జగన్ అలా.. రేవంత్ ఇలా.. ఇద్దరి మధ్య తేడా ఇదేనా?
ఇద్దరికీ సంబంధం లేకపోయినా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా పనిచేసిన నేతల మధ్య సారూపత్యలు, భిన్న వ్యక్తిత్వాలపై తరచూ చర్చ జరుగుతుంటుంది.
By: Tupaki Desk | 23 May 2025 7:00 PM ISTతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహారశైలిపై నెట్టింట ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి హోదాలో నాంపల్లి కోర్టుకు హాజరైన రేవంత్ రెడ్డి తనపై నమోదైన కేసులపై వాంగ్మూలమిచ్చారు. ఈ కేసులు, తీర్పులు ఎలా ఉన్నా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో కోర్టుకు రావడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇదే సమయంలో వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి కోర్టు కేసులు, ఇతరత్రా విషయాలపై చర్చ జరుగుతోంది.
ముఖ్యమంత్రి కాకముందు నుంచి వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డిపై ఎన్నో కేసులు ఉన్నాయి. 2019లో వైసీపీ అధికారంలోకి రాకముందు ఆయన ప్రతి శుక్రవారం హైదరాబాదులోని సీబీఐ కోర్టుకు హాజరయ్యేవారు. ఎన్నికల ప్రచారం, పాదయాత్ర సమయంలో మాత్రం కోర్టు అనుమతితో మినహాయింపు పొందేవారు. అయితే ముఖ్యమంత్రి అయ్యాక ఆయన ప్రతివారం కోర్టుకు హాజరవుతారా? అనేది పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రి హోదాలో ఆయన కోర్టుకు హాజరైతే భద్రత నిమిత్తం రోజుకు సుమారు రూ.60 లక్షలు వరకు ఖర్చు అవుతుందని అప్పట్లో కోర్టుకు నివేదించారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి విధుల్లో బిజీగా ఉన్నందున తనకు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఐదేళ్లలో ఒక్కనాడు కోర్టు గుమ్మం ఎక్కకుండా తప్పించుకున్నారని గుర్తు చేస్తున్నారు.
అదేవిధంగా 2019 ఎన్నికల ముందు వైసీపీ అధినేత జగన్ పై విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో దాడి జరిగింది. ఈ కేసులో జనిపల్లి శ్రీనివాసరావు అనే యువకుడిని ఎన్ఐఏ అరెస్టు చేసింది. ఈ కేసులో సాక్ష్యం చెప్పాల్సిన జగన్ ఎన్ని నోటీసులిచ్చినా కోర్టుకు హాజరవ్వలేదు. ఏదో ఒక కారణం చూపి ఆయన సాక్ష్యం చెప్పకుండా తిరిగేవారని విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ కేసులో జగన్ వ్యవహారశైలిపై నిందితుడు కుటుంబంతోపాటు పౌర హక్కుల నేతలు, న్యాయవాదులు పలుమార్లు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. జగన్ ఒక్కసారి కోర్టుకు రావాల్సిందిగా వేడుకున్నారు. కానీ, ఆయన ఏనాడూ కోర్టు మెట్లు ఎక్కేందుకు ఇష్టపడలేదు. తాను ముఖ్యమంత్రి హోదాలో ఉండగా, కోర్టుకు వెళ్లి బోనులో నిల్చొవడమేంటన్న ఆలోచనతో జగన్.. కోర్టు విచారణకు దూరం ఉండేందుకు ఇష్టపడేవారని చెబుతున్నారు. ప్రతిపక్షాలు సైతం ఇవే తరహా విమర్శలు చేసేవి..
ఇక ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం జగన్ కు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఇద్దరికీ సంబంధం లేకపోయినా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా పనిచేసిన నేతల మధ్య సారూపత్యలు, భిన్న వ్యక్తిత్వాలపై తరచూ చర్చ జరుగుతుంటుంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గురువారం నాంపల్లి కోర్టులో ప్రత్యక్షమవడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎన్నికల సమయంలో ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలపై అప్పటి పీసీసీ అధ్యక్షుడైన రేవంత్ రెడ్డిపై కేసు నమోదైంది. ఈ కేసులో తన తప్పులేదని చెప్పుకునేందుకు ఆయన కోర్టుకు వచ్చారు. రేవంత్ పైనా ఓటుకు నోటు వంటి కేసులు పెండింగులో ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వం పెట్టిన ఇలాంటి కేసుల్లోనూ ఆయన విచారణ ఎదుర్కొంటున్నారు. కోర్టులను గౌరవించి న్యాయమూర్తల ముందు హాజరవుతున్నారని కాంగ్రెస్ చెప్పుకుంటోంది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి హోదాలో జగన్ వ్యవహరించిన తీరు చర్చకు తావిస్తోంది.
