మేం తలుచుకుంటే పాకిస్తాన్ ప్రపంచపటంలో ఉండదు: రేవంత్ మాస్ వార్నింగ్
భారత సార్వభౌమత్వంపై దాడి చేయాలని చూసే వారికి ఈ భూమ్మీద నూకలు చెల్లినట్లేనని ఆయన స్పష్టం చేశారు.
By: Tupaki Desk | 8 May 2025 5:06 PMపహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో, భారత సైన్యానికి సంఘీభావంగా హైదరాబాద్‌లో నిర్వహించిన భారీ ర్యాలీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉగ్రవాదులు, వారిని ప్రోత్సహించే దేశాలపై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. భారత సార్వభౌమత్వంపై దాడి చేయాలని చూసే వారికి ఈ భూమ్మీద నూకలు చెల్లినట్లేనని ఆయన స్పష్టం చేశారు. మా వీర జవాన్లు అనుకుంటే పాకిస్తాన్‌ని రాత్రికి రాత్రే మట్టిలో కలిపేస్తారని హెచ్చరించారు.
- సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరికలు:
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘"పాకిస్తాన్ ఉగ్రవాదులు, పాకిస్తాన్ పాలకులు లేదా అంతర్జాతీయ ముఖచిత్రంలో ఉన్న ఏ దేశమైనా సరే, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి భారత సార్వభౌమత్వంపై దాడి చేయాలని చూసి, భారత్ వైపు కన్నెత్తి చూస్తే, వారు ఈ భూమిపై జీవించే అర్హత కోల్పోతారు." అని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. ఎన్నికల సమయంలో రాజకీయ భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, ఉగ్రవాదాన్ని అణచివేయడానికి కేంద్రం తీసుకునే ఏ చర్యకైనా సంపూర్ణ మద్దతు ఉంటుందని కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ప్రకటించడం భారతీయ స్ఫూర్తికి నిదర్శనమని ఆయన అన్నారు.
‘‘మహాత్మా గాంధీ శాంతి సిద్ధాంతాన్ని అనుసరిస్తూ భారతీయులు శాంతిని కోరుకుంటున్నారని, తమ శాంతి కాంక్షను చేతగానితనంగా భావించి, భారత్ భూభాగంలో కాలుమోపి, ఆడబిడ్డల నుదుట సిందూరాన్ని తుడిచేయాలని చూస్తే, దానికి 'ఆపరేషన్ సిందూర్' సమాధానం చెబుతుందని’’ రేవంత్ హెచ్చరించారు. ఉగ్రవాదులను నేలమట్టం చేసే శక్తి భారత వీర జవాన్లకు ఉందని, వారికి 140 కోట్ల మంది భారతీయులు అండగా ఉంటారని ఈ ర్యాలీ ద్వారా సందేశం ఇచ్చామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
- హైదరాబాద్‌లో భారీ సంఘీభావ ర్యాలీ:
భారత సైన్యానికి సంఘీభావంగా, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో హైదరాబాద్‌లో భారీ ర్యాలీ జరిగింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయం నుంచి నెక్లెస్ రోడ్డు వరకు ఈ ర్యాలీ సాగింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్సీ విజయశాంతి, సచివాలయ ఉద్యోగులు, మాజీ సైనికాధికారులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువత జాతీయ జెండాలను చేతబూని ఈ ర్యాలీలో పాల్గొన్నారు. పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఈ సందర్భంగా పుష్పాంజలి ఘటించి, రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు.