టీడీపీ ఎమ్మెల్యేను వదలని రేవంత్ రెడ్డి.. కొండాపూర్ లో ఫాం హౌస్ కూల్చివేత
తాజాగా ఏపీ టీడీపీ ఎమ్మెల్యేకు చెందిన ఫాం హౌస్ ను కూల్చివేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించి భవనాలు నిర్మించడంతోనే కూల్చేసినట్లు స్పష్టం చేసింది.
By: Tupaki Desk | 19 April 2025 1:37 PMహైదరాబాదులో హైడ్రా దూకుడు చూపిస్తోంది. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, వాగులు, వంకలు ఆక్రమిస్తున్న వారు ఎంతటివారైనా కూల్చివేతలు ఆపడం లేదు. విమర్శలు వస్తున్నా, జలవనరులను కాపాడటమే ప్రధాన కర్తవ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు. గతంలో సొంత పార్టీ నేతలు, సినీ తారలు ఇలా ఎంతపెద్దవారి భవనాలైనా కూల్చివేతకు ఆదేశించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాజాగా ఏపీ టీడీపీ ఎమ్మెల్యేకు చెందిన ఫాం హౌస్ ను కూల్చివేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించి భవనాలు నిర్మించడంతోనే కూల్చేసినట్లు స్పష్టం చేసింది.
ఏపీలోని మైలవరం ఎమ్మెల్యే వసంత క్రిష్ణప్రసాద్ కు చెందిన ఫాం హౌస్ ను శనివారం హైడ్రా అధికారులు కూల్చివేశారు. కొండాపూర్ లోని సర్వే నెంబరు 79లో క్రిష్ణప్రసాద్ కు ఫాం హౌస్ ఉంది. ప్రభుత్వ స్థలం ఆక్రమించి ఆఫీసు, ఫాం హౌస్ నిర్మించారని ఎమ్మెల్యే క్రిష్ణప్రసాద్ పై ఆరోపణలు ఉన్నాయి. ఆక్రమణలపై సుప్రీంకోర్టులో ప్రభుత్వం కేసు వేసింది. అయినప్పటికీ ఎమ్మెల్యే ఆక్రమిత స్థలంలో భవనాలు నిర్మించారని హైడ్రా అధికారులు చెబుతున్నారు. ఆ భవనాల్లో నిర్మాణాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చినా పనులు చేపట్టారని అధికారులు తెలిపారు.
హైడ్రా నిబంధనల ప్రకారం సర్వే నంబరు 79లో 39 ఎకరాల్లో ఉన్న వాణిజ్య సముదాయాన్ని కూల్చివేయాలని నిర్ణయించారు. అయితే భవనాలు, షెడ్లను కూల్చివేయకుండా అడ్డుకునేందుకు క్రిష్ణప్రసాద్ కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. కానీ, పోలీసు బందోబస్తు మధ్య ఫామ్ హౌసును పోలీసులు పూర్తిగా తొలగించారు. సర్వే నెంబరు 79లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని బోర్డు ఏర్పాటు చేశారు.