Begin typing your search above and press return to search.

జీహెచ్ఎంసీ ఎన్నికలకు సై... జూబ్లీహిల్స్ ఊపులో రేవంత్ రెడ్డి

జూబ్లీహిల్స్ ఎన్నికల్లో విజయంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచి ఊపుమీద కనిపిస్తున్నారు.

By:  Tupaki Desk   |   16 Nov 2025 1:00 AM IST
జీహెచ్ఎంసీ ఎన్నికలకు సై... జూబ్లీహిల్స్ ఊపులో రేవంత్ రెడ్డి
X

జూబ్లీహిల్స్ ఎన్నికల్లో విజయంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచి ఊపుమీద కనిపిస్తున్నారు. రికార్డు విజయం ఇచ్చిన ఉత్సాహంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని సీఎం రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నట్లు చెబుతున్నారు. ఈ ఏడాది డిసెంబరుతో జీహెచ్ఎంసీ పాలకవర్గం ఐదేళ్ల పదవీకాలం ముగియనుంది. దీంతో ఈ ఎన్నికలు నిర్వహణకు సీఎం రేవంత్ సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. జూబ్లీహిల్స్ లో చావుదెబ్బ తిన్న ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ కోలుకునే లోగానే జీహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్లి మరో విజయం నమోదు చేయాలని రేవంత్ రెడ్డి ఉవ్విళ్లూరుతున్నారని అంటున్నారు.

తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి డిసెంబరు నాటికి రెండేళ్లు పూర్తవుతుంది. 2023 డిసెంబరు 7న ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సివున్నప్పటికీ.. కొన్ని కారణాలతో వాయిదా వేస్తూ వచ్చారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి ఎన్నికలకు వెళ్లాలని సీఎం భావించారు. ఈ ప్రక్రియను కొలిక్కి తెచ్చిన తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం ద్వారా నోటిఫికేషన్ ఇప్పించారు. అయితే కోర్టు జోక్యంతో ఈ ఎన్నికలు నిలిచిపోయాయి. రిజర్వేషన్లు 50 శాతం పరిమితికి మించకూడదన్న కోర్టు ఆదేశాల వల్ల ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో రాష్ట్రంలో ఇప్పట్లో స్థానిక ఎన్నికలు నిర్వహించే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు.

స్థానిక ఎన్నికలు జరిగితే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండేళ్ల పనితీరుపై ప్రజాతీర్పు ఇచ్చినట్లు అయ్యేది. అయితే ఆ ఎన్నికలు వాయిదా పడటంతో జూబ్లీహిల్స్ ఎన్నికనే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రెఫరెండంగా ప్రతిపక్షం బీఆర్ఎస్ ప్రకటించింది. ఈ ఎన్నికల్లో గెలిచి సీఎం తన సమర్థతను చాటుకోవాలని సవాల్ చేసింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా పనిచేసి ప్రతిపక్షాలను కోలుకోలేని దెబ్బతీశారు. అసలు అంచనాలు లేని జూబ్లీహిల్స్ స్థానంలో రికార్డు స్థాయి మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించారు. ఈ స్థానం నుంచి గతంలో రెండు సార్లు మరో పార్టీ తరఫున పోటీ చేసిన నవీన్ యాదవ్ ఓటమిని మూట గట్టుకున్నారు. కానీ, ఈసారి సీఎం రేవంత్ రెడ్డి మద్దతుతో నవీన్ యాదవ్ తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు.

ఇక నవీన్ యాదవ్ గెలుపు హైదరాబాద్ నగరంపై కాంగ్రెస్ లో కొత్త ఆశలు రేపింది. బీసీ వర్గానికి చెందిన నవీన్ యాదవ్ ను సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగానే జూబ్లీహిల్స్ లో పోటీకి పెట్టారు. తమ పార్టీ బీసీల పక్షపాతిగా చాటుకోవాలని చూశారు. ఇదే సమయంలో ప్రతిపక్షాలు అగ్రవర్ణాలకు సీట్లు ఇవ్వడంతో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం ఫలించిందని అంటున్నారు. అదేసమయంలో హైదరాబాద్ నగరంలో తమ పార్టీకి బలం లేదన్న ప్రచారాన్ని ఈ ఎన్నిక ద్వారా సీఎం పటాపంచలు చేశారు. జూబ్లీహిల్స్ ఫలితాలు వెలువడిన తర్వాత ఏ రకంగా చూసినా సీఎం రేవంత్ రెడ్డి వ్యూహానికి సానుకూల వాతావరణమే కనిపిస్తోందని చెబుతున్నారు. దీంతో జూబ్లీహిల్స్ ఊపుతో జీహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ నేతలకు సీఎం దిశానిర్దేశం చేస్తున్నారని అంటున్నారు.

హైదరాబాద్ నగరంపై పట్టుసాధిస్తే భవిష్యత్ లో మరోసారి ముఖ్యమంత్రి కావడంతోపాటు కాంగ్రెస్ పార్టీకి వరుస విజయం అందించిన నేతగా చిరస్థాయిగా పేరు తెచ్చుకోవాలనేది ముఖ్యమంత్రి కోరికగా చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలకు మరికొద్ది సమయం తీసుకుని ముందుగా జీహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్దామని ముఖ్యమంత్రి పార్టీ నేతలతో ప్రతిపాదిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇన్నాళ్లు పార్టీ, ప్రభుత్వంపై మీడియాలో జరిగిన ప్రచారంతో గందరగోళం ఎదుర్కొన్న కాంగ్రెస్ నేతలకు జూబ్లీహిల్స్ ఎన్నికతో క్లారిటీ వచ్చిందని అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంపై మరింత విశ్వాసం పెరిగిందన్న అంచనాలు వెలువడుతున్నాయి. దీంతో వచ్చే ఏడాది ఆరంభంలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు.