కొత్త డౌట్? సీఎం రేవంత్ ను అధికారులు డార్క్ లో ఉంచుతున్నారా?
రాజశ్యామల ఆలయ నిర్మాణం దాదాపు పూర్తి కావొస్తున్న వేళ.. మంత్రివర్గంలో ఈ భూముల్ని వెనక్కి తీసుకోవాలన్న నిర్ణయం సంచలనంగా మారింది.
By: Garuda Media | 1 March 2026 5:00 PM ISTకొద్దిరోజులుగా శారదాపీఠం భూములకు సంబంధించిన చోటు చేసుకుంటున్న పరిణామాల గురించి తెలిసిందే. గత వారంలో కాబినెట్ భేటీలో.. కోకాపేటలో విశాఖ శారదాపీఠానికి కేటాయించిన రెండు ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటున్నట్లుగా నిర్ణయాన్ని ప్రకటించటం తెలిసిందే. కేసీఆర్ ప్రభుత్వంలో ఈ భూముల్ని ఎకరం కోటి రూపాయిల చొప్పున శారదాపీఠానికి అప్పటి ప్రభుత్వం కేటాయింపులు జరిపింది. ఇప్పటికే అక్కడ పలు కట్టడాల నిర్మాణం జరిగింది.రాజశ్యామల ఆలయ నిర్మాణం దాదాపు పూర్తి కావొస్తున్న వేళ.. మంత్రివర్గంలో ఈ భూముల్ని వెనక్కి తీసుకోవాలన్న నిర్ణయం సంచలనంగా మారింది.
కట్ చేస్తే.. శనివారం ఈ ఉదంతానికి సంబంధించి పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. శారదాపీఠానికి కేటాయించిన భూములు వెనక్కి తీసుకునే అంశానికి సంబంధించి ఎలాంటి నోటీసులు తమకు అందలేదన్న మాట శారదాపీఠం వైపు నుంచి వచ్చినట్లుగా తెలుస్తోంది. మరోవైపు.. ఈ భూమిని స్వాధీనం చేసుకోవటానికి అధికారులు సిద్ధమవుతున్న వేళలో.. మాజీ మంత్రి.. సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఎంట్రీ ఇచ్చారు. శనివారం ఉదయం ఆయన ఈ ప్రాంతాన్ని సందర్శించి.. ఈ భూముల్లో సీఎం అల్లుడి ప్రయోజనాల కోసమే వెనక్కి తీసుకుంటున్నట్లుగా పేర్కొంటూ సంచలన ఆరోపణలు చేశారు.
ఇదిలా ఉండగా.. ఈ భూమిని వాటర్ బోర్డు తీసుకుంటున్నట్లుగా ఒకప్రకటన వెలువడింది. గుడులు కూల్చటం ఏమిటన్న విమర్శలు రేవంత్ సర్కారు మీద వస్తున్న వేళ.. శనివారం సాయంత్రం సచివాలయంలో ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పీఠం భూములు జలమండలికి కేటాయించే సమయంలో అక్కడ ఉన్న నిర్మాణాల గురించి తనకు సమాచారం ఎందుకు ఇవ్వలేదంటూ అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేయటంతో పాటు.. జలమండలికి కేటాయించిన భూముల్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో.. ఆ భూమల్ని శారదాపీఠానికే కొనసాగిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ ఉదంతంపై మంత్రి శ్రీధర్ బాబును కలిసి నిర్మాణాలు.. ఇతర పరిస్థితుల గురించి తెలియజేయాలని శారదాపీటం వర్గాలకు సూచన చేశారు.
ఈ మొత్తం ఎపిసోడ్ లో అర్థం కాని విషయాలు రెండు. అందులో మొదటిది కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోవటానికి ముందే.. ఉన్నతాధికారులు పీఠానికి కేటాయించిన భూముల్లో నిర్మాణాలు జరిగాయన్న విషయాన్ని ముఖ్యమంత్రికి ఎందుకు తెలియజేయలేదు. నిజానికి ఒక అధ్యాత్మికసంస్థకు భూములు కేటాయించి.. వాటిని వెనక్కి తీసుకునే ముందు.. సదరు పీఠానికి చెందిన ప్రముఖుడ్ని కానీ.. ప్రతినిధిని కానీ ప్రభుత్వ వర్గాలు సంప్రదించటం.. వారితో ప్రభుత్వం చర్చలు జరిపేలా చేసి.. ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. కానీ.. ఈ ఎపిసోడ్ లో అలాంటిదేమీ చోటు చేసుకోకపోవటం చూస్తే.. ఆశ్చర్యానికి గురయ్యేలా చేస్తుంది. ఏమైనా.. తాజా ఎపిసోడ్ రేకెత్తించే ప్రధాన ప్రశ్న ఏమంటే.. ముఖ్యమంత్రి రేవంత్ ను కొన్ని విషయాల్లో డార్కులో ఉంచుతున్నారా? గ్రౌండ్ లో జరుగుతున్న వాస్తవాలు ఆయనకు నేరుగా వెళ్లకుండా ఫిల్టర్లు వాడుతున్నారా? అదే నిజమైతే.. రానున్న రోజుల్లో సీఎం రేవంత్ కు ఎదురయ్యే కష్టాలు ఎక్కువగానే ఉంటాయని చెప్పక తప్పదు.
