Begin typing your search above and press return to search.

బీజేపీతోనే అక్షరాభ్యాసం అన్న కాంగ్రెస్ సీఎం

రాజకీయాల్లో ఉన్న వారు తాము ఉన్న పార్టీ గురించే చెప్పుకుంటారు. ఇక వెనకటి పార్టీని దునుమాడతారు.

By:  Tupaki Desk   |   9 Jun 2025 7:00 AM IST
బీజేపీతోనే అక్షరాభ్యాసం అన్న కాంగ్రెస్ సీఎం
X

రాజకీయాల్లో ఉన్న వారు తాము ఉన్న పార్టీ గురించే చెప్పుకుంటారు. ఇక వెనకటి పార్టీని దునుమాడతారు. అంతే కాదు వీలు దొరికితే తాము ఉన్న పార్టీలోనే పుట్టి పెరిగినట్లుగా గొప్పలు చెప్పుకుంటారు. కానీ కాంగ్రెస్ సీఎం గా ఆ పార్టీకి పీసీసీ ప్రెసిడెంట్ గా వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేసి ఈ రోజు కాంగ్రెస్ కి తెలంగాణాలో అధికారంలోకి తీసుకుని వచ్చిన డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి అయితే చాలా విషయాల్లో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు. ఆయన బోల్డ్ నెస్ కే చాలా మంది అభిమానులు ఉన్నారు.

ఆయన కాంగ్రెస్ లో ఉన్నా ఏ రోజూ చంద్రబాబు మీద అభిమానాన్ని ఎక్కడా దాచుకోలేదు. నాకు ఆయన ఒకనాడు అవకాశం ఇచ్చారు. వేరే పార్టీలోకి మారాక విమర్శించాలా అని అంటూంటారు రేవంత్ రెడ్డి. ఇక చూస్తే ఆయన తెలంగాణా బీజేపీలో భీష్ముడు అనదగిన నాయకుడు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. తాను చదువుకున్నది బీజేపీలో అని అసలు విషయం చెప్పారు. ఇక తన కాలేజీ జీవితం టీడీపీలో గడిస్తే తాను ఉద్యోగం చేస్తోంది కాంగ్రెస్ లో రాహుల్ గాంధీ దగ్గర అని తన రాజకీయ ప్రస్తానాన్ని మూడు ముక్కలలో తేల్చేశారు.

తాను బీజేపీలోనే ఆరంభంలో పనిచేశాను అని రేవంత్ రెడ్డి సభా ముఖంగా చెప్పడమే కాదు తనకు బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అత్యంత సన్నిహితులు అని కూడా చెప్పారు. ఇక తాను ఇటీవల నీతి అయోగ్ సమావేశానికి ఢిల్లీకి వెళ్ళినపుడు ప్రధాని మోడీతో ఇదే విషయం చెప్పాను అన్నారు తాను మొదట బీజేపీ విద్యార్ధిని అని ఆ తరువాత కాలేజి లైఫ్ అంతా టీడీపీలో గడచింది అని కూడా చెప్పాను అన్నారు.

ఇక నీతి అయోగ్ సమావేశంలో మోడీ చంద్రబాబుని తనకు చూపించి మీ సన్నిహితుడు ఇక్కడే ఉన్నారు అని వ్యాఖ్యలు చేశారని దానికి తాను చంద్రబాబు వద్ద పనిచేశాను అని చెప్పడం జరిగిందని అన్నారు. ఇక బండారు దత్తాత్రేయ అంటే తనతో పాటు అందరికీ ఎప్పటికీ ఒక గౌరవమే అని అన్నారు. జంట నగరాల ప్రజలకు కష్టం వస్తే ముందు పలికే నాయకుడు దత్తాత్రేయ అని కొనియాడారు.

మొత్తానికి తన పూర్వ మూలాలను అనుబంధాలను మరచిపోకుండా రేవంత్ రెడ్డి మాట్లాడడం ఒక విశేషం అయితే ఆయన డేరింగ్ అండ్ డేషింగ్ గా ఉన్న విషయాలు చెప్పారని అంతా అంటున్నారు. ఏది ఏమైనా దత్తాత్రేయ పుస్త్కావిష్కరణ సభలో రేవంత్ స్పీచ్ అయితే అందరినీ ఆకట్టుకుంది. మరి ఆయన బీజేపీ టీడీపీల మీదుగా కాంగ్రెస్ లోకి అని చెప్పిన మాటలు కాంగ్రెస్ నాయకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి జీవితం తెరచిన పుస్తకమే అని అందువల్ల ఏమీ జరిగేది ఉండదని అంటున్నారు.