Begin typing your search above and press return to search.

నాడు డీఎస్-వైఎస్.. నేడు రేవంత్-భట్టి జోడీ

ఉమ్మడి రాష్ట్రంలో 1994-2004 మధ్య పదేళ్లు అధికారానికి దూరంగా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఈ వ్యవధిలో 1994 నుంచి ఐదేళ్లు పి.జనార్దన్ రెడ్డి సీఎల్పీ నేతగా వ్యవహరించారు.

By:  Tupaki Desk   |   4 Dec 2023 2:00 PM GMT
నాడు డీఎస్-వైఎస్.. నేడు రేవంత్-భట్టి జోడీ
X

కాంగ్రెస్ పార్టీలో పార్టీపరంగా అత్యున్నత పదవి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడు. కార్యకర్తలకు ఓ విధంగా ఆయన సీఎంతో సమానం. మరోవైపు కాంగ్రెస్ శాసన సభా పక్ష (సీఎల్పీ) నాయకుడు ఎమ్మెల్యేలకు సారథి. హోదాపరంగా ఈ రెండూ సమానమే. ఒకరు శాసన సభలో ప్రభుత్వంపై పోరాడుతుంటే.. మరొకరు కార్యకర్తలతో కలిసి క్షేత్ర స్థాయిలో కార్యక్రమాలు చేస్తుంటారు. ఈ జోడీ సమన్వయంతో కదిలితేనే పార్టీ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ లో సహజమైన వర్గ విభేదాలను పెంచి పోషిస్తే అధికారానికి దూరమవుతుంది.

అప్పట్లో ఆ జోడీ డబుల్ హిట్

ఉమ్మడి రాష్ట్రంలో 1994-2004 మధ్య పదేళ్లు అధికారానికి దూరంగా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఈ వ్యవధిలో 1994 నుంచి ఐదేళ్లు పి.జనార్దన్ రెడ్డి సీఎల్పీ నేతగా వ్యవహరించారు. ఆ సమయంలో కొణిజేటి రోశయ్య, వైఎస్ పీసీసీ అధ్యక్షులుగా వ్యవహరించారు. 1999 తర్వాత వైఎస్ సీఎల్పీ నాయకుడు అయ్యారు. పీసీసీ బాధ్యతలను వదులుకున్నారు. ఆయన స్థానంలో ఎం.సత్యనారాయణ రావు పీసీసీ చీఫ్ అయ్యారు. వైఎస్ ను బాహాటంగానే సీఎం అభ్యర్థిగా ప్రకటించేవారు ఆయన. వీరిద్దరి సమన్వయంతో కాంగ్రెస్ పుంజుకుంది. అదే సమయంలో 2004 నాటికి నిజామాబాద్ జిల్లాకు చెందిన నాయకుడు డి.శ్రీనివాస్ (డీఎస్) ఏపీసీసీ చీఫ్ అయ్యారు. వైఎస్-డీఎస్ జోడీ అద్భుత సమన్వయంతో కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చింది. తర్వాత వైఎస్ సీఎం కాగా, డీఎస్ మంత్రి అయ్యారు. మధ్యలో కేశవరావు వంటి పీసీసీ అధ్యక్షుడు అయినా.. 2008 నాటికి డీఎస్ మరోసారి పీసీసీ పగ్గాలను చేపట్టారు. మళ్లీ వైఎస్-డీఎస్ జోడీ కాంగ్రెస్ ను గెలిపించింది. డబుల్ హిట్ కొట్టింది.

నేడు రేవంత్-భట్టి

2014లో అధికారానికి దూరమయ్యాక టీపీసీసీ అధ్యక్షులుగా పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవహరించారు. సీఎల్పీ నేతగా జానారెడ్డి ఉన్నారు. కానీ, పార్టీ మాత్రం అధికారంలోకి రాలేకపోయింది. కాగా, 2018 ఎన్నికల్లో ఓటమి అనంతరం ఉత్తమ్ పీపీసీ నుంచి తప్పుకొన్నారు. జానా క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు. ఇదే సమయంలో మధిర నుంచి గెలిచిన భట్టి విక్రమార్క సీఎల్పీ నాయకుడు అయ్యారు. కొడంగల్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన రేవంత్ రెడ్డి టీపీసీసీ పదవిలోకి వచ్చారు.

సమన్వయం.. హుందాతనం..

పీసీసీ, సీఎల్పీ సారథ్యంలో సమన్వయం.. హుందాతనం ముఖ్యం. ఈ రెండింటినీ రేవంత్, భట్టి పాటించారు. ఎక్కడా పరోక్ష విమర్శలకు తావు ఇవ్వలేదు. తమ పని తాము చేసుకుంటూ పోయారు. భట్టి పాదయాత్ర కూడా చేశారు. రేవంత్ పార్టీ వ్యవహారాలను చక్కబెట్టారు. ఇలా ఇద్దరూ కలిసి కదిలి బీఆర్ఎస్ ను ఇంటిదారి పట్టించారు. అప్పట్లో వైఎస్ సీఎం అయితే డీఎస్ మంత్రి అయినట్లు.. నేడు రేవంత్ సీఎం అయితే, భట్టి డిప్యూటీ సీఎం (లేదా కీలక శాఖలు) కాబోతున్నారు.