Begin typing your search above and press return to search.

కేటీఆర్ చుట్టూ డ్రగ్స్ బ్యాచ్.. చిట్ చాట్ లో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి బీఆర్‌ఎస్ నాయకత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

By:  Tupaki Desk   |   17 July 2025 6:30 PM IST
కేటీఆర్ చుట్టూ డ్రగ్స్ బ్యాచ్.. చిట్ చాట్ లో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.
X

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి బీఆర్‌ఎస్ నాయకత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాజాగా ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా మాట్లాడిన ఆయన, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం కడుపునిండా విషంతో మాట్లాడుతోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు సహజమని, అయితే నిర్మాణాత్మక సూచనలకే తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు.

- అసెంబ్లీకి కేసీఆర్ రావాలి.. రేవంత్ పిలుపు

రాష్ట్ర అభివృద్ధికి గాని, ప్రజల సంక్షేమానికి గాని సానుకూల సూచనలు అవసరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. "కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి తగిన సూచనలు చేయాలి. ప్రభుత్వంగా వాటిని స్వీకరించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం," అని రేవంత్ పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.

-తుమ్మిడిహట్టి ప్రాజెక్టు .. మహారాష్ట్ర పర్యటనపై ప్రకటన

నీటి ప్రాజెక్టుల ప్రాధాన్యతను వివరిస్తూ, తుమ్మిడిహట్టి ప్రాజెక్టు కోసం త్వరలోనే మహారాష్ట్ర పర్యటనకు వెళ్లనున్నట్లు సీఎం తెలిపారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం రెండున్నరేళ్లలో లక్ష ఉద్యోగాలు అందించే లక్ష్యంతో ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలలో ఒకటిగా ఆయన పేర్కొన్నారు.

-కేసీఆర్ కుటుంబంలో అంతర్గత సంక్షోభం

కేసీఆర్ కుటుంబంలో నాయకత్వ విషయంలో తీవ్ర విభేదాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. "కేటీఆర్ నాయకత్వాన్ని కవిత ఒప్పుకోవడం లేదు. ప్రతిపక్ష నేత పదవి కోసం కేటీఆర్ కాంగ్రెస్‌ను అడుగుతుంటే, కేసీఆర్ అంగీకరించడం లేదు. ఇది వారి కుటుంబ సమస్యే," అని ఆయన వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ పార్టీలో అంతర్గత కలహాలు తీవ్రంగా ఉన్నాయని ఈ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.

-డ్రగ్స్ కేసుపై సంచలన వ్యాఖ్యలు

మాజీ మంత్రి కేటీఆర్‌పై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ, ఆయన దుబాయ్‌లో కేదార్ అనే వ్యక్తితో కలిసి డ్రగ్స్ తీసుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. "కేదార్ మరణానికి గల పూర్తి నివేదిక ప్రభుత్వం దగ్గర ఉంది. అవసరమైతే అసెంబ్లీలో ఆ నివేదికను పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మద్యంలో కాక్‌టెయిల్ విన్నాం కానీ డ్రగ్స్‌లో కాక్‌టెయిల్ తొలిసారి వింటున్నాం," అన్నారు. కేటీఆర్ గంజాయి బ్యాచ్ అని.. అతని చుట్టూ ఉండేవాల్ల డ్రగ్స్ తీసుకుంటారని రేవంత్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపే అవకాశం ఉంది.

-కోర్టు స్టేలు .. కేటీఆర్‌కు అలవాటే

ఫోన్ ట్యాపింగ్ కేసుపై స్పందిస్తూ, హైకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరుగుతోందని సీఎం తెలిపారు. "డ్రగ్స్ కేసులో కోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్నది నేను కాదు. కోర్టులను ఆశ్రయించడం కేటీఆర్‌కు అలవాటే," అని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. చట్టపరమైన ప్రక్రియలలో కేటీఆర్ జోక్యం చేసుకుంటున్నారని ఆయన పరోక్షంగా ఆరోపించారు.

-రిజర్వేషన్లపై స్పష్టత

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం తమ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ముస్లిం రిజర్వేషన్లు దేశ స్వాతంత్ర్యం తర్వాత నుంచే అమలులో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. "బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింలకు రిజర్వేషన్లు తొలగించిన తరువాతే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడాలి," అంటూ రేవంత్ రెడ్డి బీజేపీపై విమర్శలు గుప్పించారు.

ఈ వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డి, బీఆర్‌ఎస్ పార్టీకి కౌంటర్ ఇవ్వడమే కాకుండా, తన ప్రభుత్వ విధానాలను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. రాజకీయాలు వేడెక్కుతున్న ఈ సమయంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు మరింత చర్చనీయంగా మారాయి.