రెడ్డి గారి మీద డౌట్లు ?
తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతుంది ఇప్పుడు ఆసక్తిగా చర్చించుకునే సందర్భం ఉంది.
By: Satya P | 2 May 2026 8:00 AM ISTతెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతుంది ఇప్పుడు ఆసక్తిగా చర్చించుకునే సందర్భం ఉంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సగం పాలన పూర్తయింది మరొక సగం పరిపాలన కూడా మొదలైంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకున్న శక్తి యుక్తులతో ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. అయితే కాంగ్రెస్ అంటేనే ఒక మహా సముద్రం అందులో ఎంతో మంది కీలక నేతలు సీనియర్లు ఉంటారు అందరినీ కలుపుకుపోవడం అంటే అది అసాధ్యం అయినా సరే ఆ అరుదైన ఫీట్ ని సాధించి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే తొలి రోజులలో పరిస్థితి ఎలా ఉన్నా కాంగ్రెస్ సగం పాలన పూర్తయ్యేటప్పటికి తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్లలో కొందరికి అసంతృప్తి నెమ్మదిగా బయటపడుతోంది అని అంటున్నారు.
పరోక్ష విమర్శలతో :
కొందరు నేతలు రాష్ట్ర అభివృద్ధి అన్న కోణంలో మాట్లాడుతూనే సొంత ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు వీరిలో చాలా మందికి తమకు మంత్రి పదవులు రాలేదన్న ఆవేదన ఉంది, మరి కొందరికి ఇక రాదు అన్న ఒక స్పష్టత కూడా ఉంది అని అంటున్నారు. దాంతో రానున్న రెండేళ్ళలో తమ రాజకీయ భవిష్యత్తు ఇదే తీరుగా ఉంటే కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అనివార్యత ఏర్పడుతుందని కూడా ఆలోచిస్తున్నారని టాక్. ఇలా యోచిస్తున్న వాళ్ళు నెమ్మదిగా కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్నారని వినికిడి. ఈ పరిణామాలలో భాగంగానే సీనియర్ నేత అయిన జగిత్యాలకు చెందిన మాజీ మంత్రి టీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ గూటి నుంచి బీఆర్ఎస్ లోకి చేరిపోయారు. ఆయనకు అక్కడ సముచితమైన స్థానం లభించింది. దాంతో కాంగ్రెస్ లో మిగిలిన సీనియర్లలో అసంతృప్తి స్వరం వినిపిస్తున్న వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు అన్నది ఒక చర్చనీయాంశంగా ఉంది.
పదవి రాదు అంటే కనుక :
ఇక నల్గొండ జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తరచూ కాంగ్రెస్ పెద్దల మీద విమర్శలు చేస్తున్నారని అంటున్నారు. ఆయన లెక్కలు చూస్తే తనకు ఈ టెర్మ్ లో మంత్రి పదవి దక్కే చాన్స్ ఏ మాత్రం లేదని విశ్లేషించుకున్నట్లుగా ఉన్నారని అంటున్నారు. నల్గొండ జిల్లాలో ఇప్పటికే ఇద్దరు మంత్రులు ఉన్నారు అందులో ఒకరు ఆయన సొంత అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే మరొకరు ఉత్తం కుమార్ రెడ్డి. ఈ ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. ఇక సొంత కుటుంబంలో మంత్రి ఉండడంతో రాజగోపాల్ రెడ్డి కి ఏ విధంగా చూసినా మంత్రి పదవి దక్కదు అన్న విశ్లేషణలు ఉన్నాయి.
వ్యాఖ్యల వెనక వేరే అర్ధాలు :
దాంతో పాటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆయనకు ఏమంత పెద్ద సఖ్యత కూడా లేదని అంటున్నారు. దాంతో ఆయన అడపా తడపా పరోక్షంగా విమర్శలు చేస్తూ అసంతృప్తిని చాటుకుంటున్నారని అంటున్నారు. ఈ క్రమంలో ఆయన తాజాగా కేసీఆర్ మీద చేసిన అనుకూల వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలలో చర్చకు తెర తీశాయని అంటున్నారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత కీలకమైన నాయకుడిగా రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. అంతే కాదు ఉద్యమ నేతగా కూడా అభివర్ణించారు. ఆయన కవిత పార్టీ మీద విమర్శలు చేస్తూ నేరుగా కవితని ఎటాక్ చేశారు. సొంత తండ్రిని ఉద్యమ నేతని గౌరవించలేని కవిత తెలంగాణ ప్రజలకు ఏ విధంగా అమ్మ అవుతుందని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. దీనిని బట్టి చూస్తే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల వెనక వేరే అర్ధాలు ఉన్నాయా అన్న చర్చ కూడా సాగుతోంది. ఆయన ఉన్నట్లుంది కేసీఆర్ పొగడంతో ఏ రకమైన సంకేతాలు ఇస్తున్నారు కూడా ఆలోచిస్తున్నారు.
సీరియస్ స్టెప్ దిశగా :
మరోవైపు చూస్తే ఇటీవల ఒక వివాహ కేటీఆర్ రాజగోపాల్ రెడ్డి కలిసి ఉల్లాసంగా మాట్లాడుకోవడం కూడా కొత్త అనుమానాలకు దారి తీస్తోంది అని అంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే రాజగోపాల్ రెడ్డి సీరియస్ స్టెప్ తీసుకుంటారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఇంకా రెండున్నరేళ్ళ అధికారం కాంగ్రెస్ కి ఉన్న నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి ఆచీ తూచీ అడుగులు వేస్తారని అంటున్నారు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఎన్నికలు ఏడాదికి ముందు మాత్రమే తీసుకుంటారని ప్రచారం సాగుతోంది. కేవలం రాజగోపాల్ రెడ్డి మాత్రమే కాదు కాంగ్రెస్ లో అసంతృప్తితో ఉన్న ఇతర నేతలు కూడా ఎన్నికల ఏడాదిలో తమ రాజకీయ భవిష్యత్తు మీద కీలక ఆలోచనలు చేస్తారని ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
