి నుంచో కలలు కంటోంది. ఎన్నికల ముంగిట చిరంజీవికి పద్మవిభూషణ్‌ ప్రకటించడం కూడా ఇందుకు ఒక కారణమని టాక్‌ నడుస్తోంది. తద్వారా చిరంజీవికి ఉన్న కోట్లాది మంది అభిమానులతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఉన్న ఆయన (కాపు) సామాజికవర్గాన్ని ఆకట్టుకోవడమే బీజేపీ ప్లాన్‌ అంటున్నారు.

బీజేపీ వ్యూహాన్ని గమనించిన తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం సైతం అప్రమత్తమైందని అంటున్నారు. చిరంజీవికి పద్మవిభూషణ్‌ పురస్కారాన్ని ప్రకటించిన వెంటనే సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా చిరంజీవి ఇంటికి వెళ్లి ఆయనను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కూడా సోషల్‌ మీడియా వేదికగా చిరంజీవికి శుభాకాంక్షలు చెప్పారు.

అంతేకాకుండా ఫిబ్రవరి 4న, ఆదివారం హైదరాబాద్‌ లోని శిల్పకళా వేదికలో పద్మశ్రీ, పద్మవిభూషణ్‌ పొందిన తెలంగాణకు చెందిన ఏడుగురిని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రేవంత్‌ రెడ్డి ఘనంగా సత్కరించనున్నారు. ఈ ఏడుగురిలో చిరంజీవితోపాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ఉన్నారు.

ఇంకోవైపు చిరంజీవికి పద్మవిభూషణ్‌ పురస్కారం రావడాన్ని పురస్కరించుకుని ఆయన కోడలు ఉపాసన హైదరాబాద్‌ లో గ్రాండ్‌ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డితోపాటు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా హాజరయ్యారు. తద్వారా చిరంజీవికి పద్మవిభూషణ్‌ ప్రకటించి ఆయన అభిమానులు, ఆయన సామాజికవర్గం ఓట్లన్నీ గంపగుత్తగా కొట్టేయాలనుకున్న బీజేపీ వ్యూహానికి రేవంత్‌ చెక్‌ పెట్టారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

చిరంజీవికి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనసన్మానం చేయనుండటం, సినిమాటోగ్రఫీగా ఉన్న మంత్రి కోమటిరెడ్డిని ఆయన ఇంటికి పంపడం, ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డే చిరు కోడలు ఉపాసన ఇచ్చిన పార్టీకి హాజరుకావడం ద్వారా చిరంజీవికి తమ ప్రభుత్వం మంచి ప్రాధాన్యత ఇచ్చిందనే ఫీలింగ్‌ ఆయన సామాజికవర్గంలో, అభిమానుల్లో కల్పించినట్టేనని అంటున్నారు. ఇలా వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలనున్న బీజేపీ వ్యూహానికి రేవంత్‌ చెక్‌ పెట్టారని టాక్‌ నడుస్తోంది.