టార్గెట్ మోడీ.. చంద్రబాబు.. పవన్.. కేసీఆర్ ను మించేలా రేవంత్
చంద్రబాబు.. పవన్ కల్యాణ్.. కేసీఆర్.. కేటీఆర్.. రేవంత్.. ఈ పేర్లకు ఉన్న లింకు ఏమిటి? అంటే పిచ్చోడిని చూసినట్లుగా చూడొచ్చు.
By: Tupaki Desk | 30 May 2025 5:30 AMచంద్రబాబు.. పవన్ కల్యాణ్.. కేసీఆర్.. కేటీఆర్.. రేవంత్.. ఈ పేర్లకు ఉన్న లింకు ఏమిటి? అంటే పిచ్చోడిని చూసినట్లుగా చూడొచ్చు. అది సహజం. అయితే.. మీరు అనుకుంటున్నదేదీ మేం చెప్పట్లేదు. అదెలా అంటారా? అక్కడికే వస్తున్నాం. తెలుగు రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తున్న ఈ నేతల తీరు ఒకటిలా ఉండకపోవచ్చు. కానీ.. వారి రాజకీయ జీవితాన్ని పరిశీలిస్తే.. వీరందరిని కలిపే ఒక లింకు ఉంది. అదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీగా చెప్పాలి. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. చంద్రబాబు.. పవన్.. కేటీఆర్.. కేసీఆర్..తాజాగా రేవంత్. వీరంతా ప్రధాని మోడీని టార్గెట్ చేయటం..ఆయపై ఘాటు వ్యాఖ్యలు చేయటం కనిపిస్తుంది.
2014లో మోడీతో జట్టు కట్టిన చంద్రబాబు.. పవన్ లు ఆ తర్వాత కాలంలో ఆయన్ను ఎంత తీవ్రంగా టార్గెట్ చేశారో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. దేశంలో మరే రాజకీయ అధినేత వాడని భాషను.. ఆయనపై నిందల్ని.. విమర్శలతో విరుచుకుపడిన ట్రాక్ రికార్డు చంద్రబాబు సొంతం. ఆ మాటకు వస్తే చంద్రబాబు మాత్రమే కాదు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా తక్కువేం కాదు.
ఈ ఇద్దరు 2018 - 2019 కాలంలో ప్రధాని నరేంద్ర మోడీపై ఒంటికాలిపై విరుచుకుపడటం చూసిందే. కట్ చేస్తే.. ఆ తర్వాతి కాలంలో మోడీకి ఎంత విధేయులుగా మారారో తెలిసిందే. ఈ ఇద్దరు అధినేతల తర్వాత కేసీఆర్ పేరును ప్రస్తావించాలి. 2014 ఎన్నికలకు ముందు నుంచే నరేంద్ర మోడీని వ్యక్తిగతంగా దూషించటమే కాదు.. ఒక దశలో ఆయన్ను ఫాసిస్టు.. రక్తపిపాసిగా అభివర్ణించటం కేసీఆర్ కు మాత్రమే చెల్లింది. నిజానికి అప్పట్లో నరేంద్ర మోడీ కేసీఆర్ మాటల్ని కాస్తంత సీరియస్ గా తీసుకున్నట్లు చెబుతారు.
కట్ చేస్తే.. తనను అన్నేసి మాటలు అన్న కేసీఆర్ తో ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ దగ్గరకు తీసుకోవటమే కాదు.. కేంద్ర సహకారం తనకు ఉందన్న విషయాన్ని మాటల్లో చెప్పేశారు. ఒకదశలో కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తిన వైనం కనిపిస్తుంది. ఆ తర్వాత మోడీతో చెడటం.. బీజేపీపై తీవ్ర ఆరోపణ చేయటం లాంటివి కనిపిస్తాయి. తండ్రికి తగ్గ తనయుడి మాదిరి.. కేసీఆర్ అందుకున్న మోడీ వ్యతిరేక గళాన్ని ఆయన కుమారుడు కేటీఆర్ కూడా కంటిన్యూ చేశారు. ఇక్కడో విషయాన్ని చెప్పాలి. మోడీ మీద ఎక్కువగా విరుచుకుపడిన విషయంలో కేసీఆర్ కు మించినట్లుగా కేటీఆర్ కనిపిస్తారు.
అలాంటి కేటీఆర్ సైతం ఇప్పుడు మోడీ పార్టీలోకి తమ పార్టీని విలీనం చేయాలన్న ప్రయత్నాలు చేసినట్లుగా కవిత చేస్తున్న ఆరోపణలు సంచలనంగా మారుతున్నాయి. ఇలా తనను తిట్టినోళ్లందరి చేత పొగిడించుకునే అరుదైన రికార్డు మోడీకే సొంతంగా చెప్పాలి. ఇప్పుడు మోడీని ఒంటి కాలి మీద అన్నట్లుగా విరుచుకుపడుతున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్. ఇదే రేవంత్.. ఆయన్ను కలిసిన సందర్భంలో మాత్రం ఒద్దికగా.. పద్దతిగా వ్యవహరించటం కనిపిస్తుంది. రాజకీయాల్లో వైరం.. రాజకీయాలకే పరిమితం చేస్తున్నట్లుగా రేవంత్ తన తీరును ప్రదర్శిస్తున్నారు. ఇప్పటివరకు మోడీని తిట్టిన తెలుగు అధినేతలంతా తర్వాతి కాలంలో ఆయనతో చెట్టాపట్టాలేసుకున్న వాళ్లే. మరి.. రేవంత్ సంగతేమిటి? అన్నది తేలాలంటే అందుకు కాలం మాత్రమే సమాధానం చెబుతుందని చెప్పక తప్పదు.