Begin typing your search above and press return to search.

కేసీఆర్ - జగన్ స్నేహంపై రేవంత్ ఫైర్

సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు గత పాలనలో జరిగిన కీలకమైన తప్పుడు నిర్ణయాలపై ప్రజల దృష్టిని మరల్చడానికి ఉద్దేశించినవిగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   10 July 2025 9:55 AM IST
కేసీఆర్ - జగన్ స్నేహంపై రేవంత్ ఫైర్
X

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మ‌రొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ల స్నేహం వల్లే తెలంగాణ జలవివాదాల్లో కూరుకుపోయిందని ఆయన తీవ్రంగా ఆరోపించారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగొచ్చిన రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇద్ద‌రు మాజీ సీఎంల మ‌ధ్య ఉన్న ‘స్నేహబంధం’ రాష్ట్రానికి మేలు చేసేలా కాకుండా, న‌ష్టం కలిగించేలా మారిందని విమర్శించారు. ఈ వ్యవహారం వల్లే తెలంగాణ స‌మాజానికి మ‌ర‌ణ శాస‌నం రాశారంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

-కేసీఆర్ - జగన్ స్నేహంపై రేవంత్ ఫైర్

“కేసీఆర్ ఎవ‌రిని అడిగి జ‌లాల విష‌యంలో అంత పెద్ద స‌మాజాన్ని ఆపదలో ప‌డేశాడు? ఏపీ సీఎం జగన్‌తో చేతులు కలిపి, తెలంగాణ గొంతు కోశాడు. బేసిన్లు లేవ‌న్నారు, భేషజాలు లేవన్నారు. గోదావరి నుంచి నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని ప్రజలను మభ్యపెట్టారు. కానీ నిజంగా కేసీఆర్ చేసిన పొరపాట్లే ఇప్పుడు రాష్ట్రాన్ని దుస్థితికి నెట్టాయి” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు.

- హైదరాబాద్ నీటి వాటాపై కేసీఆర్ నిర్లక్ష్యం

రాష్ట్ర మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి కృష్ణా జలాల సమస్యలపై వివరణ ఇచ్చిన అనంతరం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... హైదరాబాద్‌కు వచ్చే నీటి వాటాను ఉమ్మడి జల వనరుల నుండి వేరు చేయాల్సిన బాధ్యతను కేసీఆర్ విస్మరించారని మండిపడ్డారు. “హైదరాబాద్‌కు అవసరమైన నీటి హక్కు వేరే. మిగతా వాటిని మాత్రమే రెండు రాష్ట్రాలు పంచుకోవాలి. కానీ ఈ చిన్న విషయాన్ని కూడా గుర్తించకుండా, కేసీఆర్ ప్రవర్తించిన విధానం వల్లే తెలంగాణ దెబ్బతింది” అని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా “ఏపీకి ముందుగా నీళ్లు విడుదల చేసేలా వ్యవహరించి, తెలంగాణ వాటా తర్వాత చూసే పరిస్థితిని తీసుకొచ్చారు. దీని ప్రభావం ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్నారు. మీరు మీ స్నేహాలు, ఒప్పందాలు చేసుకోవచ్చు. కానీ తెలంగాణ సమాజాన్ని ముంచే హక్కు మీకు ఎవరు ఇచ్చారు?” అంటూ కేసీఆర్‌పై ఘాటుగా ప్రశ్నించారు.

సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు గత పాలనలో జరిగిన కీలకమైన తప్పుడు నిర్ణయాలపై ప్రజల దృష్టిని మరల్చడానికి ఉద్దేశించినవిగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. జలవివాదాలపై తెలంగాణ ప్రభుత్వం కొత్త వైఖరి ప్రకటించే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ అంశం రాజకీయంగా మరింత వేడి రేపే అవకాశం కనిపిస్తోంది.