Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ వైఎస్సార్ తరువాత మళ్లీ రేవంత్...

ఇప్పటికి నలభై ఏళ్ళ క్రితం నందమూరి తారక రామారావు అద్భుతమైన మెజారిటీని కేవలం తొమ్మిది నెలలలోనే సాధించి ముఖ్యమంత్రిగా 1983 జనవరి 9న ఇదే ఎల్బీ స్టేడియంలో చేసి సరికొత్త చరిత్ర సృష్టించారు.

By:  Tupaki Desk   |   8 Dec 2023 12:30 AM GMT
ఎన్టీఆర్ వైఎస్సార్ తరువాత మళ్లీ రేవంత్...
X

ఎల్బీ స్టేడియం హైదరాబాద్ లో ఎంతో ప్రాచుర్యం కలిగినది. అతి పెద్ద స్టేడియం. ఈ స్టేడియానికి రాజకీయ కళ తెచ్చిన వారు మాత్రం అచ్చంగా చూస్తే దివగంత నేత ఎన్టీఆర్ అని చెప్పాలి. ఇప్పటికి నలభై ఏళ్ళ క్రితం నందమూరి తారక రామారావు అద్భుతమైన మెజారిటీని కేవలం తొమ్మిది నెలలలోనే సాధించి ముఖ్యమంత్రిగా 1983 జనవరి 9న ఇదే ఎల్బీ స్టేడియంలో చేసి సరికొత్త చరిత్ర సృష్టించారు.

అప్పటిదాకా సీఎంల పదవీ ప్రమాణ స్వీకారం అన్నది కేవలం రాజ్ భవన్ లో మాత్రమే జరిగేది. దాన్ని ప్రజా సమూహం మధ్యకు తెచ్చి రాష్ట్రానికి పెద్దను ఎన్నుకున్న ఆనందాన్ని అందరికీ పంచిపెట్టిన మహనీయుడు ఎన్టీఆర్ . ఎన్టీఆర్ అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు అన్న దాంట్లో సందేహమే లేదు.

ఆయన తరువాత మరో రెండు దశాబ్దాలకు అంటే 2004 లో మే 21న ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఏపీలో ప్రమాణం చేసిన రికార్డు వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కుతుంది. వైఎస్సార్ ప్రజా నేతగా ఎదిగిన క్రమం కూడా ఎందరికో స్పూర్తిదాయకం అని చెప్పాలి. వైఎస్సార్ పేదల పెన్నిధిగా పేరు గడించారు. ఎంటీయార్ ప్రమాణ స్వీకారం మాత్రమే చేస్తే వైఎస్సార్ తొలి సంతకం అంటూ రైతులకు ఉచిత విద్యుత్ మీద పెట్టి మరో సంచలనం సృష్టించారు.

సరిగ్గా మళ్లీ రెండు దశాబ్దాల తరువాత అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన యువ నేత రేవంత్ రెడ్డి తెలంగాణా ముఖ్యమంత్రిగా డిసెంబర్ 7న ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేశారు. భారీ జన సందోహం మధ్యన జరిగిన ఈ కార్యక్రమానికి ఢిల్లీ నుంచి కాంగ్రెస్ పెద్దలు తరలివచ్చారు. అంతే కాదు ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు.

ఈ విధంగా సాగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎన్నికల్లో ప్రకటించిన ఆరు గ్యారంటీల మీద తన సంతకం చేసి కాంగ్రెస్ హామీలకు పూచీ తీసుకున్నారు. అనంతరం ఆయన ఉత్తేజ భరితంగా స్పీచ్ ఇచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. నాడు ఎన్టీఆర్ కూడా ఇదే తీరున జనరంజకమైన ప్రసంగం చేశారు. అదే విధంగా వైఎస్సార్ కూడా ప్రజల కేరింతల మధ్యన తన ప్రసంగం చేసి కాంగ్రెస్ కి కొత్త హుషార్ తెచ్చారు. ఇపుడు రేవంత్ రెడ్డి వంతు.

ఈ యువ నేతకు సుదీర్ఘమైన భవిష్యత్తు ఉంది. ప్రస్తుతం రేవంత్ వయసు 55 ఏళ్ళు. రాజకీయాల్లో ఆయన ఇంకా యువకుడే. దాంతో పాటు మరో రెండు దశాబ్దాల పాటు ఆయన తన లాంగ్ టెర్మ్ పాలిటిక్స్ ని కొనసాగించగలరని అర్ధమవుతోంది. దూకుడుతో పాటు వ్యూహాలు నిండుగా ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కి ఇంధనం గా మారారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఆయనకు అండగా నిలబడింది. ఈ కాంబినేషన్ సక్సెస్ ఫుల్ గా పార్టీని ప్రభుత్వంలోకి తెచ్చింది. ఇపుడు ప్రభుత్వాధినేతగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ జోరు ని మరింత ముందుకు తీసుకెళ్తారని అంతా నూటిర్కి నూర్తు శాతం నమ్ముతున్నారు.