జపాన్ లో సీఎం రేవంత్ దూకుడు!
గడిచిన కొద్దిరోజులుగా జపాన్ లో పర్యటిస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీబిజీగా ఉంటున్నారు.
By: Tupaki Desk | 21 April 2025 10:08 AM ISTగడిచిన కొద్దిరోజులుగా జపాన్ లో పర్యటిస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీబిజీగా ఉంటున్నారు. వరుస పెట్టి దిగ్గజ కంపెనీలతో భేటీ కావటం.. ఒప్పందాలు చేసుకోవటం చేస్తున్నారు. ఒకటి తర్వాత ఒకటి చొప్పున ఆయన చేసుకుంటున్న ఒప్పందాలు అందరికి ఆకర్షించేలా ఉన్నాయి. గత ప్రభుత్వంలో రాష్ట్ర ఐటీ.. మున్సిపల్ శాఖా మంత్రిగా వ్యవహరించిన కేటీఆర్ తరచూ విదేశాలకు వెళ్లే వారు. అక్కడ బ్రాండ్ తెలంగాణను ప్రమోట్ చేసే పనిలో సక్సెస్ అయినట్లుగా ప్రచారం జరిగేది. అందుకు తగ్గట్లే వరుస ఒప్పందాలు చేసుకునేవారు.
ఒకదశలో.. ఇలాంటి పని తెలంగాణలో మరెవరైనా చేయగలరా? అన్న సందేహానికి గురయ్యేవారు. అయితే.. ఆ విషయంలో ఎలాంటి లోటు అక్కర్లేదన్న విషయాన్ని దావోస్ పర్యటన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన సంకేతాల్ని ఇవ్వటం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దావోస్ వెళ్లినప్పటికి తెలంగాణ సీఎం రేవంత్ ప్రదర్శించిన దూకుడు.. చేసుకున్న ఒప్పందాలు రేవంత్ ఇమేజ్ ను పెంచేలా చేశాయి.
తాజాగా ఆయన జపాన్ పర్యటనలో పలు సంస్థలతో ఇప్పటికే ఒప్పందాలు చేసుకోవటం తెలిసిందే. తాజాగా ఆయన పర్యావరణరహిత కిటాక్యయూషు నగరాన్ని సందర్శించారు. తన టీంతో కలిసి ఆ నగరాన్ని సందర్శించిన రేవంత్..అక్కడి ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుననారు.
పర్యావరణ పరిరక్షణ.. వ్యర్థాల నిర్వాహణ.. రీస్లైక్లింగ్ రంగాల్లో భాగస్వామ్యం పంచుకునేలా ఈ ఒప్పందాలు సాగాయి. పర్యావరణ అనుకూల సాంకేతికతలు.. పరిశుభ్రమైన నగర నమూనాలు.. నదుల పునర్జీవ విధానాలపై చర్చలు జరిపారు. అనంతరం హైదరాబాద్ లో ఎకో టౌన్ ఏర్పాటుకు సంబంధించి ఈఎక్స్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్.. పీ9 ఎల్ఎల్ సీ.. నిప్పాన్ స్టీల్ ఇంజినీరింగ్.. న్యూ కెమికల్ ట్రేడింగ్.. అమితా హోల్డింగ్స్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది.
ఒకప్పుడు అత్యంత కాలుష్య నగరాల్లో ఒకటిగా పేరున్న కిటాక్యూషు.. ఇప్పుడు అందుకు భిన్నంగా పరిశుభ్రమైన నదీ తీరంగా మారిన వైనాన్ని ప్రత్యక్షంగా పరిశీలించటమే కాదు.. హైదరాబాద్ మహానగరాన్ని కిటాక్యూషు మాదిరి శుభ్రమైన.. సుస్థిర నగరంగా తీర్చిదిద్దే దిశగా ఈ ఒప్పందాలు సాగాయి. ప్రపంచంలోని పరిశుభ్రమైన నగరాల్లో ఒకటిగా కిటాక్యూషు ఎలా మారిందన్న వివరాల్ని సీఎం రేవంత్ కు.. ఆ నగర మేయర్ టేకుచి వివరించారు. తన అనుభవాల పర్యావరణ పరిరక్షణకు చేపట్టిన ఆవిష్కరణలు.. టెక్నాలజీని తెలంగాణతో పంచుకోవటానికి ఆసక్తిని ప్రదర్శించారు. మొత్తంగా తన జపాన్ పర్యటన ద్వారా.. హైదరాబాద్ మహా నగర ఫేస్ ఇమేజ్ ను మార్చే అంశంపై సీఎం రేవంత్ ఎంతో ఆసక్తిని ప్రదర్శిస్తున్న వైనం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది.
