Begin typing your search above and press return to search.

తెలంగాణ రాజకీయాల్లో అరుదైన ఘటన.. ఒకే వేదికను పంచుకోనున్న రేవంత్, కేటీఆర్!

రాజకీయాల్లో ఒక్కోసారి వింత సంఘటనలు చోటుచేసుకుంటుంటాయి. ఎవరెవరు ఎప్పుడు ఏ వేదికను పంచుకోవాల్సి వస్తుందో కూడా ఊహించలేం

By:  Tupaki Desk   |   17 Sept 2024 12:25 PM IST
తెలంగాణ రాజకీయాల్లో అరుదైన ఘటన.. ఒకే వేదికను పంచుకోనున్న రేవంత్, కేటీఆర్!
X

రాజకీయాల్లో ఒక్కోసారి వింత సంఘటనలు చోటుచేసుకుంటుంటాయి. ఎవరెవరు ఎప్పుడు ఏ వేదికను పంచుకోవాల్సి వస్తుందో కూడా ఊహించలేం. అలాంటి అరుదైన సంఘటనను ఈ నెల 21న హైదరాబాద్‌లో చూడబోతున్నాం.

రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ రాజకీయాలు నడుస్తున్నాయి. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. దాంతో ప్రతీ విషయంలోనూ స్పందిస్తోంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, ప్రజా సమస్యలపై నిత్యం రేవంత్‌ను, ప్రభుత్వాన్ని నిలదీస్తూ వస్తున్నారు.

ముఖ్యంగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వీరిద్దరూ సమయం దొరికిందంటే చాలు ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు చేసుకుంటూనే ఉంటారు. నిత్యం ఒకరిమీద మరొకరు ఫైర్ అయ్యే.. ఈ ఇద్దరు ఈ నెల 21న ఒకే వేదికను పంచుకోబోతున్నట్లు తెలుస్తోంది.

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఇటీవల అనారోగ్యంతో చనిపోయారు. దీంతో ఆయన సంస్మరణ సభను ఈ నెల 21న హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు కేటీఆర్‌కూ ఆహ్వానం పంపించారు. వారు ఈ కార్యక్రమానికి హాజరు అవుతారని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు.