‘విద్యుత్ మీటర్లు పెడితే ఎన్నికల్లో పోటీ చేయం’ ఒక్క మాటలో తేల్చేసిన సీఎం రేవంత్
తాము వ్యవసాయ రంగానికి విద్యుత్ బోర్డు పెట్టే ఉద్దేశాన్ని వివరంగా చెప్పిన ఆయన.. చివర్లో తమ రాజకీయ ప్రత్యర్థులు ఆరోపిస్తున్న ఆరోపణలకు సింగిల్ లైన్ సవాల్ తో నాకౌట్ పంచ్ తరహాలో విసిరిన ఆయన మాటలు ఇప్పుడు విపక్ష బీఆర్ఎస్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పరిస్థితి.
By: Garuda Media | 31 May 2026 11:56 AM ISTనాకౌట్ పంచ్ అంటే తెలుసా? బాక్సింగ్ క్రీడలో ప్రత్యర్థిని స్పృహ తప్పేలా విసిరే శక్తివంతమైన పంచ్. దీని దెబ్బకు ప్రత్యర్థికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా చేయటమే కాదు.. ఈ తరహా పంచ్ పడిన తర్వాత చాలామంది కోలుకొని గేమ్ ను కొనసాగించటం కష్టంగా ఉంటుంది. అలాంటి శక్తివంతమైన పంచ్ ను రాజకీయాల్లో విసిరారు సీఎం రేవంత్. గడిచిన కొద్దిరోజులుగా వ్యవసాయ మోటార్లకు మీటర్లు అంటూ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ రచ్చ తెలిసిందే. దీనికి విరుగుడుగా సీఎం రేవంత్ తన సుదీర్ఘ వివరణతో పాటు.. తమ ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక చర్యను సమర్థించుకున్నారు. తాము వ్యవసాయ రంగానికి విద్యుత్ బోర్డు పెట్టే ఉద్దేశాన్ని వివరంగా చెప్పిన ఆయన.. చివర్లో తమ రాజకీయ ప్రత్యర్థులు ఆరోపిస్తున్న ఆరోపణలకు సింగిల్ లైన్ సవాల్ తో నాకౌట్ పంచ్ తరహాలో విసిరిన ఆయన మాటలు ఇప్పుడు విపక్ష బీఆర్ఎస్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పరిస్థితి.
ఇలాంటి వేళ ఏర్పాటు చేసిన మీడియా ఇష్టాగోష్టిలో ఆయన తమ ప్రభుత్వ విధానాల్ని వివరంగా వెల్లడించటమే కాదు.. వ్యవసాయ రంగానికి ఏర్పాటు చేస్తున్న విద్యుత్ డిస్కమ్ ఉద్దేశాన్ని చెప్పుకొచ్చారు. ఉచిత విద్యుత్ వల్ల విద్యుత్ సంస్థలు నష్టాల బారిన పడుతున్నయన్న మాటతో అధికారులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని.. విద్యుత్ పంపిణీ నష్టాలకు చెక్ చెప్పకుండా.. దాన్ని రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ కోటాలో వేస్తున్న వైనాన్ని ప్రస్తావించారు. నిజానికి సీఎం రేవంత్ చెప్పిన ఈ మాట అక్షర సత్యం.
విద్యుత్ రంగం మీద కించిత్ అవగాహన ఉన్న వారంతా ఈ వాదనలో నిజాన్ని గుర్తిస్తారు. ఈ నేపథ్యంలో అసలు రైతులకు సరఫరా చేస్తున్న విద్యుత్ ఎంత? అన్నది తేలితే.. పంపిణీ నష్టం లెక్క నీళ్లకు నీళ్లు.. పాలకు పాల మాదిరి లెక్క తేలిపోయే పరిస్థితి. ఇదంతా చేయాలంటే వ్యవసాయ రంగానికి పంపిణీ చేసే విద్యుత్ లెక్క తేల్చేందుకు బోర్డు అవసరం. అందుకే విద్యుత్ బోర్డు ఏర్పాటు చేసే ఆలోచనలో రేవంత్ సర్కారు ఉంది.అయితే..దీనికి విపక్ష బీఆర్ఎస్ చెబుతున్న భాష్యం ఏమంటే.. విద్యుత్ డిస్కమ్ ఏర్పాటు చేసిన తర్వాత వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెడతారని.. ఆ తర్వాత బిల్లులు వేస్తారన్న వాదనకు తెర తీసింది.
వ్యవసాయానికి అందించే విద్యుత్ లెక్కను పారదర్శకంగా ఉండేలా చేయటం కోసం రైతు డిస్కమ్ లను ఏర్పాటు చేయనున్నట్లుగా సీఎం వెల్లడించారు. రైతు డిస్కంలో ఎత్తిపోతల పథకాలు.. పంపుసెట్లు.. మెట్రో వాటర్ వర్క్స్.. మిషన్ భగీరథ నీటి సరఫరాను కూడా చేర్చామన్న ముఖ్యమంత్రి..కీలక విషయాన్ని వెల్లడించారు. పీక్స్ అవర్స్ లో విద్యుత్ కొనుగోలు చేస్తున్న డిస్కమ్ లు.. ఆ ఖర్చును రైతులకు అందిస్తున్న ఉచిత విద్యుత్ లెక్కలో వేస్తున్న తీరును ప్రస్తావించారు. తమ ప్రభుత్వం చెబుతున్నట్లుగా.. రైతు డిస్కమ్ ఏర్పాటు చేసిన తర్వాత ఇలాంటి పని చేయటానికి అవకాశం ఉండదన్నారు.
రైతులు పగటిపూట 90 శాతం విద్యుత్ వాడితే.. రాత్రివేళలో కేవలం 10 శాతం విద్యుత్ వాడతారని.. కానీ ఇప్పుడు లెక్కలు అందుకు భిన్నంగా అధికారులు చూపిస్తున్నట్లు చెప్పారు. విపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా రైతు డిస్కమ్ ఏర్పాటుతో 24 గంటలూ రైతుకు కరెంటు సరఫరా ఉండదన్న వాదనలో నిజం లేదన్న ఆయన.. ఎప్పటిలానే 24 గంటలూ విద్యుత్ సరఫరా ఉంటుందని స్పష్టం చేశారు.
విద్యుత్ సంస్థల్లో బాధ్యత.. నాణ్యత.. పారదర్శకత పెంచేందుకే రైతు డిస్కం ఏర్పాటు చేస్తున్నట్లుగా స్పష్టం చేసిన సీఎం రేవంత్.. బీఆర్ఎస్ చెబుతున్నట్లుగా రైతు డిస్కంను ప్రైవేటీకరిస్తామన్న మాటలో నిజం లేదన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ హామీని 1999 ఎన్నికల్లో ఇచ్చామని.. గడిచిన ఇరవై ఏళ్లలో ఏడు గంటల నుంచి 24 గంటల వరకు తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అందుకే.. రైతు డిస్కం విషయంలో తన కమిట్ మెంట్ ను స్పష్టం చేసేందుకు సీఎం రేవంత్ చేసిన సవాలు ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారింది. రైతు డిస్కం మీద రచ్చకు ఆయన ఫుల్ స్టాప్ పెట్టేలా వ్యాఖ్యలు చేశారు. తాము కానీ వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెడితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయమని.. ఒకవేళ తాము విద్యుత్ మీటర్లు పెట్టకుంటే బీఆర్ఎస్ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉంటుందా? అంటూ సూటి సవాలు విసిరారు. ఈ ఒక్క మాటతో వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్ మీటర్ల పెట్టే ఉద్దేశమే తనకు లేదన్న విషయాన్ని కేటీఆర్ తేల్చేశారని చెప్పాలి. మీటర్ల పేరుతో రైతులను గందరగోళానికి గురి చేసేలా వ్యవహరిస్తున్న బీఆర్ఎస్ కు నోట మాట రాకుండా నాకౌట్ పంచ్ తరహాలో విసిరిన రేవంత్ సవాలు ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పక తప్పదు.
