Begin typing your search above and press return to search.

మిఠాయి ఇస్తూనే తిట్టించుకోవటమేంటి రేవంత్?

ప్రభుత్వం ఏదైనా.. ముఖ్యమంత్రిగా ఎవరున్నా.. కొన్ని విషయాల్లో ఒకే విధానాన్ని ఫాలో కావాల్సిందే తప్పించి.. తాము అనుకున్నది చేయలేని పరిస్థితి. మిగిలిన ముఖ్యమంత్రుల కంటే భిన్నంగా వ్యవహరించాలని డిసైడ్ అయినా.. ఎదురుదెబ్బలు ఖాయం.

By:  Tupaki Desk   |   6 Jun 2025 10:23 AM IST
మిఠాయి ఇస్తూనే తిట్టించుకోవటమేంటి రేవంత్?
X

ప్రభుత్వం ఏదైనా.. ముఖ్యమంత్రిగా ఎవరున్నా.. కొన్ని విషయాల్లో ఒకే విధానాన్ని ఫాలో కావాల్సిందే తప్పించి.. తాము అనుకున్నది చేయలేని పరిస్థితి. మిగిలిన ముఖ్యమంత్రుల కంటే భిన్నంగా వ్యవహరించాలని డిసైడ్ అయినా.. ఎదురుదెబ్బలు ఖాయం. ఈ విషయాన్ని గుర్తించిన ముఖ్యమంత్రులు అనవసరమైన డ్యామేజ్ కు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా మసులుకుంటారు. అందులో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల అంశంగా చెప్పాలి. ఈ విషయాన్ని కాస్తంత ఆలస్యంగా గ్రహించినట్లుంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేసీఆర్ పదేళ్ల ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా అప్పులు చేయటం.. డాబు ఖర్చులు చేసి.. రేవంత్ ప్రభుత్వం కొలువు తీరే నాటికి.. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారింది.

దీంతో.. రాష్ట్ర దారుణ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేందుకు ప్రయత్నించిన రేవంత్.. ఆ క్రమంలో తొందరపాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి అప్పులు పుట్టటం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పాలనతో తెలంగాణ ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని హైలెట్ చేయటం ఆయన ఉద్దేశమైతే.. ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణ పరువు తీసేలా మాట్లాడుతున్నారన్న భావన కలిగేలా చేశాయి. తెలంగాణ ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నారన్నట్లుగా కొన్ని వర్గాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి.

ఇలాంటి వేళలోనే ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ల మీద స్పందించిన సీఎం రేవంత్.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉందన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. తనను కోసినా ఉద్యోగుల డిమాండ్లను ఆమోదించేది లేదంటూ చేసిన వ్యాఖ్యలు ఆయన ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీసిన పరిస్థితి. నిజానికి ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల్ని చెప్పాల్సిన రీతిలో చెప్పి.. కాస్త ఓపిగ్గా ఎదురుచూస్తే.. వారి సేవలకు తగిన రీతిలో తమ ప్రభుత్వం స్పందిస్తుందన్న సంకేతాన్ని ఇచ్చి ఉంటే ఎలాంటి పంచాయితీ ఉండేది కాదు. అందుకు భిన్నంగా ఖర్చుల పెంపు విషయంలో తానెంత కఠినంగా ఉంటానన్న విషయాన్ని సీఎం రేవంత్ చెప్పిన వైనం ప్రభుత్వంపై ప్రభుత్వ ఉద్యోగుల మండిపడేలా చేసింది.

ఈ ఆగ్రహాన్ని ముఖ్యమంత్రి గుర్తించినట్లుగా కనిపిస్తోంది. తాజాగా ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఏలు ఇవ్వాలని డిసైడ్ చేయటం దీనికి నిదర్శనంగా చెబుతున్నారు. ఒక కరువు భత్యాన్ని వెంటనే.. మరో డీఏను వచ్చే ఏప్రిల్ లో ఇవ్వాలన్న నిర్ణయాన్ని తాజాగా నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ప్రభుత్వానికి ఉద్యోగులు 57 డిమాండ్లను ఇవ్వగా.. వాటిని పరిశీలించిన మంత్రివర్గం.. అధికారుల కమిటీ నివేదిక ప్రకారం కొన్ని అంశాల్నిఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరికొన్నింటిని పరిశీలనకు స్వీకరించినట్లుగా పేర్కొన్నారు.

2023 జనవరి 1 నుంచి బకాయి ఉన్న డీఏల్లో ఒకటి వెంటనే చెల్లించి.. అప్పటి నుంచి బకాయి పడిన సొమ్మును 28 వాయిదాల్లో చెల్లిస్తామని పేర్కొన్నారు. మరో డీఏను వచ్చే ఏప్రిల్ లో ప్రకటించాలని నిర్ణయించారు. ఉద్యోగులు హెల్త్ కార్డులు ఇవ్వాలని అడుగుతున్నారని.. ఈ పథకం కింద ప్రతి ఉద్యోగి రూ.500 చొప్పున ఇవ్వాలని.. ఏడాది పాటు వాళ్లు జమ చేసిన సొమ్మునకు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని డిసైడ్ చేశారు. ఒక ట్రస్టును ఏర్పాటు చేసి.. ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా సదరు ట్రస్టు ద్వారా సేవలు అందించాలని నిర్ణయించారు.

కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగుల బిల్లుల్ని పెండింగ్ లో పెట్టింది. ఈ బిల్లుల్ని క్లియర్ చేయటానికి ప్రతి నెలా రూ.700 కోట్లు తగ్గకుండా చెల్లించేందుకు డిసైడ్ చేశారు. నెల వారీగా క్లియర్ చేస్తారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి జాయింట్ స్టేట్ కౌన్సిల్ ను ఏర్పాటు చేయాలని.. ఉద్యోగ సంఘాలకు గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించారు. జీవో 317లో మరికొన్ని విభాగాల్ని చేర్చాలని నిర్ణయించారు. సచివాలయంలో ఉద్యోగుల కోటా 12.5 శాతం ఉండాలని.. మెడికల్ ఇన్ వాలిడేషన్ కమిటీ ఏర్పాటుకు ఓకే చెప్పారు.

రిటైర్డు ఉద్యోగుల్ని మళ్లీ విధుల్లోకి తీసుకోకూడదని నిర్ణయించారు. డిపార్ట్ మెంటల్ ప్రమోషన్ కమిటీల సమావేశాల్ని రెగ్యులర్ గా నిర్వహించాలని నిర్ణయించారు. ఎన్నికల సమయంలో బదిలీ చేసిన అధికారుల్ని పాత స్థానాలకు పంపాలన్న డిమాండ్ కు ఆమోదం తెలిపారు. జిల్లా పరిషత్ లకు సంబంధించి కారుణ్య నియామకాలను చేపట్టాలని.. నర్సింగ్ డైరెక్టరేట్ ఏర్పాటుకు ఆమోదం పలికారు.

అంగన్ వాడీ టీచర్ల రిటైర్మెంట్ ప్రయోజనాల్ని రూ.2 లక్షలకు పెంచేందుకు సానుకూలంగా స్పందించారు. ఉద్యోగుల వాహన అద్దెల్ని వెంటనే క్లియర్ చేయటంతో పాటు.. వారికిచ్చే ధరను పెంచాలని నిర్ణయించారు. ఇలా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పలు అంశాలకు సానుకూలంగా స్పందించిన వైనం చూసిన తర్వాత.. వరాల మూట విప్పే ముందుకు ‘కోసుడు’ (నన్నునిలువునా కోసినా నేనేం ఇవ్వలేను) మాటలు మాట్లాడకుండా ఎంత బాగుండేదన్న మాట వినిపించటం గమనార్హం. అందుకే అంటారు.. ఇచ్చేది ఇస్తూనే.. తిట్టించుకోవటం అవసరమా? అని. ఇప్పటికైనా సీఎం రేవంత్ గత తప్పుల్ని రిపీట్ చేయకుంటే బాగుండు.