Begin typing your search above and press return to search.

పవన్ సభకు అనుమతి ఇవ్వకుండా రేవంత్ సర్కార్ తప్పు చేసిందా?

దీంతో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న తెలంగాణలో తమ పార్టీ కార్యకలాపాలకు సంబంధించి కీలకమవుతుందని భావించిన సభకు రేవంత్ సర్కార్ నో చెప్పిన వైనంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

By:  Garuda Media   |   3 Jun 2026 10:31 AM IST
పవన్ సభకు అనుమతి ఇవ్వకుండా రేవంత్ సర్కార్ తప్పు చేసిందా?
X

ఒక రాజకీయ పార్టీ.. అందునా ఒక రాష్ట్రంలో అధికారంలో ఉండి.. వేరే రాష్ట్రంలో సభను ఏర్పాటు చేయటం.. అందుకు శాంతిభద్రతల మాట చెప్పి నో చెప్పటమా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. గచ్చిబౌలి వేదికగా తాము సభ ఏర్పాటు చేసుకుంటున్నామని.. తమకు అనుమతి ఇవ్వాలని జనసేన పార్టీ పోలీసులను కోరటం.. అందుకు వారు నో చెప్పటం తెలిసిందే. ఇదే అంశం మీద హైకోర్టుకు వెళ్లినా.. ఎదురుదెబ్బ తగలటం విదితమే. దీంతో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న తెలంగాణలో తమ పార్టీ కార్యకలాపాలకు సంబంధించి కీలకమవుతుందని భావించిన సభకు రేవంత్ సర్కార్ నో చెప్పిన వైనంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే.. అత్యధికులు మాత్రం సభకు నో చెప్పటం ద్వారా రేవంత్ సర్కార్ తప్పు చేసిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక రాజకీయ పార్టీగా.. ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న అధినేత.. సభ పెట్టుకోవటానికి నో చెప్పటంలో అర్థం లేదంటున్నారు. శాంతిభద్రతల అంశాన్ని కారణంగా చూపించటం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పవన్ కల్యాణ్ సభ పెడితే.. ఏదో అయిపోతుందన్న వాదనలో అర్థం లేదంటున్నారు. నిజానికి జనసేనకు సభను నిర్వహించుకోవటానికి అనుమతిని ఇవ్వటం ద్వారా.. తెలంగాణ ప్రభుత్వం హుందాగా వ్యవహరించి ఉంటే బాగుండేదన్న మాట వినిపిస్తోంది.

సభకు అనుమతి ఇచ్చి ఉంటే.. సదరు సభలో పవన్ చేసిన వ్యాఖ్యలు ఏ మాత్రం ఆమోదయోగ్యంగా లేకున్నా.. ప్రజలను పక్కదారి పట్టించేలా.. తప్పుడు వాదనలు వినిపించి ఉంటే.. రాజకీయంగా స్పందించాలే తప్పించి.. ఇలా ఒక రాజకీయ పార్టీకి సభను నిర్వహించుకోవటానికి నో చెప్పటమేంటి? అన్న ప్రశ్న ఎదురవుతోంది. మరోవైపు.. రేవంత్ సర్కారును బలంగా సమర్థించేవారు మాత్రం.. జనసేన సభకు నో చెప్పటం తప్పేంటి? అన్న వాదనను వినిపిస్తున్నారు. తాము మాత్రమే కాదు.. సభను నిర్వహించుకోవటానికి తెలంగాణ హైకోర్టు కూడా అనుమతి ఇవ్వలేదు కదా? అని ప్రశ్నిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లు వేరే రాష్ట్రాలకు వెళ్లి ఎన్నికల ప్రచారం చేయలేదా? అని ప్రశ్నించిన ఆయన.. ప్రజాస్వామ్య పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ కు.. ముఖ్యమంత్రి రేవంత్ కు.. హైదరాబాద్ లో జనసేన సభ నిర్వహించుకుంటే వచ్చే ఇబ్బంది ఏంటి? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రమే కాదు. కాంగ్రెస్.. ఇతర పార్టీల నేతలు ఇతర రాష్ట్రాలకు వెళ్లి రాజకీయాలు చేసేటప్పుడు.. ఏపీ అధికారపక్షంలో భాగస్వామి అయిన జనసేనకు హైదరాబాద్ లో నిర్వహించాలని భావించిన సభకు నో చెప్పటంలో అర్థం లేదన్న మాట బలంగా వినిపిస్తోంది. అయితే.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేళ కాకుండా వేరే రోజున సభను నిర్వహించుకోవాలని చెప్పి ఉంటే కొంతమేర సబబుగా ఉండేదన్న వాదన వినిపిస్తోంది.

జనసేన నిర్వహించాలని భావించిన సభకు అనుమతి ఇవ్వకపోవటంపై జనసేన మాత్రమే కాదు తెలంగాణ బీజేపీ సైతం తప్పు పడుతోంది. మత విద్వేషాలు రెచ్చగొట్టే అసదుద్దీన్ ఓవైసీ.. అక్బరుద్దీన్ ఓవైసీ సభలకు.. అర్బన్ నక్సలైట్ల సభలకు మాత్రం రేవంత్ సర్కార్ అనుమతులు ఇస్తుందంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచంద్రరావు మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా సభలు పెట్టుకోవచ్చన్న ఆయన పవన్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేసిందన్నారు. ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించే కార్యక్రమాన్ని ప్రభుత్వం అడ్డుకోవటం? అని ప్రశ్నించారు.