కొత్త ఫార్ములా: చట్టసభల్లో సీట్ల పెంపుపై సీఎం రేవంత్ వాదన విన్నారా?
చట్ట సభల్లో సీట్ల పెంపుపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ సరికొత్త ఫార్ములాను తెర మీదకు తీసుకొచ్చారు.
By: Garuda Media | 14 April 2026 2:00 PM ISTచట్ట సభల్లో సీట్ల పెంపుపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ సరికొత్త ఫార్ములాను తెర మీదకు తీసుకొచ్చారు. నియోజకవర్గాల పునర్విభజన.. సీట్ల పెంపు బిల్లులపై కేంద్రం చేస్తున్న ప్రతిపాదనకు భిన్నంగా కొత్త వాదనను తొలిసారి వినిపించారు తెలంగాణ ముఖ్యమంత్రి. నియోజకవర్గాల పునర్విభజన సీట్ల పెంపు కేవలం జనాభా ప్రాతిపదికన చేయటం సరికాదన్నది ఆయన వాదన. కేంద్రంలోని మోడీ సర్కారు నియోజకవర్గాల పెంపుపై ఈ మధ్యన కీలక ప్రకటన చేయటం తెలిసిందే. ఉదాహరణకు ఒక రాష్ట్రంలో వంద అసెంబ్లీ సీట్లు ఉంటే.. యాభై సీట్లు పెంచేలా..తమదైన ఫార్ములాను తెర మీదకు తీసుకొచ్చారు.
ఇందుకు భిన్నంగా సీఎం రేవంత్ మాత్రం.. దేశ ఆర్థిక నిర్మాణం.. రాష్ట్రాల భాగస్వామ్యాన్ని పరిగణలోకి తీసుకొని సీట్ల పెంపు జరగాలన్న డిమాండ్ ను తెర మీదకు తీసుకొచ్చారు. ఇందుకోసం హైబ్రిడ్ మోడల్ అవసరమన్న రేవంత్.. ‘‘పెంచాలని భావిస్తున్న 272 లోక్ సభ స్థానాల్లో 136 సీట్లను జనాభా ప్రాతిపదికన.. మరో 136సీట్లను జీఎస్ డీపీ ఆధారంగా ఆయా రాష్ట్రాలకు కేటాయించాలి. ఈ నెల 16-18 తేదీల్లో మహిళా రిజర్వేషన్.. డీలిమిటేషన్ పై పార్లమెంటు ప్రత్యేకంగా సమావేశం కానున్న వేళ.. తన మంత్రివర్గ సహచరులు.. ఎంపీలతో కలిసి మీడియా భేటీని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేవారు. దక్షిణాది రాష్ట్రాలు దేశానికి ఆదాయం.. ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయని.. జాతీయ స్థూల ఉత్పత్తి జీఎస్ డీపీలో దక్షిణాది రాష్ట్రాలే ముందున్న విషయాన్ని గుర్తు చేశారు. అలాంటి రాష్ట్రాలను శిక్షించటం తగదన్న సీఎం రేవంత్.. ‘‘పన్నులు కట్టడం.. సలాం కొట్టడం అనే తీరుకు మేం వ్యతిరేకం. అందుకే హైబ్రిడ్ మోడల్ ను ప్రతిపాదిస్తున్నాం. లోక్ సభలో ప్రస్తుతం ఉన్న 543 సీట్లను 50 శాతం మేర పెంచితే సీట్లు 816కు చేరుతాయి. ఇందులో పెరిగే 272 స్థానాల్లో దామాషా ప్రకారం 136 స్థానాల్ని పెంచి.. మరో 136 సీట్లను ఆర్థికంగా దేశానికి అందిస్తున్ సేవల ఆధారంగా పెంచాలి. ఈ సీట్ల పునర్విభజనపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి. నిపుణులు కమిటీని ఏర్పాటు చేయాలి. అన్ని రాష్ట్ర అసెంబ్లీల్లో చర్చించాలి. పార్లమెంటులో సమగ్రంగా చర్చించి.. నిర్ణయం తీసుకోవాలి’’ అని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
చట్టసభల్లో సీట్ల పెంపు అంశంలో 2027 మార్చి 31లోపు జనగణన.. 2028 మార్చి వరకు పునర్విభజనను పూర్తి చేసి.. 2029లో పెరిగిన సీట్లతో ఎన్నికలకు వెళ్లొచ్చంటూ తన ప్రతిపాదనకు అవసరమైన టైం లైన్ ను సీఎం రేవంత్ ప్రకటించటం గమనార్హం. నియోజకవర్గాల పునర్విభజనను.. మహిళా రిజర్వేషన్ బిల్లును ఒకటిగా చూపిస్తూ కేంద్రం హడావుడి చేస్తుందన్న సీఎం రేవంత్.. ఈ రెండింటికి ఎలాంటి సంబంధం లేదని.. ఈ రెండు వేర్వేరు అంశాలుగా పేర్కొన్నారు. అందుకు తగ్ట్లే.. వేర్వేరుగా చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు.
సోనియాగాంధీ నాయకత్వంలోమహిళా రిజర్వేషన్ బిల్లు 2013లోరాజ్యసభలో ఆమోదం పొందిందని.. అప్పట్లో బీజేపీ సహకరించకపోవటంతో లోక్ సభలో నిలిచిపోయినట్లుగా గుర్తు చేశారు. 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో చర్చకు వచ్చినప్పుడు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇచ్చిందన్న సీఎం రేవంత్.. ‘‘2024 ఎన్నికల్లోనే 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసి ఉంటే 181 మహిళలు లోక్ సభలో ఉండేవారు. 2026 జనాభా లెక్కల తర్వాతే అంటే.. మహిళల హక్కుల్ని వాయిదా వేయటమే.నియోజకవర్గాల పునర్విభజనతో సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటులో పెట్టి ఆమోదించాలి’’ అని పేర్కొన్నారు.
మొత్తంగా మహిళా రిజర్వేషన్ బిల్లు.. చట్టసభల్లో పెంచాలనుకున్న సీట్ల సంఖ్య అంశాలకు సంబంధించి వేర్వేరుగా చర్చ జరగాలని భావిస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వాదనకు కేంద్రంలోని మోడీ సర్కారు ఏం సమాధానం చెబుతుంది? అంటూ ప్రశ్నించారు. తన హైబ్రిడ్ విధానాన్ని సమర్థించుకునేలా సీఎం రేవంత్ మరో ఆసక్తికర వాదనను తెర మీదకు తీసుకొచ్చారు. ‘1970లో దేశంలో కుటుంబ నియంత్రణ అమలు చేయాలని కేంద్రం నిర్ణయించినప్పుడు దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను కట్టుదిట్టంగా అమలు చేశాయి. అందుకే జనాభా తగ్గింది. ఉత్తరాదిలో నియంత్రణ లేని కారణంగా జనాభా పెరిగింది. జనాభా ఆధారంగా సీట్లు పెంచితే మంచి పని చేసిన రాష్ట్రాలను శిక్షించినట్లు అవుతుంది’’ అని వ్యాఖ్యానించారు.
దామాషా ప్రకారం 50 శాతం సీట్లు పెంచుతామన్న కేంద్రం తీరును సీఎం రేవంత్ తప్పు పట్టారు. లోక్ సభలో 20 సీట్లు ఉన్న కేరళకు.. 80 సీట్లు ఉన్న ఉత్తరప్రదేశ్ కు అంతరం ప్రస్తుతం 60 సీట్లు మాత్రమే. కానీ.. 50 శాతం పెంచితే.. 90 సీట్లకు అంతరం పెరుగుతుంది. తెలంగాణకు.. ఉత్తరప్రదేశ్ కు మధ్య 94 సీట్ల అంతరం పెరుగుతుంది. దక్షిణాదిలో 130సీట్లు ఉన్నాయి. 50 వాతం పెరిగితే. 195 అవుతాయి. 413 సీట్లు ఉన్న ఉత్తరాదిలో 621 సీట్లు అవుతాయి.దక్షిణాది.. ఉత్తరాది మధ్య అంతరం 412 కాస్తా 620 సీట్లకు పెరుగుతోంది. దీంతో.. తెలంగాణ ఒక్క రాష్ట్రంలోనే కాదు.. దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాలతో పాటు.. గోవా.. పంజాబ్.. డిల్లీ లాంటి రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. ఇది దక్షిణాది.. ఉత్తరాది మధ్య వ్యత్యాసం మరింత పెరిగితే.. దేశ సమతౌల్యాన్ని దెబ్బ తీస్తుందన్నారు. ఈ హైబ్రిడ్ విధానంపై తెలంగాణలోని ఇతర రాజకీయ పక్షాల స్పందన బయటకు రావాల్సి ఉంది.
