Begin typing your search above and press return to search.

సీఎం రేవంత్ సంచలనం.. నేనే రాజు.. నేనే మంత్రి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటి నుంచి ఆసక్తికర వ్యాఖ్య ఒకటి వచ్చింది.

By:  Garuda Media   |   13 Feb 2026 11:36 AM IST
సీఎం రేవంత్ సంచలనం.. నేనే రాజు.. నేనే మంత్రి
X

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటి నుంచి ఆసక్తికర వ్యాఖ్య ఒకటి వచ్చింది. సాధారణంగా మరే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి సైతం ఈ తరహా ధీమాను ప్రదర్శించిన దాఖలాలు గతంలో లేవు. అందుకు భిన్నంగా ఆయన తన గురించి తాను చెప్పిన వైనం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెర తీసేలా మారింది. అన్నింటికి మించి కాంగ్రెస్ పార్టీలో అయితే.. ఆయన మాటలు పెను సంచనలంగా మారాయి. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తన గురించి తాను చెప్పుకుంటూ.. తాను ఎవరితోనూ పోల్చుకోనని.. తనకు ఎవరూ పోటీ కారన్న ఆయన.. ‘తెలంగాణలో నేనే రాజు.. నేనే మంత్రి’ అని వ్యాఖ్యానించారు.

2029లో జమిలి ఎన్నికలు రానున్నాయని.. దీంతో పదిన్నరేళ్లు ముఖ్యమంత్రిగా తానే ఉంటానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జమిలి ఎన్నికలు.. ఆ ఎన్నికల్లో తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. 2029లో జమిలి ఎన్నికలు జరగటం ఖాయమన్న రేవంత్.. ‘‘తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సైతం అప్పుడే ఉంటాయి. దీంతో నేను ఐదున్నరేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతా. నాకు ఆర్నెల్లు సీఎం పదవి బోనస్. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ కచ్ఛితంగా జరుగుతుంది. 2029లోనూ నేనే ముఖ్యమంత్రిని అవుతా. రాష్ట్రంలో పదిన్నరేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి రికార్డును సృష్టించబోతున్నా. 2027 వరకు జిల్లాల పెంపు ఉండదు’’ అని స్పష్టం చేశారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ తో పాటు.. ఎన్టీఆర్ విగ్రహాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేసే అంశంపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ కు భారతరత్న అవార్డు ఇవ్వటంపై తన మద్దతు ఉంటుందంటూ.. ‘‘త్వరలో హైదరాబాద్ లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తాం. ఎన్టీఆర్ జాతీయ నాయకుడు. ఆయన ఏ ఒక్కరి సొత్తు కాదు. జాతీయ సొత్తు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని నేను వ్యక్తిగతంగా డిమాండ్ చేస్తున్నా. ఎన్టీఆర్ గురించి ఎవరైనా తక్కువగా మాట్లాడితే వారంత మూర్ఖులు ఎవరూ ఉండరు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. పార్లమెంట్ లో ఎన్టీఆర్ విగ్రహాం పెట్టిందే కాంగ్రెస్ పార్టీ’’ అంటూ తాను చేస్తున్నపని పార్టీ వ్యతిరేక వైఖరి ఎంత మాత్రం కాదన్న విషయాన్ని ఉదాహరణతో చెప్పటం గమనార్హం.

కవిత కొత్త పార్టీ గురించి చెప్పేదేమీ లేదన్న సీఎం రేవంత్.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్, కవిత ఒక్కటేనని.. వాళ్లు ఆడేవన్నీ డ్రామాలేనని ఆరోపించారు. మూసీ ప్రక్షాళన, మెట్రో ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వటం లేదన్న రేవంత.. ‘దేశంలో ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్ముకోవటమే చూశాం. కానీ మేం మెట్రో ప్రాజెక్టును ఎల్ అండ్ టీ నుంచి కొనుగోలు చేశాం’’ అని వ్యాఖ్యానించారు. వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయానికి తెలంగాణ అవిర్భావ దినోత్సవమైన జూన్ 2న శంకుస్థాపన చేస్తామని.. రెండేళ్లలో పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొస్తామన్న రేవంత్.. రెండోదశలో కొత్తగూడెం, రామగుండం విమానాశ్రయాల్ని నిర్మిస్తామని పేర్కొన్నారు.

కాళేశ్వరంపై విచారణ ఎంతవరకు వచ్చిందన్నది కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. బండి సంజయ్ లు చెప్పాలన్న సీఎం రేవంత్.. ‘‘కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తే 48 గంటల్లో కేసీఆర్ ను అరెస్టు చేస్తామని కిషన్ రెడ్డి చెప్పారు. కాళేశ్వరంపై విచారణ చేపట్టాలని సీబీఐ డైరెక్టర్కు లేఖ రాశాం. అదే కాపీని హోం సెక్రటరీకి జత చేశాం. ఆర్నెల్లు గుడుస్తున్నా కేసీఆర్ ను ఎందుకు అరెస్టు చేయలేదో కిషన్ రెడ్డి చెప్పాలి. తెలంగాణ రాసిన లేఖను సీబీఐ డీవోపీటికి రిఫర్ చేస్తుంది. డీవోపీటీ ప్రధానికి పంపుతుంది. మరి.. పీఎంవోలో ఎక్కడ ఆగిందో? ఎందుకు ఆగిందో? కిషనర్ రెడ్డి లేదంటే బండి సంజయ్ అయినా సమాధానం చెప్పాలి’’ అంటూ తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీనేతలను ప్రశ్నించారు.