కొత్త మంత్రులకు శాఖలు కేటాయించిన సీఎం రేవంత్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన సందర్భంగా కీలక ప్రకటనలు చేశారు.
By: Tupaki Desk | 11 Jun 2025 11:10 AMతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన సందర్భంగా కీలక ప్రకటనలు చేశారు. మంత్రివర్గ విస్తరణ అనంతరం కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు మంత్రులకు శాఖల కేటాయింపుపై స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం తన వద్ద ఉన్న 11 శాఖల నుంచి కొన్ని శాఖలను వారికి కేటాయించనున్నట్టు తెలిపారు. అయితే సీనియర్ మంత్రుల శాఖల్లో మాత్రం ఎటువంటి మార్పులు ఉండవని ప్రకటించారు.
-తాజా మంత్రులకు కేటాయించనున్న శాఖలు ఇవే:
ముఖ్యమంత్రి వద్ద ఉన్న హోం, మున్సిపల్, క్రీడలు, విద్య తదితర కీలక శాఖలలో కొన్నింటిని కొత్త మంత్రులకు అప్పగించనున్నట్లు చెప్పారు. ఈ మేరకు రాత్రి లేదా రేపు ఉదయం అధికారికంగా శాఖల కేటాయింపుపై ఉత్తర్వులు విడుదలయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
-కేసీఆర్ కుటుంబానికి కాంగ్రెస్‌లో ప్రవేశం లేదు:
ఈ సందర్బంగా సీఎం రేవంత్ కేసీఆర్ కుటుంబంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘నా అధికార కాలంలో కేసీఆర్ కుటుంబానికి కాంగ్రెస్‌లో ఎంట్రీ లేదు’’ అంటూ తేల్చిచెప్పారు. కేసీఆర్ కుటుంబ సభ్యులే తెలంగాణకు అసలైన శత్రువులని విమర్శించారు. కులగణన కార్యక్రమంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కిషన్ రెడ్డి వంటి నేతలు వివరాలు ఇవ్వలేదని ఆరోపించారు. వారి నివాసాలకు ప్రత్యేకంగా వెళ్లి వివరాలు సేకరించాలంటూ హైదరాబాద్ కలెక్టర్‌కు ఆదేశాలు కూడా ఇచ్చినట్టు వెల్లడించారు.
- కాళేశ్వరం పై నివేదిక త్వరలో:
కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై తన అభిప్రాయాలను రెండు మూడు రోజుల్లో పూర్తిగా వెల్లడిస్తానని రేవంత్ తెలిపారు. ‘‘కాళేశ్వరం విషయంలో అసలు ఏం జరిగింది? ఎవరి బాధ్యత ఎంత? అన్న విషయాలపై పూర్తి స్పష్టత ఇస్తాను’’ అని పేర్కొన్నారు.
-కిషన్ రెడ్డిపై విమర్శలు:
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పై రేవంత్ తీవ్ర విమర్శలు చేశారు. ‘‘తెలంగాణ నుంచి కేంద్ర మంత్రిగా ఉన్నా ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకురాలేదు. నిర్మలా సీతారామన్ చెన్నైకు మెట్రో రైలు, ప్రహ్లాద్ కర్ణాటకకు మెట్రో రైలు తెచ్చారు. కానీ కిషన్ రెడ్డి తెలంగాణకు ఏమీ చేయలేదు’’ అని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర సహకారం అవసరమని, అందుకోసమే కిషన్ రెడ్డితో కలిసి వెళ్లేందుకు కూడా తాను సిద్ధమని తెలిపారు. కానీ ఇప్పటి వరకు ఆయన నుంచి రాష్ట్రానికి ఉపయోగపడే ఏ ఒక్క అభివృద్ధి పథకమూ రాలేదని మండిపడ్డారు.ఈసారి మంత్రివర్గ విస్తరణలో సామాజిక న్యాయం పాటించామని, మొత్తం 55 శాతం పదవులు సామాజిక వెనుకబడిన వర్గాలకు కేటాయించామని స్పష్టం చేశారు. అలాగే నక్సలిజానికి అంతం కాదని, సామాజిక సమానతలు సాధించేవరకు నక్సలిజం కొనసాగుతుందన్న విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందని రేవంత్ వ్యాఖ్యానించారు.
తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగుతున్న ఊహాగానాలకు ముగింపు పలికేలా సీఎం రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. కేసీఆర్ కుటుంబంపై ఆయన చేసిన వ్యాఖ్యలు, కిషన్ రెడ్డిపై చేసిన విమర్శలు రాజకీయ వేడి పెంచేలా ఉన్నాయి.