Begin typing your search above and press return to search.

గోల్డెన్ ఛాన్స్ ను మిస్ చేసుకున్న రేవంత్?

అవకాశాలు అన్నిసార్లు రావు. వచ్చినప్పుడు వాటిని సొంతం చేసుకోవాలి. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పు మీద తప్పు చేస్తున్నారా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   2 Jun 2025 9:53 AM IST
గోల్డెన్ ఛాన్స్ ను మిస్ చేసుకున్న రేవంత్?
X

అవకాశాలు అన్నిసార్లు రావు. వచ్చినప్పుడు వాటిని సొంతం చేసుకోవాలి. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పు మీద తప్పు చేస్తున్నారా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. బంగారం లాంటి అవకాశాల్ని అలా ఎలా వదిలేస్తారన్న ప్రశ్న వినిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2ను అంగరంగ వైభవంగా నిర్వహించాలసిన అవసరాన్ని రేవంత్ గుర్తించలేదా? అన్నది ప్రశ్న. గులాబీ పార్టీ అధికారంలో ఉన్న వేళలో ఆవిర్భావ వేడుకల్ని గ్రాండ్ గా చేయటం తెలిసిందే.

తెలంగాణ రాష్ట్రం మొత్తం కాకున్నా.. హైదరాబాద్ మహానగరంలో ఆ జోష్ కొట్టొచ్చినట్లుగా కనిపించేది. దీనికి సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లు చేసేవారు. తెలంగాణ ఉద్యమాన్ని.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని.. బతుకమ్మను తమ సొంత బ్రాండ్ లుగా ప్రమోట్ చేసుకునే పరిస్థితి. ఇలాంటి వాటిని బద్ధలు కొట్టాలన్నా.. ఆయా అంశాలకు సంబంధించి వారికి మించిన భావోద్వేగం తమలో ఉందన్న విషయాన్ని ప్రజలకు తెలిసేలా చేయాలంటే అందుకు అధికారం అవసరం.

రేవంత్ రెడ్డి చేతిలో ఇప్పుడు అధికారం ఉంది. ఆయన తెలంగాణ ప్రభుత్వాధినేతగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వేళ.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2ను ఎంత భారీగా నిర్వహించాలి? పదేళ్ల గులాబీ బాస్ సర్కారులో నిర్వహించిన వేడుకలు తలదన్నేలా ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది కదా? తెలంగాణ సెంటిమెంట్.. తెలంగాణ భావన గులాబీ పార్టీ గుత్తసొత్తు కాదని.. తెలంగాణ ప్రజలందరిదన్న భావన కలిగేలా చేయాలంటే.. వేడుకల్ని భారీగా చేపట్టాల్సి ఉంటుంది.

బ్యాడ్ లక్ ఏమంటే.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని పరేడ్ గ్రౌండ్స్ లో ప్రభుత్వం చేపడుతున్నా.. దానికి సంబంధించిన బజ్ విషయంలో మాత్రం పెద్దగా లేదన్న విమర్శ వినిపిస్తోంది. విపక్ష నేతగా వ్యవహరించి.. అధికారంలో ఉన్న వారు ఏమేం చేయాలన్న వాదనను గతంలో సమర్థంగా వినిపించిన రేవంత్.. తన చేతిలో అధికారంలో ఉన్న వేళ గతంలో తాను చెప్పినవి కూడా ఎందుకు చేయలేకపోతున్నారు? అన్నది ప్రశ్న.

ప్రభుత్వం మీద ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కు కొన్ని వేడుకలు.. కొన్ని ప్రత్యేక దినాలు ఎంతో కీలకమన్న చిన్న విషయాన్ని రేవంత్ ఎలా మర్చిపోతున్నారు? అన్నది మరో ప్రశ్న. గులాబా పార్టీ బ్రాండ్ గా మార్చుకున్న కొన్ని ఈవెంట్ల మీద ప్రత్యేకంగా ఫోకస్ చేసి.. తెలంగాణ ప్రజలందరికి.. తెలంగాణలోని ఇతర పార్టీలకు కూడా ఆయా దినాలు ఎంత ప్రత్యేకమన్న విషయాన్ని చేతల్లో చూపించాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది.