మళ్లీ సీఎం అంటే అసలు కుదరదు...రేవంత్ కి షాక్ !
కాంగ్రెస్ పార్టీకి 146 ఏళ్ళ చరిత్ర ఉందని రాజగోపాల్ రెడ్డి గుర్తు చేశారు. ఆ పార్టీలో ఎంతో మంది పెద్దలు ఉన్నారని అన్నారు.
By: Satya P | 14 Feb 2026 5:53 PM ISTతాను పదేళ్ళ సీఎం ని అని తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెబుతూ వస్తున్నారు. అయితే ఆయన చెబుతున్న ఈ మాటలను పార్టీలోని వారు ఎలా తీసుకుంటున్నారో తెలియదు కానీ నల్గొండ జిల్లా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అసలు రేవంత్ రెడ్డి మళ్ళీ ఎందుకు సీఎం అవుతారు అని ఆయన ప్రశ్నిస్తున్నారు.
ఏ పార్టీ నుంచి :
నిన్నటికి నిన్న మునుగోడులో కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన స సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి తాను మంత్రి కాకపోతే ముఖ్యమంత్రిగానే డైరెక్ట్ గా అవుతాను అని హాట్ కామెంట్స్ చేశారు. తనకు మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ పెద్దలు హామీ ఇచ్చారు అని గుర్తు చేశారు. ఇక ఈ రోజు ఆయన మరో అడుగు ముందుకేసి రేవంత్ రెడ్డి 2028 ఎన్నికల్లో మళ్ళీ ముఖ్యమంత్రి ఎలా అవుతారు అని ప్రశ్నించారు. ఆయన ఏ పార్టీ నుంచి సీఎం అవుతారో చెప్పాలని ఆయన కోరడమూ విశేషం.
ఎందుకు ఊరుకుంటున్నారు :
కాంగ్రెస్ పార్టీకి 146 ఏళ్ళ చరిత్ర ఉందని రాజగోపాల్ రెడ్డి గుర్తు చేశారు. ఆ పార్టీలో ఎంతో మంది పెద్దలు ఉన్నారని అన్నారు. వేరే పార్టీ నుంచి వచ్చినా రేవంత్ రెడ్డిని అంతా కలసి కష్టపడి గెలిపిస్తేనే ముఖ్యమంత్రి అయ్యారు అని గుర్తు చేశారు. అలాంటిది ఆయన తానే పదేళ్ల పాటు సీఎం అని పదే పదే ఎలా ప్రకటించుకుంటారు అని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడుతూంటే మంత్రులు సీనియర్ నేతలు పీసీసీ పెద్దలు ఎందుకు మాట్లాడటం లేదని ఆయన అన్నారు. తెలంగాణాలో నడిచేది రాహుల్ గాంధీ కాంగ్రెస్ నా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నా అని ఆయన ప్రశ్నించారు. తానే పదేళ్ళు సీఎం అని అనడం రాహుల్ గాంధీని అవమానించడమే అని ఆయన అన్నారు.
ఆంధ్ర పెత్తనం అంటూ :
అంతే కాదు రాజగోపాల్ రెడ్డి తెలంగాణా భావోద్వేగాలను తట్టిలేపేలా మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రా పెత్తనమే ఈ రోజుకీ తెలంగాణాలో సాగుతోంది అని ఆయన హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు మనుషుల ఆధిపత్యమే సాగుతోంది అని కూడా కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ లో ఉన్న ఒరిజినల్ లీడర్స్ కి విలువ లేదని వారు ఎంతో ఇబ్బంది పడుతున్నారని రాజ గోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని కూడా రాజగోపాల్ రెడ్డి మాట్లాడడం విశేషం.
అసహనంతోనేనా :
రేవంత్ రెడ్డిని ఎందుకు రాజగోపాల్ రెడ్డి టార్గెట్ చేశారు అన్న దాని మీద చర్చ సాగుతోంది. తనకు మంత్రి పదవి దక్కలేదని అసహననంతోనేనా ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నారు అని అంతా ఆలోచిస్తున్నారు. రేవంత్ రెడ్డి అన్న కోమటి రెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డితో బాగా ఉంటున్న నేపధ్యంలో తమ్ముడు ఈ విధంగా వ్యవహరించడమేంటన్న చర్చ సాగుతోంది. మరి సీఎం మీద నేరుగా ఈ ఘాటు అయిన వ్యాఖ్యలు చేయడంతో దీని మీద సీఎం రేవంత్ ఏ విధంగా రియాక్టు అవుతారు కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏ విధంగా ఈ వ్యాఖ్యలను తీసుకుంటారు అన్నది చర్చగా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
