రేవంత్ సినీ బంధం మరింత గట్టిగా !
తెలుగు సినిమా పరిశ్రమకు ఎక్కువగా సేవ చేసిన వారిలో మొదటి పేరుగా మర్రి చెన్నారెడ్డిని అంతా చెప్పుకుంటారు.
By: Tupaki Desk | 15 Jun 2025 9:46 AM ISTతెలుగు సినిమా పరిశ్రమకు ఎక్కువగా సేవ చేసిన వారిలో మొదటి పేరుగా మర్రి చెన్నారెడ్డిని అంతా చెప్పుకుంటారు. మర్రి చెన్నారెడ్డి రెండు సార్లు ఉమ్మడి ఏపీకి సీఎం గా పనిచేశారు. ఆయన హయాంలో సినీ పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్ కి తరలివచ్చింది. ఆయన 1978లో తొలిసారి సీఎం అయినపుడే దానికి బీజాలు వేశారు. ఇక రెండోసారి 1989లో అయినపుడు ఆ కలను సాకారం చేశారు.
తెలుగు సినీ పరిశ్రమకు ఏమేమి కావాలో కనుక్కుని మరీ ఆయన అన్నీ చేసి పెట్టారు. మళ్ళీ ఇన్నాళ్ళకు చూస్తే కనుక తెలంగాణాకు కాంగ్రెస్ సీఎం గా వచ్చిన రేవంత్ రెడ్డి కూడా సినీ పరిశ్రమ హైదరాబాద్ లో శాశ్వతంగా ఉండేందుకు తన వంతుగా చర్యలు తీసుకుంటున్నారు. అంతే కాదు భవిష్యత్తులో హైదరాబాద్ కే బాలీవుడ్ హాలీవుడ్ తరలి రావాలని ఆయన గట్టిగా కోరుకున్నారు.
గద్దర్ అవార్డుల వేదిక నుంచి ఆయన స్పూర్తివంతమైన స్పీచ్ ని ఇచ్చారు. ప్రభుత్వం కఠినంగా ఉండొచ్చు. కానీ తెలుగు సినిమా పరిశ్రమ పట్ల ఎంతో అభిమానంగా ఉంటుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అన్ని సందర్భాల్లో తాను అండగా నిలుస్తాను అని ఆయన హామీ ఇచ్చారు. మీకు ఏ అవసరం ఉన్నా నేను ఉంటాను అని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
అంతే కాదు తాను మరో పాతికేళ్ల పాటు చురుకైన రాజకీయ పాత్ర పోషిస్తాను అని తాను ఏ హోదాలో ఉన్నా తెలుగు సినీ పరిశ్రమకు తన వంతుగా సాయం చేస్తాను అని కూడా ఆయన చెప్పారు. ఇక రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత అప్పటికి పుష్కర కాలంగా నిలిచిపోయిన నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులను ప్రవేశపెట్టడమే కాకుండా పదేళ్ళ పాటు ఆగిన అవార్డులను అన్నీ కలిపి ఒకేసారి అందించారు. ఇక మీదట ప్రతీ ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహించెలా చర్యలు తీసుకుంటున్నారు.
మొత్తానికి చూస్తే తెలుగు సినీ పరిశ్రమ ఇప్పటికే హైదరాబాద్ లో పాతుకుని పోయింది. 1990 దశకంలో ఇండస్ట్రీ చెన్నై నుంచి తరలి వచ్చింది. గత మూడున్నర దశాబ్దాలుగా సినీ పరిశ్రమ హైదరాబాద్ కేంద్రంగా విస్తరిస్తోంది. ఈ రోజు పాన్ ఇండియా పాన్ వరల్డ్ మొవీస్ ని ప్రొడ్యూస్ చేస్తూ తెలుగు కీర్తిని విశ్వవ్యాప్తం చేస్తోంది.
ఈ తరుణంలో తెలుగు సినిమాకే కాదు హాలివుడ్ కే రాజధానిగా హైదరాబాద్ ని చేయాలని దానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ప్రసంగించడం హామీ ఇవ్వడం మంచి పరిణామం అంటున్నారు. అంతే కాదు అందరూ తనకు కావాల్సిన వారు అందరితో కలసి కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందని రేవంత్ రెడ్డి చెప్పాడం కూడా ఆలోచింపచేసేలా ఉంది.
తెలుగు సినిమాని పరిశ్రమగా చేసుకుని ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. ప్రభుత్వాలు అండగా ఉంటే మరింతగా రాణిస్తుంది. ఈ క్రమంలో ప్రభుత్వం తరఫున నేనున్నాను అని ఇచ్చే హామీ ఎపుడూ గొప్పదే అని అంటున్నారు. ఇక సినీ రంగంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ రకమైన గ్యాప్ లేదని రేవంత్ రెడ్డి తన స్పీచ్ ద్వారా తెలియచేశారు. అంతే కాదు సినీ ప్రముఖులు అందరితో తన పరిచయాలను ఆయన వల్లె వేసుకున్నారు. గద్దర్ అవార్డుల వేదిక ఒక విధంగా కాంగ్రెస్ ప్రభుత్వంతో సినీ బంధాన్ని మరింతగా గట్టిపరచింది అని అంటున్నారు.
