Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ ఒక స్పూర్తి- రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

బాబా సాహెబ్ అంబేద్కర్, శ్రీమతి ఇందిరా గాంధీ, ఎన్టీఆర్ ఈ ముగ్గురూ దేశానికి చిర స్మరణీయులు అని రేవంత్ రెడ్డి అన్నారు.

By:  Satya P   |   29 May 2026 1:50 AM IST
ఎన్టీఆర్ ఒక స్పూర్తి- రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

స్వర్గీయ నందమూరి తారక రామారావు ఒక స్పూర్తి అని తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. భాష, ప్రాంతం, రాజకీయాలకు అతీతమైన మహోన్నతమైన నాయకుడు ఎన్టీఆర్ అని రేవంత్ రెడ్డి కొనియాడారు. ఆయన చలవతో ఎంత మంది నాయకులు రాజకీయాల్లోకి వచ్చారు అని చెప్పారు. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడం తనకు ఒక మధుర జ్ఞాపకం గా ఉంటుందని రేవంత్ రెడ్డి చెప్పారు.

ఆ ముగ్గురూ చిరస్మరణీయులు :

బాబా సాహెబ్ అంబేద్కర్, శ్రీమతి ఇందిరా గాంధీ, ఎన్టీఆర్ ఈ ముగ్గురూ దేశానికి చిర స్మరణీయులు అని రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్టీఆర్ స్పూర్తితోనే తెలంగాణాలో ఎన్నో పధకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోంది అని అన్నారు. ఆయన రెండు రూపాయలకు కిలో బియ్యం పధకం నుంచే ఉచిత బియ్యం పధకం అమలు చేస్తున్నామని జనతా వస్త్రాల నుంచే స్పూర్తిగా తీసుకుని పేదలకు చేనేత వస్త్రాలను అందిస్తున్నామని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

ఎవరికీ భయపడను :

తాను ఎవరికీ భయపడే రకాన్ని కాదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించడమేంటని అంటున్నారని అలాగే ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తి ఎన్టీఆర్ అని కూడా చెబుతున్నారని కానీ ఎన్టీఆర్ వీటికి అతీతమైన నాయకుడు అని రేవంత్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ కి ఎన్టీఆర్ రాజకీయ బిక్ష పెట్టారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఎన్టీఆర్ పేరు పెట్టుకుని కొంత మంది ఈ రోజు ఆయన విగ్రహం ఎందుకు అని అంటున్నారు అని కేటీఆర్ ని ఉద్దేశించి రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఎన్టీఆర్ అంటే అదే అర్థం :

ఎన్టీఆర్ అన్న మూడు అక్షరాలకు అర్ధం చెప్పారు రేవంత్ రెడ్డి, నీతి నిజాయితీ నిబద్ధత పట్టుదలకు ప్రతిరూపం ఎన్టీఆర్ అని కొనియాడారు. ఎన్ టీఆర్ వంటి నేతలు మానవ మనుగడ ఉన్నంత కాలం ఉంటుందని చెప్పారు. ఎన్టీఆర్ ని స్మరించుకోవోవాల్సిన అవసరం ఉంది. ఎన్ టీఆర్ వంటి నాయకుడు దేశం గర్వించతగిన నాయకుడు అని కొనియాడారు. ఎన్టీఆర్ విగ్రహం అన్నది గొప్ప అనుభూతి అని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. ఎన్టీఆర్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన నాయకులు ఎంతో మంది ఉన్నారని అన్నారు. తుమ్మల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు, మాధవరెడ్డి, జానారెడ్డి, దేవేందర్ గౌడ్, కడియం శ్రీహరి, మోత్కుపల్లి నర్సింహులుతో వంటి వారికి రాజకీయ అవకాశాలు ఇచ్చారని గుర్తు చేశారు. అలాంటి ఎన్టీఆర్ ని చరిత్రను ఎవరూ మరువరాదని రేవంత్ రెడ్డి అన్నారు

ఘనంగా సాగింది :

ఇదిలా ఉండగా అమీర్ పేట వద్ద ఉన్న మైత్రీ వనంలో 23 అడుగుల నిలువెత్తు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సాగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, నందమూరి కుటుంబ సభ్యులు, నటుడు మంచు మనోజ్, దర్శకుడు బోయపాటి శ్రీను తదితరులు హాజరయ్యారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమం తలపెట్టారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించామని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చెప్పారు.