Begin typing your search above and press return to search.

రేవంత్ కి ద్వితీయ గండం : వరస సవాళ్ళతో ఉక్కిరిబిక్కిరి

తెలంగాణా కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి మంత్రిగా పని చేయలేదు. ఏకంగా సీఎం అయిపోయారు.

By:  Tupaki Desk   |   5 May 2025 7:30 PM
Revanth Reddy’s Second Year Storm
X

తెలంగాణా కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి మంత్రిగా పని చేయలేదు. ఏకంగా సీఎం అయిపోయారు. దాంతో ఆయనకు పాలనా అనుభవం లేదని అంతా అన్నారు. ఇక రేవంత్ కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రచారంలో ఉన్న సమయంలోనే మీడియా ఆయన్ని ఇదే విషయం మీద ప్రశ్నించింది.

దానికి రేవంత్ చాలా క్యాజువల్ గా తీసుకుని ఆన్సర్ ఇచ్చారు. సీఎం అంటే గుంపు మేస్తీ అని ఆయన కొత్త విశేషణం చెప్పారు. అందరినీ కో ఆర్డినేట్ చేసుకుంటూ పోవడమే అని కూడా అన్నారు. అయితే అందరికీ కలుపుకుని పోవడమే అసలైన సవాల్. అంతే కాదు కాంగ్రెస్ లో మహాసముద్రాన్ని ఈదిన వాణ్ణి కూడా ఈత రాదని తేల్చేస్తారు.

కాంగ్రెస్ లో ఇంట గెలవడంతోనే పాలనా పుణ్య కాలం అంతా ముగుస్తుంది. ఇక బయట రాజకీయ ప్రత్యర్ధులతో పోరాటం అన్నది చేయడానికి సమయం కూడా సరిపోదు. ప్రభుత్వంలో కూడా అన్ని వర్గాల వారినీ ఒక లెక్కకు తేవడం అతి పెద్ద సవాల్ గా ఉంటుంది.

ఇక చూస్తే కనుక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి తొలి ఏడాది బాగానే గడచింది. హానీమూన్ పీరియడ్ అన్నట్లుగా అలా సరదాగా సాఫీగా సాగిపోయింది. కానీ అసలు సమస్యలు అన్నీ ద్వితీయ వార్షికంలోనే మొదలయ్యాయి. ద్వితీయ గండం అంటారు అక్కడే. దానినే ఎవరైనా అధిగమించలేక ఇబ్బంది పడతారు.

కాంగ్రెస్ ముఖ్యమంత్రుల చరిత్ర చూసుకుంటే ద్వితీయ గండానికి బలి అయిన వారుగా పీవీ నరసింహారావు కనిపిస్తారు. ఆయన కూడా 1970 దశకంలో అనూహ్యంగా సీఎం అయి ముళ్ళ కిరీటాన్ని భరించలేననిపించుకున్నారు. ఇక కాంగ్రెస్ లో రెండు సార్లు సీఎం అయిన మర్రి చెన్నారెడ్డి వంటి దిగ్గజ నేత కూడా ద్వితీయ వార్షికోత్సవం చూడకుండానే మాజీ అయ్యారు. అలా 1978లో 1989లో రెండు సార్లు ఆయనకు జరిగింది.

అలాగే దామోదరం సంజీవయ్య నుంచి చూస్తే కనుక కోట్ల విజయభాస్కరరెడ్డి, అంజయ్య, భవనం వెంకట్రామిరెడ్డి, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి వంటి వారు ఫుల్ టెర్మ్ చూడలేదు. టీడీపీ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ తరఫున ఫుల్ టెర్మ్ పాలించిన వారు ఒకే ఒక్కరు ఆయనే వైఎస్సార్. ఆయనకు పార్టీ పట్లు తెలుసు. పాలనాపరంగా అనుభవం సాధించి అయిదేళ్ళ పాటు సర్కార్ ని విజయవంతంగా నడిపించారు. తిరిగి రెండోసారి గెలిచారు.

ఇక రేవంత్ రెడ్డి విషయానికి వస్తే ఆయనకు మొదట సహకరించిన సీనియర్లు అంతా ఇపుడు అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు అని వార్తలు వస్తున్నాయి. బీఆర్ఎస్ బలమైన విపక్షంగా ఉంది. ఆ పార్టీ వ్యూహాలు చేస్తున్న విమర్శలను సమర్ధంగా కాంగ్రెస్ నుంచి తిప్పికొట్టేవారు కరవు అయ్యారని అంటున్నారు.

ఇటీవల జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో ఏ ఒక్క హామీని ప్రభుత్వం చేయలేదు అంటే దానికి వివరణ ఇచ్చుకోవాల్సింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రమే అయ్యారు. అంతే కాదు ప్రతీ రోజూ బీఆర్ఎస్ ఒక పధకం ప్రకారం ప్రభుత్వం మీద మాటల దాడి చేస్తోంది. దానిని ఖండించే వారు లేరని అంటున్నారు.

మరో వైపు చూస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంతా జనం బాట పట్టాలని సొంత నియోజకవర్గాల్లో ఉండాలని ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలను చాలా మంది బేఖాతరు చేస్తున్నారు అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే మంత్రుల పనితీరు మీద కూడా సీఎం స్థాయిలో అసంతృప్తి ఉందని అంటున్నారు

అలాగే కాంగ్రెస్ లో మంత్రి పదవుల మీద ఆశపెట్టుకున్న వారు కూడా పార్టీ మీద ప్రభుత్వం మీద అసంతృప్తితో ఉంటున్నారు. కేబినెట్ లో బెర్తులను భర్తీ చేయకపోవడంతో పెరుగుతున్న అసహనం కాస్తా సెగలూ పొగల రూపంలో పాకుతోంది అని అంటున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ ఆ మధ్యన ఊరించి మరీ మంత్రి పదవులు భర్తీ చేస్తామని అన్నది. కానీ చివరాఖరులో ఆ పని జరగలేదు. దాంతో పార్టీలో నిర్లిప్తత ఆవరించింది అని అంటున్నారు.

మరో వైపు చూస్తే కనుక మంత్రి వర్గంలో కొత్త వారిని తీసుకున్నా పాత వారిని తీసేసినా చెలరేగే అసంతృప్తి కూడా ఒక స్థాయిలో ఉంటుందని అంటున్నారు ఈ విధంగా ఆలోచించే హైకమాండ్ ఆపిందని చెబుతున్నారు. ఇవన్నీ కూడా తలనొప్పులుగానే ఉన్నాయని చెబుతున్నారు.

వీటికి తోడు అన్నట్లుగా ఇపుడు తెలంగాణా ప్రభుత్వ ఉద్యోగులు సర్కార్ మీద సమర శంఖం పూరించారు. తమ డిమాండ్ల సాధన కోసం వారు పోరాడుతామని అంటున్నారు. దాంతో సీఎం కి ఇది కొత్త సమస్యగా మారుతోంది

ఇక ఉన్న విషయం ఆయన గుడ్డ విడిచినట్లుగా అంతా చెప్పేశారు. తెలంగాణా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగులేదని ఆయన కుండబద్ధలు కొట్టారు. తెలంగాణకు అప్పు పుట్టడం లేదని అన్నారు. రాష్ట్రానికి అప్పు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అదే సమయంలో ఉద్యోగ సంఘాల డిమాండ్లపై ఆయన తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వంపై సమరం అని ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతున్నారని, కానీ ఎవరిపై చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం అంటే అందులో ఉద్యోగులూ కుటుంబ సభ్యులే అన్నారు. ఉద్యోగ సంఘాల నాయకులు తమ యుద్ధం ప్రజల మీద చేయాలనుకుంటున్నారా అని నిలదీశారు. రాజకీయ నాయకుల చేతుల్లో పావులుగా మారవద్దని హితవు పలికారు. మొత్తం మీద రెండవ ఏడాదిలో రేవంత్ రెడ్డి ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ సమస్యలు దాటి ముందుకెళ్తే ఆయనకు ముందున్నవి మంచి రోజులే అని అంటున్నారు.