Begin typing your search above and press return to search.

గురువును మించిన శిష్యుడు.. జాతీయ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి ప్రత్యేకం

2023లో బీఆర్ఎస్ ను గద్దె దించి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి తన 20 నెలల పాలనలో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు.

By:  Tupaki Desk   |   20 Aug 2025 3:43 PM IST
గురువును మించిన శిష్యుడు.. జాతీయ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి ప్రత్యేకం
X

ఇండి కూటమి తరఫున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా రిటైర్డ్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఎంపికలో కీలక పాత్ర పోషించడం ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ రాజకీయాలను ఆకర్షించారు. ఉప రాష్ట్రపతి ఎన్నిక ఫలితం ఎలా ఉండబోతుందో అనే విషయమై స్పష్టత ఉన్నప్పటికీ, బలమైన ఎన్డీఏను ఢీకొట్టే అభ్యర్థిగా రిటైర్డ్ న్యాయమూర్తిని తెరపైకి తేవడం వెనుక అనేక వ్యూహాలు ఉన్నాయని అంటున్నారు. జాతీయ స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వంపై తమ నిరసనను వ్యక్తం చేయడానికి ప్రతిపక్షాలు ఉప రాష్ట్రపతి ఎన్నికను ఓ వేదికగా మార్చుకున్నా, తెలుగు రాజకీయాల్లో మాత్రం రేవంత్ రెడ్డి వ్యూహమే ఆసక్తికరంగా మారింది.

వాస్తవానికి ఎన్డీఏ అభ్యర్థిపై పోటీ చేయాలని ప్రతిపక్షాలు నిర్ణయం తీసుకున్న వెంటనే తమిళనాడుకు చెందిన ఎంపీ తిరుచ్చి శివ పేరు ప్రచారంలోకి వచ్చింది. ఎన్డీఏ తరఫున తమిళనాడు రాష్ట్రానికి చెందిన నేతను ఎంపిక చేయడం వల్ల, విపక్షం కూడా అదే వ్యూహం అనుసరించాలనే చర్చ జరిగింది. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యంతో అనూహ్యంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. రేవంత్ రెడ్డి పక్కా వ్యూహంతోనే సుదర్శన్ రెడ్డిని తెరపైకి తెచ్చారని, ఈ ఎంపిక ద్వారా ఆయన జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయికి చేరుకున్నారని అంటున్నారు. అదే సమయంలో రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానానికి మధ్య పొసగడం లేదని, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో అనుబంధం తెంచుకోలేకపోతున్నారన్న విమర్శలకు ఆయన చెక్ చెప్పినట్లే అంటున్నారు. ఓ విధంగా చెప్పాలంటే తన రాజకీయ గురువు చంద్రబాబును మించేలా వ్యూహరచన చేసి జాతీయ రాజకీయాల్లో తెలుగు నేతలకు ప్రతిష్ఠ పెంచారని ప్రశంసలు అందుకుంటున్నారు రేవంత్ రెడ్డి.

2023లో బీఆర్ఎస్ ను గద్దె దించి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి తన 20 నెలల పాలనలో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఓ విధంగా ఆయన కనిపించే శత్రువులతోపాటు తెరచాటున కత్తి దూస్తున్న అంతర్గత శక్తులతోనూ యుద్ధం చేయాల్సివస్తోందని అంటున్నారు. ముఖ్యమంత్రి పదవిని ఆశించిన పలువురు కాంగ్రెస్ సీనియర్లు అడుగడుగునా రేవంత్ రెడ్డికి అవాంతరాలు సృష్టిస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేరుగానే విమర్శలు చేస్తుండగా, ఆయనకు వెనుక నుంచి పలువురు ఉసిగొల్పుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో తన మంత్రివర్గంలో ఎవరు మంత్రులుగా ఉండాలనే స్వేచ్ఛ ఇవ్వకుండా కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డికి పరిమితులు విధించిందనే ప్రచారం చేస్తున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు భుజాలపై గన్ పెట్టి రేవంత్ రెడ్డిని కాల్చాలని ప్రతిపక్షం బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేసి చంద్రబాబు రుణం తీర్చుకునేలా పనిచేస్తున్నారని ఆరోపిస్తోంది.

ఇంటా బయటా ఎదురవుతున్న ఈ సవాళ్ల నుంచి బయటపడేందుకు రేవంత్ రెడ్డి ఇన్నాళ్లు తగిన సమయం కోసం ఎదురుచూశారని, ఉప రాష్ట్రపతి ఎన్నికలను అందుకు వేదికగా చేసుకునే తనపై జరుగుతున్న ప్రచారం, విమర్శలకు ఒకేసారి చెక్ చెప్పారని అంటున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉంటూ బీజేపీ పెద్దలతో రేవంత్ రెడ్డి సత్సంబంధాలు కొనసాగిస్తున్నారనే విమర్శలు, ఆరోపణలు కూడా ఆయనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని అంటున్నారు. ఈ ప్రచారానికి కూడా రేవంత్ రెడ్డి ఇప్పుడు సమాధానమిచ్చినట్లైందని అంటున్నారు. తెలుగు వారిని బరిలోకి దింపడం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్క కాంగ్రెస్ మాత్రమే బీజేపీని, ఆ పార్టీ అనుసరిస్తున్న హిందుత్వను వ్యతిరేకిస్తున్నట్లు రేవంత్ రెడ్డి చాటగలిగారని అంటున్నారు. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీపై మైనార్టీల్లో మరింత ఆదరణ పెరిగేలా వ్యూహం రచించారని అంటున్నారు.

ఇక స్వరాష్ట్రంలో తెలంగాణ బ్రాండ్ కు ఏకైక అంబాసిడర్ గా చెప్పుకునే బీఆర్ఎస్ కు రేవంత్ రెడ్డి ఝలక్ ఇచ్చారని అంటున్నారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా తెలంగాణకు చెందిన రిటైర్డ్ న్యాయమూర్తిని ఎంపిక చేయడం విద్యావంతులు, యువతలో కూడా ఆలోచనలు రేకెత్తించిందని అంటున్నారు. అధికారంలో ఉండగా దేశ్ కీ నేతగా చెప్పుకున్న కేసీఆర్ గతంలో ఈ విధంగా తెలంగాణ ప్రముఖులకు జాతీయ స్థాయిలో గౌరవం తెచ్చే పనిచేయలేదని చెప్పుకునేలా రేవంత్ రెడ్డి నిర్ణయం ఉందని అంటున్నారు. ఇదే సమయంలో టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చారని అంటున్నారు. బీజేపీ భాగస్వామిగా టీడీపీ, తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణణ్ కు మద్దతు ప్రకటించింది. అయితే టీడీపీ పుట్టుకతోనే వినిపించిన తెలుగు వారి ఆత్మ గౌరవం అన్న నినాదం చంద్రబాబును ఇరుకన పెడుతోందని అంటున్నారు. జాతీయ స్థాయిలో తెలుగువారి ఔనత్యాన్ని చాటిచెప్పే సుదర్శన్ రెడ్డి పోటీపై చంద్రబాబు పునరాలోచనలో పడేలా రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.