కేసీఆర్‌ను 'రావణుడి'తో పోల్చిన రేవంత్!!
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌పై ఇటీవల కాలంలో తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి తాజాగా మరింతగా రెచ్చిపోయారు.
By: Garuda Media | 31 March 2026 12:21 PM ISTతెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌పై ఇటీవల కాలంలో తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి తాజాగా మరింతగా రెచ్చిపోయారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌ను రావణుడితో పోల్చడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ''కేసీఆర్ వల్లే నాకు గుర్తింపు వచ్చింది.'' అని వ్యాఖ్యానిస్తూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మంచి పనులు చేయలేదని.. ప్రజలను పీడించారని.. అందుకే.. ఇప్పుడు తాను చేస్తున్న మంచి పనులకు ప్రజల్లో గుర్తింపు లభిస్తోందని వ్యాఖ్యానించారు.
''రాముడికి గుర్తింపు మామూలుగా వచ్చిందా? రావణాసురిడి వల్లే కదా?. రావణాసురుడు అలా చేయకపోతే.. రాముడి గొప్పతనం.. ప్రజలకు తెలిసి ఉండేదా? మనం ఆయనకు గుడులు కట్టుకునేవారమా?. కేసీఆర్ కూడా అంతే. ఆయన మంచి చేయలేదు కాబట్టి.. మేం మంచి పనులు చేస్తున్నాం.. కాబట్టి.. ప్రజలు మమ్మల్ని గుర్తు పెట్టుకుంటున్నారు. ఈ అవకాశం ఇచ్చింది.. నాకు గుర్తింపు ఇచ్చింది కూడా కేసీఆరే. కేసీఆర్ కనుక లేకపోతే.. అలా నిరంకుశంగా వ్యవహరించి ఉండకపోతే.. మా పనులు ప్రజలకు తెలుస్తాయా?'' అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
`విశ్రాంతి`పై అనుమానం!
కేసీఆర్ `విశ్రాంతి`పై అనుమానాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రస్తుతం విశ్రాంతి తీసుకుం టున్నారని.. ఫామ్ హౌస్‌లో పడుకుంటున్నారని ప్రచారం చేస్తున్నారని చెప్పారు. కానీ.. అది నిజం కాదని తాను అనుకుంటు న్నట్టు చెప్పారు. ఆయనను ఉద్దేశ పూర్వకంగానే కొందరు `గృహ నిర్బంధం` చేసి ఉంటారని తనకు అనుమానంగా ఉందన్నా రు. లేకపోతే.. ఇన్ని రోజులు ఆయన ఫామ్ హౌస్‌కే ఎందుకు పరిమితం అవుతారని ప్రశ్నించారు. అయితే.. ఈ విషయం వారికి వ్యక్తిగతమే అయినా.. మాజీ ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేగా ఆయనకు బాధ్యతలు ఉన్నందున ప్రశ్నించక తప్పదన్నారు.
మీడియా బాధ్యత తీసుకోవాలి!
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిమీడియాకు కూడా కొన్ని బాధ్యతలు చెప్పారు. తాము అందిస్తున్న ప్రజాపాలన.. రైతు సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మీడియా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మీడియా సామాజిక బాధ్యత(సోషల్ రెస్పాన్స్) తీసుకోవాలన్నారు. ``ప్రభుత్వంపై రాళ్లేయడమే కాదు.. ప్రభుత్వం చేస్తున్న మంచిని కూడా ప్రజలకు వివరించాలి.. అదే నిజమైన జర్నలిజం`` అని పరోక్షంగా కేసీఆర్ మీడియాను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు.
