రెండోసారి కాదు.. మూడోసారీ సీఎం కావాలనుంది.. రేవంత్
భారత దేశ రాజకీయాల్లో అతికొద్ది మంది మాత్రమే మండల స్థాయి నుంచి సీఎం పదవి వరకు ఎదిగినవారు ఉంటారు... అందులోనూ కేవలం 17 ఏళ్లలోనే సీఎం పదవిని అందుకున్న వారు అతి తక్కువమందే అనుకోవాలి.
By: Tupaki Desk | 5 Sept 2025 5:21 PM ISTభారత దేశ రాజకీయాల్లో అతికొద్ది మంది మాత్రమే మండల స్థాయి నుంచి సీఎం పదవి వరకు ఎదిగినవారు ఉంటారు... అందులోనూ కేవలం 17 ఏళ్లలోనే సీఎం పదవిని అందుకున్న వారు అతి తక్కువమందే అనుకోవాలి. ఈ కోవలోకే వస్తారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 2006లో జడ్పీటీసీ సభ్యుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అయ్యారు. 2009లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో కూడా విజయం సాధించారు. 2018లో ఓడినా ఆ వెంటనే 2019లో ఎంపీగా నెగ్గి పార్లమెంటులో అడుగుపెట్టారు. ఇక 2023లో సీఎం అభ్యర్థిగానే ముందు నిలిచి తనతో పాటు పార్టీనీ గెలిపించారు.
రెండోసారి తన లక్ష్యంగా...
ఒకసారి సీఎం కావడం కాదు.. రెండోసారీ అంటే వరుసగా పదేళ్లు సీఎంగా ఉండడం తన లక్ష్యంగా ఇప్పటివరకు రేవంత్ పేర్కొన్నారు. సీఎం అయినవెంటనే ఇచ్చిన ఇంటర్వ్యూల్లోనూ ఇదే విషయం చెప్పారు. పదేళ్లు ఈ సీటు (సీఎం) నాదే అని సంకేతాలిచ్చారు. వచ్చే ఐదేళ్ల టర్మ్ సంగతి ఏమిటో కానీ.. ఈ ఐదేళ్ల టర్మ్ మాత్రం రేవంత్ కు ఢోకా లేదనే చెప్పాలి.
మూడోసారిపైనా గురి..
2028లో జరిగే ఎన్నికల అనంతరమూ తానే సీఎంనని చెబుతున్న రేవంత్ రెడ్డి తాజాగా మూడోసారీ సీఎం కావాలని ఉందనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఢిల్లీలో విద్యా సంస్కరణలు చేపట్టిన అర్వింద్ కేజ్రీవాల్ వరుసగా రెండుసార్లు గెలిచిన ఉదంతాన్ని గుర్తుచేశారు. శుక్రవారం గురు పూజోత్సవంలో పాల్గొన్న సీఎం రేవంత్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. విద్యా శాఖ చాలా ప్రాధాన్యం ఉన్నదని.. అందుకనే స్వయంగా తాను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. ప్రతి సమస్యలను పరిష్కరిస్తున్నానని అన్నారు. ఇంకా ఎన్నో సంస్కరణలు తీసుకురావాల్సి ఉందన్నారు.
ప్రభుత్వ బడుల్లోనూ నర్సీరీ...
ప్రభుత్వ పాఠశాలల్లోనూ నర్సరీ, ఎల్ కేజీ, యూకేజీ బోధిస్తున్నట్లు సీఎం రేవంత్ చెప్పారు. ప్రైవేటు, కార్పొరేట్ లో కంటే మెరుగైన ఫలితాలు సాధిద్దామనే ప్రతిన చేద్దామని పిలుపునిచ్చారు. ఏటా 200 మంది టీచర్లను విదేశాలకు పంపి అక్కడి విద్యా విధానం అధ్యయనం చేసేలా ప్రోత్సాహిత్సామన్నారు. టీచర్లు బాగా పనిచేస్తే రెండోసారి కాదు మూడోసారీ సీఎం కావాలనుకుంటున్నా అని సీఎం రేవంత్ అన్నారు.
