కీలక నగరాలను మించేలా ఫ్యూచర్ సిటీ: రేవంత్ బిగ్ ప్లాన్
తాజాగా మంగళవారం ఆయన రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేట సమీపంలో ఫ్యూచర్ సిటీలో పోలీసు కమిషనరేట్ నిర్మాణానికి భూమి పూజ చేశారు.
By: Garuda Media | 29 April 2026 3:00 PM ISTదేశంలోని కీలక నగరాల స్థాయిని మించేలా ఫ్యూచర్ సిటీ ఉండాలని.. ఆమేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఫ్యూచర్ సిటీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నామన్నారు. ఇది ఒక వర్గానికి పరిమితం చేయడం లేదన్నారు.. ఐటీ, ఇండస్ట్రీ సహా.. ఇన్నోవేషన్ రంగాలకు.. వైద్య, పరిశోధన, ఔషధ రంగాలకు కూడా ఫ్యూచర్ సిటీని అందుబా టులోకి తెచ్చేలా ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. అంతేకాదు.. ఫ్యూచర్ సిటీ.. తెలంగాణకు ఐకాన్ నగరంగా ఉండాలని, దేశంలో ఇప్పటికే పురోగతిలో ఉన్న నగరాలకు మించిన నగరంగా నిర్మిస్తామని తెలిపారు.
తాజాగా మంగళవారం ఆయన రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేట సమీపంలో ఫ్యూచర్ సిటీలో పోలీసు కమిషనరేట్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. వచ్చే నాలుగు మాసా ల్లో కమిషనరేట్ నిర్మాణాన్నిపూర్తి చేయనున్నట్టు తెలిపారు. ఫ్యూచర్ సిటీలో చుట్టుపక్కల ఉన్న గ్రామాలను విలీనం చేసే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే పలు గ్రామాల సర్పంచ్‌లు.. తమ గ్రామాలనుఫ్యూచర్ సిటీలో విలీనం చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారని.. వీటిపై అధికారులు అధ్యయనం చేయాలన్నారు. సర్పంచులు, గ్రామీణ అధికారులను ఒక వేదికపైకి చేర్చి వారితో చర్చలు నిర్వహించాలన్నారు. ఫ్యూచర్ సిటీలో అందరికీ భాగస్వామ్యం ఉంటుందని సీఎం చెప్పారు.
ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా.. ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంటులో కీలక భాగస్వామ్యం వహించాలని సూచించారు. ఈ నగరాన్ని ఫ్యూచర్ జనరేషన్ కోసం నిర్మిస్తున్నామని.. తెలంగాణ భవిష్యత్తును ఈ నగరం సమూలంగా మార్చేస్తుందని తెలిపారు. అన్ని హంగులతో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామన్నారు. రహదారులు, తాగునీరు, విద్యుత్, ఇతర మౌలిక సదుపాయాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. హైదరాబాద్, సైబరాబాద్‌ల తరహాలో ఫ్యూచర్ సిటీ కూడా మంచి ఆదరణ పొందుతుందని చెప్పారు. నిర్మాణాలకు సంబంధించి.. ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తామన్నారు.
పబ్లిక్ గార్డెన్‌లో..
మరోవైపు పబ్లిక్ గార్డెన్‌లోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇక్కడ క్లబ్‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. గత ప్రభుత్వంలో ఈ ప్రతిపాదన వచ్చిందని.. అయితే.. దీనిని మూలన పడేశారని అన్నారు. పబ్లిక్ గార్డెన్‌లో ప్రత్యేకంగా వాకింట్ ట్రాక్‌లు, నీటి కొలనులు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని సమూలంగా మారుస్తున్నట్టు చెప్పారు. ప్రజాప్రతినిధులు వ్యాహ్యాళికి వెళ్లిన సందర్భంలో ఇబ్బందులు పడుతున్నా రని.. ఒకవైపు సాధారణ ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వీటిని మారుస్తామని చెప్పారు.
