Begin typing your search above and press return to search.

15 రోజుల్లో 'సార్ ఎమ్మెల్సీ'... సీఎం రేవంత్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

ముఖ్య‌మంత్రి హోదాలో ఉస్మానియా యూనివ‌ర్సిటీ (ఓయూ)కు వెళ్లారు రేవంత్ రెడ్డి. అదే పెద్ద సంచ‌ల‌నం అనుకుంటే... ఉద్య‌మాల పురిటి గ‌డ్డ వేదిక‌గా సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   25 Aug 2025 7:00 PM IST
15 రోజుల్లో సార్ ఎమ్మెల్సీ... సీఎం రేవంత్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!
X

ముఖ్య‌మంత్రి హోదాలో ఉస్మానియా యూనివ‌ర్సిటీ (ఓయూ)కు వెళ్లారు రేవంత్ రెడ్డి. అదే పెద్ద సంచ‌ల‌నం అనుకుంటే... ఉద్య‌మాల పురిటి గ‌డ్డ వేదిక‌గా సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. కొంద‌రు వ్య‌క్తులు ఉస్మానియా చ‌రిత్ర‌ను కాల‌గ‌ర్భంలో క‌ల‌పాల‌ని చూశార‌ని, తాము మాత్రం 108 ఏళ్ల చ‌రిత్ర ఉన్న యూనివ‌ర్సిటీకి ద‌ళితుడిని వైస్ చాన్స్ ల‌ర్ ను చేశామ‌ని అన్నారు. అంతేకాదు.. ఉద్య‌మ గొంతుక అయిన ఓయూకు సెక్యూరిటీ కూడా లేకుండా వ‌స్తాన‌ని.. నిర‌స‌న‌లు తెలిపినా ఏమీ అన‌బోన‌ని హామీ ఇచ్చారు.

మానవ రూపంలో మృగాల‌న్నీ ఫాంహౌస్ లోనే..

ఇటీవ‌లి హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూముల వివాదం నేప‌థ్యంలోనూ సీఎం రేవంత్ ప్ర‌తిప‌క్ష బీఆర్ఎస్ పై మండిప‌డ్డారు. సెంట్ర‌ల్ వ‌ర్సిటీలో ఎలాంటి క్రూర మృగాలు లేవ‌ని, మానవ రూపంలో మృగాలు అన్నీ ఫాంహౌస్ లోనే ఉన్నాయ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తెలంగాణ అంటే ఓయూ అని, ఓయూ అంటే తెలంగాణ అని కొనియాడారు. దేశ రాజ‌కీయాల‌ను శాసించిన మాజీ ప్ర‌ధాని పీవీ, మాజీ సీఎం చెన్నారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి వంటి ఎంద‌రో నాయ‌కులు ఇక్క‌డినుంచే వ‌చ్చార‌ని పేర్కొన్నారు.

ఓయూకు మ‌ళ్లీ వ‌స్తా.. ఆర్ట్స్ కాలేజీ వ‌ద్ద స‌భ పెడ‌తా

త‌న‌కు అన్నిటికీ స‌మాధానం చెప్పే చిత్త‌శుద్ధి ఉంద‌ని, మ‌ళ్లీ ఓయూకు వ‌స్తాన‌ని, ప్ర‌ఖ్యాత ఆర్ట్స్ కాలేజీ వ‌ద్ద స‌భ నిర్వ‌హిస్తాన‌ని సీఎం రేవంత్ తెలిపారు. పోలీసులు ఎవ‌రూ రావొద్ద‌ని, విద్యార్థులు నిర‌స‌న‌కు దిగినా ఏమీ అనొద్ద‌ని అన్నారు. ఈ స‌భ‌లోనే ఓయూకు సంబంధించిన జీవోలు విడుద‌ల చేస్తాన‌ని హామీ ఇచ్చారు.

ప్రొఫెస‌ర్ ఎమ్మెల్సీగా ఉంటే త‌ప్పేంటి?

ఇటీవ‌లి సుప్రీం కోర్టు తీర్పును ప‌రిశీల‌న‌కు తీసుకుంటూ.. తాము 15 రోజుల్లో ప్రొఫెస‌ర్ కోదండ‌రాంను మ‌ళ్లీ ఎమ్మెల్సీ చేస్తామ‌న్నారు. ఒక ప్రొఫెస‌ర్ ఎమ్మెల్సీగా ఉంటే త‌ప్పేంట‌ని ప్ర‌శ్నించారు. కోదండరాంకు వ్య‌తిరేకంగా కొంద‌రు కోర్టుకు వెళ్లార‌ని త‌ప్పుబ‌ట్టారు.