ఎన్టీఆర్ పేరుతో రేవంత్ బిగ్ గేమ్.. మైండ్ బ్లోయింగ్
అందుకే అంటారు.. అందరు నడిచిన దారిలో నడిచే కన్నా.. రోటీన్ కు భిన్నమైన ఎత్తులతో ఆడే ఆటతో కలిగే ప్రయోజనాలు వేరే లెవల్ లో ఉంటాయి.
By: Garuda Media | 29 May 2026 10:21 AM ISTఅందుకే అంటారు.. అందరు నడిచిన దారిలో నడిచే కన్నా.. రోటీన్ కు భిన్నమైన ఎత్తులతో ఆడే ఆటతో కలిగే ప్రయోజనాలు వేరే లెవల్ లో ఉంటాయి. అయితే.. అందులో రిస్క్ చాలా ఎక్కువ. బాగా జరిగిపోతున్ననప్పుడు రిస్కు తీసుకోవటానికి చాలామంది ఇష్టపడరు. మనకెందుకు లేనిపోని పంచాయితీలు. నడిచిపోతున్న దానిని నడిచిపోతే పోయే దానికి కెలుక్కోవటం అవసరమా? అన్నట్లుగా అత్యున్నత స్థానాల్లో ఉన్న వారి మైండ్ సెట్ ఉంటుంది. దీనికి తోడు.. వారి తోడు ఉండే థింక్ ట్యాంకర్లు కూడా సేఫ్ గేమ్ ప్లాన్ కు ప్రాధాన్యత ఇస్తుంటారు. అలాంటి తీరుకు తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ భిన్నం. ఆయన ఎప్పుడు తన ఆటను వెంట్రుకతో కొండను లాగే ప్రయత్నాలే చేస్తారు. అదే సమయంలో తన చేతిలో ఉన్నది వెంట్రుక మాత్రమే అన్న విషయం ఆయనకు తెలుసు. కానీ.. ఆ విషయాన్ని తన తోటి వారికి అర్థం కాకుండా చేసే చతురత ఆయన సొంతం.
అంతేనా.. ఎంతటి తేలికైన వస్తువు అయినా.. దాన్ని వాడే వాడికి అనుగుణంగా అది పని చేస్తుందన్నది తెలిసిందే. అందరికి ఉన్నట్లే బ్రూస్ లీకి శరీర అవయువాలు ఉన్నాయి. కానీ.. వాటితో.. చాలామందికి పట్టని వస్తువుల సాయంతో ఆయన చేసే మేజిక్ ప్రపంచం ఎప్పుడో చూసింది. ఆయన చేతిలో ఉండే కాగితం ముక్కు సైతం చాకు కంటే పదునుగా పని చేస్తుంది. సీఎం రేవంత్ తీరు కూడా అలానే ఉంటుంది. తన వద్ద ఉండే పరిమిత వనరులతో ఆయన భారీ లక్ష్యాల్ని నిర్దేశించుకుంటారు.
ఎన్టీఆర్ అన్న పేరును వాడుకోవటం అంత తేలికైన విషయం కాదు. అది కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి. నిజానికి సీనియర్ ఎన్టీఆర్ తో కలిసి పని చేసి.. ఆయనకు సన్నిహితంగా మెలిగిన వారు.. ఆయన కారణంగా రాజకీయంగా ఎంతో ప్రయోజనం పొందిన వారు సైతం చేయని పనిని సీఎం రేవంత్ చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో అందునా.. హైదరాబాద్ మహానగర నడిబొడ్డున ఉండే అమీర్ పేట చౌరస్తాలో ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయటం ఒక ఎత్తు అయితే.. ఆ ఏర్పాటుకు ఆయన ఇచ్చిన జస్టిఫికేషన్ పలువురిని ఆకట్టుకునేలా ఉందని చెప్పాలి.
మరో ఆసక్తికర అంశం ఏమంటే.. ఆయన ఉన్నది కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా. ఈ రోజుకు కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా ప్రస్తావించేది ఇందిరాగాంధీని. ఆ తర్వాతే రాజీవ్ ను. అలాంటి ఇందిరా గాంధీకి.. ఎన్టీఆర్ కు మధ్య నడిచిన ప్రత్యక్ష.. పరోక్ష యుద్ధం తెలిసిందే. అలాంటి రెండు భిన్న ధ్రువాలను కలిపి.. వారిద్దరిని ఒకే వేదిక మీద పొగడటం అంత తేలికైన విషయం కాదు. ఆ పనిని చాలా సులువుగా చేసేశారు. అంతేనా.. ఎన్టీఆర్ ను కులాలకు.. మతాలకు.. ప్రాంతాలకు అతీతమైన వ్యక్తి అని.. ఆయనో నిలువెత్తు స్ఫూర్తి అని చెప్పటం ద్వారా కొత్త రాజకీయ సమీకరణాలకు తెర తీశారని చెప్పాలి.
ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయటం ద్వారా సీఎం రేవంత్ కు నెగిటివ్ తప్పించి.. పాజిటివ్ ఏ మాత్రం కాదన్న వాదన కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని తన ప్రసంగంలో సీఎం రేవంత్ ప్రస్తావించటమే కాదు.. ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు నెగిటివ్ ఏ మాత్రం కాదన్న విషయాన్ని బహిరంగంగా స్పష్టం చేయటం ద్వారా.. తాను చేసే పని తప్పు ఏ మాత్రం కాదన్నది తేల్చి చెప్పినట్లైంది. ఇంతకూ ఎన్టీఆర్ విగ్రహం ద్వారా రేవంత్ కు కలిగే రాజకీయ ప్రయోజనం ఏమిటి? అన్నది చూస్తే.. పరిమితమేనని చెప్పాలి. నిజానికి ఆయనకు కలిగే ప్రయోజనం కంటే కూడా.. ఆయన రాజకీయ ప్రత్యర్థి కేసీఆర్ అండ్ కోకు జరిగే నష్టమే ఎక్కువ కావటం ఆసక్తికరం.
సీనియర్ ఎన్టీఆర్ తో సన్నిహితంగా ఉండటమే కాదు.. ఆయన ద్వారా రాజకీయ భిక్ష పొందిన కేసీఆర్.. చివరకు ఆయన పేరును తన కొడుక్కి పెట్టుకున్నప్పటికి.. చివరకు ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసే విషయంలో ప్రదర్శించిన తీరును ప్రస్తావించటం ద్వారా.. కేసీఆర్ ఇమేజ్ ను భారీగా దెబ్బ తీశారని చెప్పాలి. అంతేకాదు.. ఎన్టీఆర్ పేరును తన పేరుగా పెట్టినప్పటికీ.. ఆ విషయాన్ని.. దాని ప్రాధాన్యతను కేటీఆర్ లాంటోళ్లు గుర్తింటం లేదు సరికదా.. సీనియర్ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసే విషయంలో వ్యతిరేకిస్తున్న తీరును బాహాటంగా ప్రస్తావించటం ద్వారా.. రాజకీయంగా కేసీఆర్.. కేటీఆర్ ను దెబ్బ తీశారని చెప్పాలి.
అదే సమయంలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేర్చానే తప్పించి.. తనకు తానుగా సొంతంగా ఏమీ చేయలేదన్న విషయాన్ని స్పష్టం చేయటం ద్వారా.. తాను మాట ఇస్తే .. అదెంత కష్టమైనదైనా సరే పూర్తి చేస్తానన్న సంకేతాన్ని ఇచ్చినట్లైంది. అందరి అంచనాలకు భిన్నంగా వ్యవహరించే సీఎం రేవంత్ వైఖరే ఆయనకు శ్రీరామరక్షగా చెప్పక తప్పదు. తాజా ఉదంతం ఆ విషయాన్ని మరోసారి నిరూపించినట్లైంది.
