Begin typing your search above and press return to search.

కారు-కమలం దోస్తానా? రేవంత్ రెడ్డి వ్యూహం అదేనా!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వ్యూహానికి పదును పెట్టారు.

By:  Tupaki Desk   |   5 Nov 2025 6:25 PM IST
కారు-కమలం దోస్తానా? రేవంత్ రెడ్డి వ్యూహం అదేనా!
X

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వ్యూహానికి పదును పెట్టారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా విపక్ష పార్టీలు బీఆర్ఎస్, బీజేపీని ఒకేసారి ఇరుకన పెట్టే ఎత్తుగడ వేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని బోల్తా కొట్టించిన, పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ను దారుణంగా దెబ్బతీసిన వ్యూహాన్నే మళ్లీ అమలు చేస్తున్నారు రేవంతరెడ్డి. బీఆర్ఎస్-బీజేపీ ఒక్కటే అని చెప్పడంతోపాటు ప్రధాని మోదీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య స్నేహంపై తాజా విమర్శలతో మంటలు రేపారు. దీంతో ఆ రెండు పార్టీలు ఒకేసారి ఉలిక్కిపడ్డాయి. తమ మధ్య ఏ సంబంధం లేదని చెప్పుకోడానికి నానా హైరానా పడుతున్నాయి.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో క్రైస్తవ సంఘాల మద్దతు కోసం ఆయా సంఘాల నేతలతో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సీబీఐ విచారణ జరగకుండా బీజేపీనే అడ్డుకుంటోందని ఆరోపించారు. అంతేకాకుండా మాజీ మంత్రి కేటీఆర్ అవినీతిపై కేసు నమోదుకు గవర్నర్ అనుమతి ఇవ్వడం లేదని రేవంత్ రెడ్డి చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం వల్లే కేసీఆర్, కేటీఆర్ పై చర్యలు తీసుకోలేకపోతున్నామని వెల్లడించారు. అంతేకాకుండా బీజేపీలో బీఆర్ఎస్ విలీనమయ్యే పరిస్థితి ఉందని అగ్గి రాజేశారు.

క్రైస్తవ సంఘాల సమావేశంలో సీఎం చేసిన ఈ వ్యాఖ్యలు బీజేపీ, బీఆర్ఎస్ నేతలను ఒకేసారి షాక్ కు గురిచేసినట్లు చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి విమర్శలకు వెంటనే కౌంటర్ ఇచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. కాలేశ్వరం అవినీతిపై విచారణ చేపట్టమని చెప్పామే కానీ, కేసీఆర్ ను అరెస్టు చేస్తామని ఎప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశారు. దీంతో రేవంత్ రెడ్డి విమర్శల నుంచి బీజేపీ తప్పుకునే ప్రయత్నం చేస్తోందని అనుమానిస్తున్నారు. ఇక ఇదే సమయంలో బీఆర్ఎస్ ఎదురుదాడి ఎంచుకుంటోంది. బీజేపీతో తమకు దోస్తీలేదని చెప్పుకునేందుకు ఆ పార్టీ కేడర్ మొత్తం రంగంలోకి దిగింది.

అయితే, సీఎం వ్యూహాత్మకంగా ఎంచుకున్న ఈ ఎత్తుగడ ఒక్కసారిగా ఎన్నికల తంత్రాన్ని మార్చేసినట్లు కనిపిస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. బీజేపీని వ్యతిరేకించే మైనార్టీల ఓట్ల కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యూహాన్ని ఎంచుకున్నారని చెబుతున్నారు. జూబ్లీహిల్స్ లో మైనార్టీ ఓటర్లు ఎక్కువగా ఉండగా, గత రెండు ఎన్నికల్లో వారు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఓటు వేశారన్న అంచనాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మైనార్టీ ఓట్లను కాంగ్రెస్ వైపు మళ్లించే వ్యూహాంలో భాగంగా వారికి బీఆర్ఎస్ తో ఉన్న బంధాన్ని ముందు తెంచాలని సీఎం భావిస్తున్నట్లు చెబుతున్నారు. బీజేపీతో బీఆర్ఎస్ కలిసిపోతుందని, ఆ పార్టీలో విలీనం చేస్తారని చెప్పడం ద్వారా తమ ఓటు బీజేపీకి వేసనట్లేనని మైనార్టీలు అనుమానించేలా సీఎం ఎత్తుగడ వేశారని అంటున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికల్లో ఇదే ప్రచారం చేయడం ద్వారా సక్సెస్ అయిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే వ్యూహాన్ని ఎంచుకోవడం ఆసక్తి రేపుతోంది. మైనార్టీ ఓట్లు ఎక్కువగా ఉండటం వల్ల సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాన్ని పాత చింతకాయ పచ్చడిలా తీసిపారేసే పరిస్థితి లేకుండా పోయిందని అంటున్నారు. తమను గతంలో దెబ్బతీసిన ఈ ప్రచారాన్ని దీటుగా ఎదుర్కోడానికి ఇంతవరకు బీఆర్ఎస్ సరైన అస్త్రం రెడీ చేయలేకపోయిందని అంటున్నారు. దీంతో రేవంత్ రెడ్డి విమర్శలను తిప్పికొట్టడానికి ప్రధాని మోదీతో రేవంత్ రెడ్డి ప్రభుత్వమే సఖ్యంగా ఉంటుందని, రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ రహస్య స్నేహితుడిగా చెప్పే ప్రయత్నం చేస్తోందని అంటున్నారు. మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరైన టైంలో దీటైన వ్యూహంతో మొత్తం ఎన్నికల చిత్రాన్నే మార్చేశారని అంటున్నారు.