Begin typing your search above and press return to search.

చంద్రబాబు తెలంగాణా ప్రభుత్వం భూతాలు....కేసీఆర్ క్షుద్ర పూజలు

పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్ కానీ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ కాక ఒక రేంజిలో సాగుతోంది.

By:  Tupaki Desk   |   1 July 2025 9:52 PM IST
చంద్రబాబు తెలంగాణా ప్రభుత్వం భూతాలు....కేసీఆర్ క్షుద్ర పూజలు
X

పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్ కానీ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ కాక ఒక రేంజిలో సాగుతోంది. దీని మీద ఏపీకి పర్యావరణ అనుమతులు ఇవ్వలేమని కేంద్రం చెప్పిన తరువాత మొత్తం పరిస్థితిని

తమ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులకు వివరించేందుకు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ మీద నిప్పులు చెరిగారు అసలు బనకచర్ల ప్రాజెక్టు ఆలోచనను ఏపీకి కలిగించి ఆ రాచపుండుని తెలంగాణకు అంటించిందే కేసీఆర్ అని ఆరోపించారు. సముద్రంలో మూడు వేల గోదావరి జలాలు వృధాగా కలుస్తున్నాయని ఏ దేవుడు కేసీఅర్ కి చెప్పారని ఆయన నిలదీశారు.

అంతే కాదు గోదావరి క్రిష్ణా నికర జలాల విషయంలో తెలంగాణా హక్కులను ఏపీకి తాకట్టు పెట్టింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. 2014లో ఉమ్మడి ఏపీ విడిపోయిన తరువాత కృష్ణా బేసిన్ లో నాలుగో రాష్ట్రంగా తెలంగాణా ఏర్పడిందని ఆయన గుర్తు చేశారు. మొత్తం క్రిష్ణా జలాలలో ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలు వస్తే అందులో ఏపీకి 512 నికర జలాల వాటాను కేసీఆర్ ఇచ్చి తీరని అన్యాయం చేశారని నిందించారు.

నిజానికి తెలంగాణా రాష్ట్రంలో క్రిష్ణా జలాలు 68 శాతం పైగా పరివాహక ప్రాంతాన్ని కలిగి ఉన్నాయని అంతర్జాతీయ నీటి హక్కుల ప్రమాణాలు చూసినా పరీవాహక ప్రాంతాలకే ఎక్కువ నీటి కేటాయింపులు ఉండాలని ఆయన గుర్తు చేశారు. కానీ తెలంగాణాకు కేవలం 299 టీఎంసీలు మాత్రమే సరిపోతాయని చెప్పి సంతకం పెట్టింది కేసీఅర్ కదా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక గోదావరి నదిలో ఉమ్మడి ఏపీకి 1400 టీఎంసీలకు పైగా కేటాయింపులు ఉంటే ఇందులో 968 టీఎంసీల దాకా తెలంగాణాకు నికర జలాల హక్కులు ఉన్నాయని అన్నారు. ఏపీకి 500 పైగా టీఎంసీల నికర జలాల హక్కులే ఉన్నాయని అన్నారు. ఈ క్రమంలో ఇదే ప్రగతి భవన్ లో నాటి సీఎం జగన్ కి పిలిపించుకుని భోజనం కూడా పెట్టి వృధాగా పోతున్న గోదావరి జలాల మీద ప్రాజెక్టులు కట్టుకోమని సలహా ఇచ్చింది కేసీఆర్ కాదా అని రేవంత్ రెడ్డి నిలదీశారు.

అంతే కాదు నగరిలో వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇంటికి వెళ్ళి రాగి సంకటి చేపల పులుసు తిని మరీ రాయలసీమను గోదావరి జలాలతో రతనాల సీమను చేస్తామని చెప్పి వచ్చింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. తన తొమ్మిదిన్నరేళ్ళ పాలనలో అటు కృష్ణా జలాల మీద కానీ ఇటు గోదావరి జలాల మీద కానీ ఒక్క నీటి ప్రాజెక్ట్ కట్టకుండా నికర జలాలను సైతం వాడుకోలేని విధంగా చేసింది కేసీఆర్ ప్రభుత్వమే అని అన్నారు.

ఇక నీటి కేటాయింపులను ఎలా లెక్క వేస్తారో కూడా కేసీఆర్ కి తెలిసినట్లు లేదని అన్నారు. ముందు నికర జలాలు రెండు రాష్ట్రాలు వాడుకున్న మీదట ఎన్ని నీళ్ళు మిగులు జలాలు ఉన్నాయో లెక్క చూస్తారని, ఆ మీదట వరద జలాలు కూడా లెక్క చూస్తారని అన్నారు. నికర జలాలనే వాడుకోకుండా సముద్రంలో పోతున్నవి వృధా జలాలు అని కేసీఆర్ ఎలా చెప్పగలరని ప్రశ్నించారు.

ఇలా కేసీఆర్ హరీష్ రావు తమ పాలనలో తెలంగాణాకు నీటి కేటాయింపులలో తీరని అన్యాయం చేసి ఇపుడు తగుదునమ్మా అని ఆ బురదను తమకు రాయాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబుని భూతంగా తెలంగాణాలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరో భూతంగా చిత్రీకరిస్తూ కేసీఆర్ తన ఫాం హౌజ్ లో క్షుద్ర పూజలు చేస్తున్నారు అని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

చేసిందంతా మీరు చేసి ఇపుడు విమర్శలు చేస్తారా అని మండిపడ్డారు. మీకు తెలంగాణా నీటి అన్యాయాల మీద నిబద్ధత లేదని, ఉనికి లేని బీఆర్ఎస్ ని బతికించుకోవాలన్న తాపత్రయమే కనిపిస్తోందని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పంచాయతీ పెట్టి చోద్యం చూస్తోందని ఆయన అన్నారు. కేసీఆర్ ఎంతలా కాంగ్రెస్ ని ఇరికించాలని చూసినా ప్రజలకు అన్ని వాస్తవాలు తెలుసు అని ఆయన అన్నారు. తామే ఊరూరా తిరిగి తెలంగాణా రైతుల నోట్లో కేసీఆర్ ఎలా మట్టి కొట్టారో వివరిస్తామని ఆయన స్పష్టం చేశారు.